మెతుకును పంచిన మెదక్‌ చర్చ్‌ | Special Story About Medak Church | Sakshi
Sakshi News home page

మెతుకును పంచిన మెదక్‌ చర్చ్‌

Published Tue, Jan 5 2021 6:55 AM | Last Updated on Tue, Jan 5 2021 8:45 AM

Special Story About Medak Church - Sakshi

తీవ్ర కరువులో మెతుకు పంచుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ అండగా నిలిచి ప్రపంచంలో రెండో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన మెదక్‌లోని కెథడ్రల్‌ చర్చి ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.  అన్ని కాలాల్లోనూ చల్లగా ఉండే పంచ రంగుల బండలు.. సూర్యకిరణాలతో ప్రకాశించే గాజు కిటికి లోని అపురూప దృశ్యాలతోపాటు మెట్టుమెట్టుకో విశేషం.. అన్నింటికీ అర్థాలతో మహిమాన్విత చర్చిగా వెలుగొందుతున్న మెదక్‌ చర్చి గురించి ... 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్‌ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్‌ చార్ల్స్‌ వాకర్‌ ఫాస్నెట్‌ 1914లో ఆరంభించారు. 1924లో దీని నిర్మాణం పూర్తయింది. దీనికి అప్పుడు అయిన వ్యయం రూ.14 లక్షలు. దీనిని ఎంతో అపురూపంగా నిర్మించారు. చర్చి లోపలకు, వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ ఐదు కాండాలకు గుర్తుగా ఐదు ద్వారాలు నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరుపక్కల రెండేసి చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలకు వెళ్లాలి.

40 స్తంభాలు.. 40 రోజల ఉపవాసాలు
చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పై కప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు.

66 దిమ్మెలు.. 66 గ్రంథాలు
చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్‌ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్‌లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తున్నాయి.

12 మెట్లు.. 12 మంది శిష్యులు 
ఏసు ప్రభువుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధనలు చేశారు. (మార్కు సువార్త 16:15) ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు నిర్మించారు.


సూర్యకిరణాలు... సుందర దృశ్యాలు
చర్చిలో మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంక్‌ ఓ సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనపడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి.. పడమరన అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా.. ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు, పడమరనపడే కాంతి పుంజాలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది.. ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి.. వేర్వేరు సంవత్సరాల్లో అమర్చారు.

తూర్పు కిటికీ.. ఏసు జన్మ వృత్తాంతం 
ఏసు పుట్టుకను తెలియజేసేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో ఏసుప్రభువు తల్లి మరియ, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు, ఎడమ వైపు గొల్లలు, మధ్యలో గాబ్రియల్, లోక రక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. పైభాగంలో ఏసుకు ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్ద మనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టుకకు 700 ఏళ్ల క్రితమే ఏసు ప్రభువు పుడతాడని యేషయా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయనకు గుర్తుగా ఈ కిటికీలో పెద్దమనిషిని పెట్టినట్లు ప్రతీతి.

పడమర కిటికీ.. ఏసు సిలువ వృత్తాంతం 
ఏసు సిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందించిన ఈ కిటికీని 1958లో అమర్చారు. సిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చుని ఉన్న తల్లి మరియ, మీద చేయి పట్టుకుని నిలబడిన మగ్దలేని మరియ దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతోపాటు ఏసు శిష్యుడు యోహాన్‌ పబ్బతి (దండం) పెడుతూ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్‌కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్లకు కడతాయి. కుడివైపు బల్లెంపట్టుకుని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తారు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో వాక్యాలు ఉన్నాయి. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌ సూచన మేరకు మూడు భాషల్లో వాక్యాలు పెట్టినట్లు పెద్దలు చెబుతున్నారు.
– కిశోర్‌ పెరుమాండ్ల, సాక్షి, మెదక్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement