పరలోక ధనాన్ని ఎలా కూర్చుకోవాలి?
సువార్త
ఒక కోటీశ్వరుడు తానెంత ధనవంతుడినో తన చర్చి పాస్టర్‌కు వివరిస్తున్నాడు. తనకు ఉత్తరాన చమురు బావులు, దక్షిణాన వేలాది ఎకరాల్లో వ్యవసాయం, తూర్పున బోలెడు కర్మాగారాలు, పడమట ఎన్నో వాణిజ్య సంస్థలున్నాయన్నాడు.
‘కాని నీవు నిరుపేదవే’ ఎందుకంటే ఆ వైపు నీకేమీ లేవు కదా!’ అన్నాడా పాస్టర్ ఆకాశం వైపు చేయి చూపిస్తూ. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి విస్తారంగా పండిందట! అందువల్ల అతను తన పాతకొట్లు పడగొట్టి కొత్తవి, పెద్దవి కట్టించి చాలా ఏళ్లకు సరిపడా ధనాన్ని, ధాన్యాన్ని కూర్చుకొని ఇక తిని, తాగి సుఖించడానికి పూనుకున్నాడు.
అయితే దేవుడు పిచ్చివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నీ గతి ఏమిటి? పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నించు’ అని అతన్ని హెచ్చరించాడు (లూకా 12ః 16-21). ధనార్జన తప్పు కాదు. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, వ్యవసాయ కార్యకలాపాలు లేకపోతే మన కనీసావసరాలెలా తీరుతాయి? పేదలకు జీవనోపాధి ఎలా? కాని ధనార్జనే ధ్యేయంగా, స్వార్థమే పరమార్థంగా బతకడాన్ని, తన స్వరూపంలో సృజించబడిన మనిషిలో పరలోక భావనలు లేకపోవడాన్ని మాత్రం దేవుడు హర్షించడు.
ఎంతోమంది పనివారి అహర్నిశల శ్రమ, నీరు సూర్యరశ్మిని ధారాళంగా ఇచ్చిన దేవుని కృపతో పంట సమృద్ధిగా పండితే, అదేదో తానొక్కడి విజయమేనన్నట్టు ధనవంతుడు ఆ పంటను పనివారితో పంచుకోకుండా, దేవునికీ ఆయన భాగమివ్వకుండా తానే తిని తాగి సుఖించాలనుకోవడంలోని స్వార్థాన్ని, డొల్లతనాన్ని దేవుడెత్తి చూపించాడు. ‘నేనొకరికివ్వను, ఒకరిది తీసుకోను’ అన్నది మరికొందరి జీవన సిద్ధాంతం. సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైన తెగ.
‘నాది నాకుంది, నీది నీవే ఉంచుకో!’ అన్న యాకోబు సోదరుడు ఏశావు తాలూకు శాపగ్రస్తుల సంతతివారు (ఆది 33:9). తీసుకోకపోతే ఫరవాలేదు కానీ విశ్వాసియైనవాడు తప్పక ఇచ్చేవాడై యుండాలి. ఎందుకంటే మనలోని దైవస్వభావంలో ‘ఇచ్చే గుణం’ ఇమిడి ఉంటుంది. శ్వాస తీసుకోకుండా బతకలేనట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగువాడిని ప్రేమించకుండా, అతనికివ్వకుండా విశ్వాసి బతకలేడు.
పైకి విస్తరిస్తున్నా నానాటికీ కుచించుకుపోతున్న సమాజం, స్వభావాల మధ్య మనం బతుకుతున్నాం. ఎంత ఉన్నా ఇంకా కావాలన్న నిరంతర తాపత్రయంలో ‘తృప్తి’ ఎండమావి అయింది. పరలోకంలో ధనం కూర్చుకొమ్మని దేవుడు ఆదేశిస్తే, ఈ లోకాన్నే ధనశక్తితో పరలోకంగా మార్చుకోబోయి పీడకలలాంటి నేటి సమాజాన్ని నిర్మించుకొని దానికి బానిసలమయ్యాం. ఒకప్పుడు 9 వేల సరుకులమ్మే సూపర్ మార్కెట్‌లు పదేళ్ల తర్వాత ఇపుడు సగటున 40 వే సరుకులు అంటే నాలుగింతలు అమ్ముతున్నాయన్నది ఒక సర్వే సారాంశం. కాని మనిషి ఆనందాన్ని అవి నాలుగింతలు అధికం చేయలేదు సరికదా సగానికి తగ్గించాయి.
మనిషి నిండా ‘నేను’ అనేవాడే నిండిపోయి చుట్టూ తానే గీసుకున్న వలయానికే అతని జీవితం పరిమితమై కుళ్లి కపు కొడుతోంది. దేవుని నిజంగా ప్రేమిస్తే పాటి మనిషిని ప్రేమించకుండా విశ్వాసి బతకలేడు. దేవుడంటే చాలా ప్రేమ కాని పక్కవాడిని కనీసం కన్నెత్తి కూడా చూడననే వాడిదే కపట ప్రేమ. ‘నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్న దైవోక్తిలోనే పరలోకంలో ధనవంతులమయ్యే మార్గం ఉంది. అందుకే ‘ప్రేమించకుండా ఇవ్వగలమేమో కాని ఇవ్వకుండా ప్రేమించలేము’ అంటాడు కార్ మైఖెల్ అనే మహాభక్తుడు.
- రెవ.టి.ఎ. ప్రభుకిరణ్