
యేసు క్రీస్తు ముద్రలు
సందర్భం
నేడు గుడ్ ఫ్రైడే
మనందరి కొరకు బలిపశువుగా తనను తాను అర్పించుకొనుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు నామమున పాఠకులందరికీ వందనములు. ‘‘నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను’’ (గలతీ 6:17) అని చెప్పిన పౌలు మాటలు ధ్యానించతగినవి. ‘‘వీరు నా స్వంతము’’ అంటూ యేసు
ప్రభువు వేసిన ముద్రలని కొందరు వ్యాఖ్యానిస్తారు. అయితే పౌలు దమస్కు మార్గంలో యేసుప్రభువును సంధించినప్పటి నుండి, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నవాడు, హింసింపబడిన వాడిగా మారినప్పటి నుండి తాను యేసయ్య కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో తానే చెప్పాడు. 2 కొరింథీ 11:23-27లో ‘‘మరి విశేషముగా ప్రయాసపడితిని; అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని; అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని; యూదుల చేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని; అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్య జనుల వలననైన ఆపదలలోను, పట్టణములో, అరణ్యములో, సముద్రములో, కపట సహోదరుల వలని ఆపదలలో ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, జాగరణములతోను, ఆకలిదప్పులు, ఉపవాసములు, చలి, దిగంబరత్వముతోను ఉంటిని’’ అని చెప్తున్నాడు. ఈ దెబ్బల వలన వచ్చిన మచ్చలు పౌలు జీవించినంత కాలము అతని శరీరము మీద కనపడి ఉండవచ్చును. ఈ గాయాల మచ్చలను కేవలము మచ్చలుగా కాకుండ తాను ‘యేసయ్య సొత్తు’ అను సంగతిని గుర్తు చేసేందుకు వేయబడిన ముద్రలని పౌలు భావిస్తున్నాడు. ఈ ముద్రలు కేవలము చర్మము వరకే కాకుండా తన భావోద్రేకాలపైన, తన ఆత్మీయ జీవితంపైన పడ్డాయి.
ఈనాడు ఇలాంటి ముద్రలు మనము నివసించు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. దేవుని కృప వలన ప్రస్తుతము మనకు అలాంటి పరిస్థితులు లేవు, కాని మనమందరము ఆలోచించాల్సిన విషయమేమంటే ఈ ముద్రలు మన ఆత్మీయ, నైతిక, మానసిక వైఖరిపైనను, మన వ్యక్తిత్వము పైనను పడినాయా లేదా అని! మనము క్రీస్తును నమ్ముకొనిన తర్వాత పాపము విషయమై మరణించి క్రీస్తు కొరకు జీవించాలి. మన అవయవములు ఆయన అధీనంలో ఉంచి, వాటిపైన ఆయన ముద్ర వేసుకోవాలి. పౌలులాగా మన శరీరాలపైన బాహ్య గుర్తులు లేకపోయినను, హృదయంలో ముద్రించుకోవాలి. ఆయనకు మనము కట్టు బానిసలమై పోవాలి.
నిర్గమ 21:1-6లో ధర్మశాస్త్రము ప్రకారము వెలపెట్టి కొనబడిన బానిసకు 7వ సంవత్సరములో విడుదల ఇవ్వాలి. ఆ గడువు పూర్తయ్యాక తనకు విడుదల అవసరము లేదనియు, తాను జీవితాంతము తన యజమాని యొద్దనే ఉంటానని నిర్ణయము తీసుకొన్న బానిస చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉంటాడు. చెవికున్న రంధ్రము ద్వారా వాడు కట్టు బానిస అని ప్రపంచానికి తెలుస్తుంది. పౌలు అలాంటి బానిసత్వము కోరుకున్నాడు. రోమా 1:1లో ‘యేసుక్రీస్తు దాసుడను’ అని పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ముద్ర వేయించుకొని, ఆయనకు చెందిన వారమని చెప్పుకొనుటలో గొప్ప ఆధిక్యత ఉన్నది. ఈ సమాజంలో ఒకవేళ మనము ఒక గొప్ప కుటుంబానికి చెందిన వారమైతే అందును బట్టి అతిశయిస్తామేమో గాని, సర్వాధిపతియైన యేసయ్య సంబంధిగా గుర్తింపు తెచ్చుకోవడము చాలా గొప్ప ఘనత అని మనము అర్థం చేసుకోవాలి.
మనము క్రీస్తు కొరకు శ్రమపడితే, మన జీవితాల నుండి క్రీస్తు ప్రత్యక్ష పరచబడుతాడు. మహిమ పరచబడుతాడు. పరిచర్యలో శ్రమలేనిదే ఏమీ సాధించలేము. ముద్రలు కలవారు మంచి నేలన పడిన విత్తనములాంటివారు. అట్టివారు నూరంతలు గాను, అరువదంతలు గాను, ముప్పదంతలుగాను ఫలిస్తారు (మత్తయి 13:8). పౌలు యేసయ్య మార్గంలోకి రాక ముందు తన శరీరంలోని సున్నతి గుర్తును బట్టి అతిశయించాడు గాని ఇప్పుడు క్రీస్తు కొరకు శ్రమపడుట వలన వచ్చిన గుర్తులను బట్టి అతిశయిస్తున్నాడు. ఫిలిప్పీ 3:5-6 ఉన్న వాక్య భాగములో ఈ విధంగా అంటున్నాడు - ‘‘ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరముగా యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.’’ కేవలము క్రీస్తును గురించిన జ్ఞానము, క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయించు వాడిగా మారిపోయాడు. ఇంకొక సందర్భములో ఈ లోకములోని ప్రాముఖ్యమైన వాటన్నింటిని పెంటతో సమానముగా చూస్తున్నానంటున్నాడు.
‘క్రీస్తు ముద్రలు మన శరీరములో కలిగియుండుట’ అనునది మనం అన్వయించుకోవాలంటే క్రీస్తు సారూప్యములోనికి మారుతూ, ఆయన లక్షణాలు, స్వభావాలు కలిగియుండుట. మనము కొన్ని దినాలుగా సిలువ ధ్యానాలు చేసి ఉన్నాము కాబట్టి యేసుప్రభువు సిలువలో పలికిన ఏడు మాటల నుండి ఏ లక్షణాలు అలవరచుకోవాలో చూద్దాము.
‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’ (మత్తయి 5:44)లో శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు చేసి చూపిస్తున్నారు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే శత్రువులను ప్రేమించుట, క్షమించుట, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి.
ఆది 50:15-21లో యోసేపు తనను చంపచూసి, ఆ తర్వాత బానిసగా అమ్మేసిన తన అన్నల పట్ల క్రీస్తు లాంటి క్షమాపణ చూపాడు. అ.కా.7:54-60లో ఉన్న వాక్య భాగములో స్తెఫను తనను చంపేవారని క్షమించమని దేవుని వేడుకొనుటలో యేసయ్య ముద్రలు బాహ్యంగాను, అంతరంగంలోనూ చూపించాడు.
‘‘నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు’’ అని ప్రభువు తనతో పాటు సిలువ వేయబడిన దొంగతో చెప్పిన మాటల నుండి మనము నేర్చుకోవలసినది మనము చేయాల్సినది ఏమంటే మన తోటివారు మనతోపాటు పరలోకంలో ఉండాలనే తపన కలిగి ఉండాలి. ఉదాహరణకు పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో పౌలు ఇలాంటి తమ కోరికను వ్యక్తపరచారు.
‘‘అమ్మా, ఇదిగో నీ కుమారుడు’’ అని తన తల్లిని తనకు అత్యంత ప్రియమైన శిష్యునికి అప్పజెప్పడంలో తాను ధర్మశాస్త్రము నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు రాలేదని రుజువు చేసుకున్నాడు. మనము కూడా మన పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు మన జీవితము ద్వారా దేవుడు మహిమ పరచబడుతాడు.
తిమోతి తన తల్లి యునీకే, అవ్వ లోయిలను గౌరవించి, ప్రేమించి, వారు బోధించిన విషయాల ప్రకారము జీవించుట ద్వారా తాను క్రీస్తు ముద్రలు కలిగియున్నాడని రుజువు పరుచుకొన్నాడు. ‘‘నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి’’ అను మాటలో పాపముగా చేయబడిన యేసయ్య చేయి తండ్రియైన దేవుడు విడిచినట్లుగా మనకు అర్థమవుతుంది. పాపము చేసినప్పుడు పవిత్రుడైన దేవుడు మన చేయి వదిలేస్తాడను విషయము తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ, ఎప్పుడైనా పాపములో పడితే, పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధికి వెళ్లినప్పుడు మనకు క్రీస్తు ముద్రలు ఉన్నాయని తెలుసుకోగలము. 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాప హృదయము తెలుసుకోగలము. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడైనాడు.
‘‘నేను దప్పిగొనుచున్నాను’’ అనే మాటలో తండ్రిలో తండ్రితో తిరిగి ఏకము కావాలనే తృష్ణ, ఆత్మల భారము యేసయ్య కనపరుస్తున్నాడు. మనము కూడా అలాంటి కోరికలు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ముద్రలు మనలో కనబడుతాయి. ‘‘సమాప్తమైనది’’ - తండ్రి తనకప్పగించిన పని పూర్తి చేశానని చెప్తున్నాడు. 2 తిమోతి 4:7లో ‘‘మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని’’ అని పౌలు చెప్పినట్లు మనము కూడా చెప్పగలిగితే క్రీస్తు ముద్రలు మనలో ఉన్నట్లే. ‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’’ అను మాటలో యేసు ప్రభువు తిరిగి తండ్రితో ఏకమగుట చూస్తున్నాము.
మనలను సృష్టించిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. దానిని జాగ్రత్తగా ఆయనకు తిరిగి అప్పగించగలగాలి. రోమా 12:1లో సజీవ యాగముగా మనలను మనము దేవునికి అప్పగించుకోవాలని పౌలు అంటున్నాడు. పైన చెప్పబడిన విషయాలన్నీ జాగ్రత్తగా ధ్యానించి, మనము కూడా పౌలు లాగా క్రీస్తు ముద్రలు ధరించి యున్నామని చెప్పినపుడు దేవుడిని సంతోషపెట్టినవారమవుతాము. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమెన్!
‘‘తండ్రీ వీరేమి చేయున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’ (మత్తయి 5:44)లో శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు చేసి చూపిస్తున్నారు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే శత్రువులను ప్రేమించుట, క్షమించుట, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి.
బి. విమలా రెడ్డి