
క్రీస్తు సందేశం
♦ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు
♦ దీనులను ఆదరించి అక్కున చేర్చుకోండి
♦ఆపదలో ఉన్న వారిని రక్షించండి
♦ నీతికొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి
♦మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి
♦ కనిపించే నీ సోదరుని ప్రేమించకపోతే కనిపించని దైవాన్ని ఎలా ప్రేమించగలవు?
♦ నీ కుడిచెంపను కొడితే ఎడమ చెంపను చూపు.. నా మాటలు సత్యం. అవే మిమ్ములను స్వతంత్రులను చేస్తాయి
♦ ప్రేమ నిండిన హృదయం నుండే అహింస, సహనం అలవోకగా ప్రవహిస్తాయి.
న్యూయార్కు పట్టణంలోని ఒక షాపింగ్ మాల్‌లో ఒక రోజు ఓ దుండగుడు అత్యాధునిక మారణాయుధాన్ని చేత పట్టుకొని క్యాషియర్ జెస్సీకా వైపు గురి పెడుతూ, కౌంటర్‌లో ఉన్న డబ్బంతా వెంటనే ఇవ్వకపోతే చంపేస్తానని బెదరించాడు. అయితే క్రీస్తు విశ్వాసి అయిన జñ స్సికా ఏమాత్రం చలించక, గట్టిగా ‘జీసస్ నామంలో నిన్ను ఆదేశిస్తున్నాను, నీ మారణాయుధాన్ని కింద పడేసి పారిపో’ అని అరచింది. ఆశ్చర్యంగా ఆమె ఆదేశాన్ని పాటిస్తూ దుండగుడు తన మెషీన్‌గన్ కింద పడేసి వణుకుతూ చేతులు పైకెత్తాడు. ఈలోగా మాల్‌లో ఉన్న గార్డులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దుండగుడిని విచారించగా అతడు ఇలా చెప్పాడు: ‘‘ఆ అమ్మాయి స్వరంలో నుండి ఏదో గొప్ప శక్తి వచ్చి నన్ను నిర్వీర్యుణ్ణి చేసింది. నాలో గొప్ప భయం ఉద్భవించింది. అందుకే లొంగిపోవలసి వచ్చింది’’.. అని.
క్రీస్తు నామంలో గొప్ప శక్తి ఉంది. దానిని గుర్తించి, క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తీ అన్ని పరిస్థితులలోనూ ధైర్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలడు. రేపు క్రిస్మస్. క్రిస్మస్‌ను ఉద్దేశిస్తూ, బైబిలు గ్రంథంలో ఇలా రాయబడి ఉంది: ‘ఇదిగో దావీదు పట్టణమందు నేడు ‘రక్షకుడు’ మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’’ (లూకా 2:11) రక్షకుడు అంటే రక్షించేవాడని అర్థం. ఇహ లోక రక్షకులు కేవలం శరీరాన్ని దుండగుల హింసాత్మక చర్యల నుండి రక్షించడానికి సహాయపడతారు. అయితే క్రీస్తు ప్రభువు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక రక్షకుడు. ఆయన.. శరీరాన్నే కాక నరకంలో నశించిపోకుండా, ‘ఆత్మ’ను కూడా రక్షించగల సమర్థుడు. ఆయనను విశ్వసించిన వారు పాపాన్ని అసహ్యించుకుంటారు. పుణ్యకార్యాలను చేస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. వారు దేనికీ భయపడరు. సత్యం కోసం జీవిస్తారు. సత్యాన్ని ప్రకటిస్తారు. క్రిస్మస్ శుభాకాంక్షలు.
మీకు తెలుసా?
♦ క్రైస్ట్ అంటే అభిషేకించబడిన రాజు అని, మాస్ అంటే ఆరాధించడం అని అర్థం ∙యేసు అంటే రక్షకుడు అని అర్థం
♦ మేరి లేక మరియ అనే పేరుకు అర్థం సమర్పణ
♦ ప్రజలను పాపాల నుంచి రక్షించేవాడు కనుక యేసు అయ్యాడు
♦ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత మొదటిగా ముద్రించిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ తర్జుమా అయింది
♦ యేసుక్రీస్తు మాటలే తనకు దిశానిర్దేశం చేశాయని తన ఆత్మకథలో జాతిపిత మహాత్మాగాంధీ రాసుకున్నారు
♦ ఈ భూమి మీద ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులతోనే నివసించాడు
♦ యేసుప్రభువు కాలంలో నేను జీవించి ఉంటే, ఆయన పాదాలను నా రక్తంతో కడిగి ఉండేవాణ్ణి అన్న వివేకానందుడి మాటలు మన దేశంలో క్రీస్తు పట్ల ఉన్న గౌరవాన్ని కళ్లకు కడతాయి
♦ హెబ్రూ భాషలో యేసును మెస్సయ అంటారు
♦ 16వ శతాబ్దంలో జర్మనీలోనూ, 15వ శతాబ్దంలో లివోనియా (ప్రస్తుతం లాత్వియా)లో మొదట క్రిస్మస్ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలైందంటారు
♦ శాంతాక్లాజ్ (సెయింట్ నికోలస్) క్రిస్టమస్‌కు మొదటి రోజు రాత్రి (డిసెంబర్ 24) చిన్నారులకు, పెద్దలకు కేకులను, ఆటబొమ్మలను, బహుమతుల్ని అందించే ఒక పాత్ర. శాంతా క్లాజ్ అనే పదం డచ్ భాష నుండి వచ్చింది
♦ కొందరు క్రైస్తవులు డిసెంబరు 25న, మరి కొంతమంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు.
– యస్. విజయ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment