జక్కయ్యకు వరమైన ఒకరోజు!
రేపటికోసం సంపాదించే ప్రయాసలో ఈరోజు జీవించడం మర్చిపోయిన అభాగ్యుడు యెరికో వాసి జక్కయ్య. అనైతికత, అపరిశుద్ధత, స్వార్థం, దురాశతో కూడిన అతని ‘ప్రతిదినం’ అపరాధ భావనతో నిండిన ‘గతం’గా మారి అతను మోయలేని బరువుగా గుదిబండగా మారింది. అలా వానికి బందీగా రేపటికోసం నేటిని మూల్యంగా చెల్లించే నిస్సహాయ బాటసారిగా సాగిన అతని జీవితం అపజయాలుకు చిరునామా అయింది. ఎంతో ఆనందానికి, ఎన్నో ఆత్మీయాశీర్వాదాలకు, మనశ్శాంతికి, పవిత్రతకు, పరోపకార కార్యాలకు కేంద్రంగా ఉండాల్సిన తన జీవితాన్ని జక్కయ్య అలా నిర్వీర్యం చేసుకున్నాడు.
రేపటి ఎండమావుల్ని వెంటాడుతూ, నిన్నటి బరువులు మోస్తూ, నేటి ఆనందాన్ని అనుభవించలేకపోతున్న ఇప్పటితరానికి రెండువేల ఏళ్ల క్రితమే జక్కయ్య ప్రతినిధి అయ్యాడు. అయితే అలా కృంగిపోయి, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న జక్కయ్యను యేసుప్రభువు ఒకరోజు సందర్శించి అతన్ని సంధించాడు. అంతదాకా వాళ్లిద్దరికీ ముఖపరిచయం లేకున్నా, ఎన్నాళ్లనుండో తానెరిగిన స్నేహితుడిలాగా పరామర్శించి, నేడు నీ ఇంట్లో బస చేస్తానని తెలిపి, అతని జీవితంలో అంతకాలంగా లేని నేటి’ని ఆవిష్కరించాడు. అంతటి రక్షకునికి బస చేసేందుకు పాపిౖయెన ఈ జక్కయ్య ఇల్లే దొరికిందా? అనుకుంటూ ముక్కున వేలేసుకున్న అక్కడి జనంతో ‘‘ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే.
ఎందుకంటే, ‘నేడు’ ఇతని ఇంటికి రక్షణ వచ్చింది’’ అంటూ ప్రభువు మరో నేటిని అతనికి బహుమానంగా ఇచ్చాడు. దైవిక సంకల్పాన్నెరిగి, దైవిక సాయంతో జీవించగలిగితే ఈ రోజుకున్న బలం అనూహ్యమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఈరోజు’ను మసకబారనీయవద్దు, నిర్వీర్యం చేసుకోవద్దు. ఇతను పాపి, లోభి అంటూ ముద్రవేసిన ఆనాటి ప్రజలందరి సమక్షంలో ‘యేసు’ ఉద్ఘాటనతో జక్కయ్య అబ్రాహాము కుమారుడు గాకా, ఇకనుండి నేను నాకున్నదంతా పేదలకిస్తానని ప్రకటించడం ద్వారా ఆ ప్రజలకే అతను మిత్రుడు, పరోపకారి అయ్యాడు.
జీవంగల దేవుని సైన్యాన్ని ఓడించడానికి సన్నతిలేని ఈ ఫిలిప్పీయుడెంత? అని దావీదు డొల్లతనంతో తలపడేందుకు సవాలు స్వీకరించిన ఒకరోజు, ఆకలితో కరకరలాడుతున్న సింహాలను దేవుని పేరిట దానియేలు ఎదుర్కొన్న ఒకరోజు, తనకున్న రెండు కాసులూ దేవునికిచ్చి ఆయనతోనే గొప్పదాతగా శ్లాఘించబడ్డ ఒక పేద విధవరాలి జీవితంలోని ఒకరోజు, ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాలి. అదే చరిత్రను మార్చుతుంది. మానవాళికే వరమవుతుంది. జీవితాన్ని వ్యర్థపరచుకునేందుకు వెయ్యి సాకులు దొరుకుతాయి. కాని జీవన సాఫల్యానికి ఒకే ఒక కారణముంటుంది. అదే దేవుడు మనల్ని దర్శించడం మాత్రం ఆయనకు తలవంచిన ఒక రోజు!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్