ప్రేమ పునరుత్థానం | Funday cover story of the week:Today is Easter | Sakshi
Sakshi News home page

ప్రేమ పునరుత్థానం

Published Sun, Apr 21 2019 12:16 AM | Last Updated on Sun, Apr 21 2019 12:16 AM

Funday cover story of the week:Today is Easter - Sakshi

 చాలా ఏళ్ల కిందట ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఒక చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకులు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చారు. విశ్వఖ్యాతిని ఆర్జించిన ఎందరో మహనీయుల కుంచెల నుంచి జాలువారిన అద్భుతమైన కళాఖండాలు, చిత్రపటాలు దానిలో ఉంచబడ్డాయి. వచ్చినవారంతా అక్కడ ఉంచబడిన వాటిని నిశితంగా పరిశీలిస్తూ ఆ చిత్రపటాలు ప్రతిబింబించే వింతైన విషయాలను శ్లాఘిస్తున్నారు. కొన్ని రోజులు ఆ చిత్రప్రదర్శన చక్కగా కొనసాగింది. చివరిరోజున కొంచెం రద్దీ పెరిగింది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చి కలియతిరిగి వారి దారినవారు వెళ్ళిపోతున్నారు. 
ఇంతలో ఒక్కొక్క చిత్రపటాన్ని పరిశీలించుకుంటూ వచ్చిన ఒక యువకుడు ఒక మూల వేలాడదీసిన ఒక చిత్రపటాన్ని చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు. తన ముందున్న ఒక దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూడడం ప్రారంభించాడు. తనకు తెలియకుండానే కళ్ళు చెమర్చడం ప్రారంభించాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిన్న మూలుగు మొదలైంది.చెక్కిళ్ళ మీద నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ఏదో ఒక విషయం అతన్ని చాలా ఎక్కువగా కదిలిస్తోంది. చాలామంది అతన్ని దాటుకుంటూ ముందుకు సాగిపోయారు. తను మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోతున్నాడు. మధ్యాహ్నం గతించినా అక్కడే నిలబడి ఉన్నాడు. సాయంత్రం చిత్రప్రదర్శన ముగింపు సమయం వచ్చింది. నిర్వాహకుడు దగ్గరకు వచ్చి బయటకు వెళ్ళమని ఆ యువకుని కోరాడు. వెక్కివెక్కి ఏడుస్తూ ఆ యువకుడు బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని వేల చిత్రపటాలు ఉన్నప్పటికీ అతన్ని అంతగా కదిలించినదేమిటని ఆ నిర్వాహకుడు తన ముందున్న చిత్రపటాన్ని చూశాడు. దానిలో యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వ్రేలాడుతుండగా, అతని చేతుల్లో, కాళ్ళల్లో మేకులు కొట్టబడియున్నాయి. తలలో ముళ్ళకిరీటం ఉంది. ప్రక్కలో బల్లెపుపోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాటితో పాటు ఆ చిత్రపటంలో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ‘‘నేను నిన్ను ప్రేమించి నీ కోసం ఇదంతా చేశాను...నీవు నా కోసం ఏం చేశావు’’. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చిత్రపటాన్ని తదేకంగా చూస్తున్న యువకుడు ఈ మాటలనే ఆలోచించడం ప్రారంభించాడు. యేసు చేసిన త్యాగం అతన్ని కదిలించింది. అంతవరకు అధ్వాన జీవితాన్ని జీవించిన ఆ యువకుడు ఆ క్షణం నుంచి మంచివ్యక్తిగా జీవించడం ప్రారంభించాడు. మార్పు అనేది పరమాత్ముని గుండెల్లోనికి ఆహ్వానించడంతోనే ప్రారంభమౌతుంది. 

కొన్ని దశాబ్దాల క్రితం ఓ ప్రముఖ వార్తా పత్రికలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న వ్యక్తుల జాబితా ప్రచురించింది. పురాతన, నవీన కాలాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిని గుర్తించారు. దానిలో మొదటి స్థానంలో యేసుక్రీస్తు ఉన్నారు. ‘ఆయన ఎక్కడో కుగ్రామమైన బేత్లెహేములో జన్మించినప్పటికీ ఆయన గురించి తెలియనివారెవరూ లేరు. తన జీవిత కాలంలో ఎన్నడు యుద్ధం చేయడానికి సైన్యాన్ని నడిపించలేదు... కానీ ఈనాడు అనేకుల హృదయాల్లో రాజుగా చోటు సంపాదించుకున్నారు. ఆయుధాలు ఎన్నడు ఉపయోగించలేదు... అయినా ప్రపంచాన్ని తన ప్రేమతో జయించాడు. మహోన్నతమైన జీవితాన్ని కోరుకొనేవారి కోసం క్రీస్తు ప్రభువు అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, కరుణ, త్యాగం, జాలివంటి దైవిక లక్షణాలను అలవరచుకోవడం ద్వారా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవచ్చునన్న సత్యం బోధపడింది. ఆయన జన్మ, జీవితం, బోధలు, మరణం, పునరుత్థానం ఎన్నో పాఠాలను ప్రపంచానికి నేర్పిస్తుంది. క్రీస్తు మరణం, పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది. సంవత్సరములో వచ్చే యాభై రెండు శుక్రవారాలలో ఒకదానిని శుభ శుక్రవారము (గుడ్‌ఫ్రైడే) అని పిలుస్తారు. ఆ రోజున యేసుక్రీస్తు సర్వమానవ పాప ప్రక్షాళన నిమిత్తం సిలువపై మరణించారు. పాపముల చేత, అతిక్రమములచేత బంధించబడిన మానవుని రక్షించడానికి, వ్యసనాల నుంచి విడిపించడానికి యేసు కలువరి సిలువపై మనిషి స్థానంలో ప్రాణమర్పించాడు. ఆ బల్యర్పణ ద్వారా సకలలోక ప్రజలకు దేవుని రక్షణ అందుబాటులోనికి వచ్చింది. క్షమాపణ కిరణాలు సిలువ నుంచి నలుదిశలా వ్యాపించాయి. దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తు ఊహించలేని ఆనందంతో జీవిస్తున్నారు. 

ప్రతి మంచి కార్యంవెనుక ఓ గొప్ప త్యాగం దాగిఉంటుంది. తమ బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఆశించే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలెన్నో మన కళ్ళముందున్నాయి. తండ్రి తన బిడ్డలమీద జాలిపడేలా దేవుడు కూడా తన రూపంలో సృష్టించబడిన మనుషుల మీద తన కనికరాన్ని, ప్రేమను ఎల్లవేళలా చూపిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని  ఈ లోకానికి మనుష్యాకారంలో వచ్చిన యేసు చేసిన కార్యాలన్ని తన అమూల్య ప్రేమను నిస్సందేహంగా వెల్లడించాయి. గలిలయ ప్రాంతంలో ఒక కొండమీద యేసు ప్రసంగించాడు. ఆ దివ్యసందేశం ఇప్పటికి అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంది. దానికి కొండమీద ప్రసంగం అంటారు. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను హింసించువారి కొరకు ప్రార్థించు, ఇతరులు నీకేమి చేయాలని నీవు ఆశిస్తావో వాటిని ఇతరులకు నీవు చేసి చూడు, నీ శత్రువులను కూడా ప్రేమించు’’ అని క్రీస్తు బోధించాడు. కేవలం వాటిని బోధించుటయే గాక క్రియల్లో వాటిని నెరవేర్చాడు. ఒకసారి ఒక కుష్టువ్యాధిగ్రస్తుడు ఆయన యొద్దకు వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ప్రార్థించాడు. తనకున్న వ్యాధిని బట్టి అతడు ఎవ్వరికి ఇష్టంగా లేడు అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. సమాజంచేత, ఉన్నతస్థితిలో ఉన్న మనుష్యులచేత చీదరించబడిన ఆ వ్యక్తిని ముట్టుకొని నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని చెప్పి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. అభాగ్యులను, అంటరానివారిని చేరదీసి అడుగడుగునా ప్రజలకు మేలుచేసి తన ప్రేమనంతా వారిమీద కుమ్మరించిన మహనీయుడు యేసుక్రీస్తు.    
అక్రమకారుల అన్యాయాలకు బలిపశువుగా మారి, విలవిలలాడవలసిన పరిస్థితులలో సైతం అత్యంత  క్రూరాతి క్రూరంగా చిత్రవధ గావించబడియు ఆ కలువరి సిలువలో ఆయన పలికిన ఏడు ప్రాముఖ్యమైన మాటలు నిజంగానే ఆయన వ్యక్తిత్వం బహుశ్రేష్ఠమైనదని ఋజువుచేశాయి. ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు,  చివరిమాటలు చాలా ప్రాధ్యాన్యతను సంతరించుకుంటాయి. మరణశయ్య నుంచి వెలువడే మాటలు కచ్చితంగా వారి మనసులో నుంచే వస్తాయనుటలో ఏ సందేహం లేదు. 

యవ్వనకాలంలోనే ప్రపంచాన్ని జయించి జగజ్జేతగా పిలువబడిన అలెగ్జాండరు తన చివరి సమయంలో కొన్ని నిజాలు మాట్లాడాడు. తన సమాధి పెట్టెకు రెండు రంధ్రాలు పెట్టి వాటినుండి తన రెండు చేతులు బయటకు వేయమన్నాడు. నేను ఈ భూమ్మీదకు ఒట్టి చేతులతో వచ్చాను...అవే ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని అందరికీ తెలియాలి. ప్రపంచాన్ని జయించినందుకు కాకపోయిన ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా అతనిని గ్రేట్‌ అని పిలవవచ్చు. ‘‘నా జీవితమే ఓ ప్రయోగాత్మకమైన హాస్యం’’ అని తనను గూర్చి తాను చెప్పుకున్న చార్లీ చాప్లిన్‌. మనిషి తన చరమాకంలో నిజాలు మాట్లాడుతాడు అనడానికి ఈ నిదర్శనాలు చాలవా? అయితే యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు విలక్షణమైనవి. క్షమాపణ, బాధ్యత, సంరక్షణ ఆయన చివరిమాటలో స్పష్టంగా గమనించగలము. 
ఓ దేవా! నేను పాపంలో జన్మించాను. పాపంలో జీవిస్తున్నాను. పాపంలో మరణిస్తున్నాను. నీవే శరణు కోరదగిన శరణాగత వత్సలుడవైతే నన్ను ఈ పాపము నుంచి విడిపించు అని నిత్యము ప్రార్థిస్తున్న మనిషిని విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. తన జీవిత చరమాంకంలో నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా నిరూపించగలరా అని ప్రశ్నించి తన పవిత్రతను, పరిశుద్ధతను నిరూపించుకున్నాడు.

ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలన చేసి, ఏ పాపమును లోపమును కనుగొనలేకపోయిన సమాజం ఆయన అద్భుతాలు చేసి రొట్టెలు పంచితే కడుపునిండా భుజించిన భక్త సందోహం, నానావిధ రోగాలతో, వ్యాధులతో అణగారిపోయిన ఎన్నోవేల జీవితాలు ఆయన చూపుతో, స్పర్శతో, మాటతో స్వస్థతపొంది ఆనందడోలికలో ఊరేగించబడిన అభాగ్యులు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయన ప్రేమను, దైవత్వాన్ని రుచిచూసిన ప్రతిఒక్కరు ఒక్కసారిగా ఆయనకు శత్రువులుగా మారిపోయి ఆయనను సిలువమీదే కాకుండా‘‘సిలువవేయండని’’ అరవడం ద్వారా అక్కడే ఆయన మానసికంగా, ఘోరంగా గాయపరచినా క్రీస్తు తాను చేయాలనుకున్న కార్యము నుండి వెనుతిరుగలేదు.ఆయనను వెంబడించిన శిష్యుడే కాసులకొరకు ఆశపడి ఆయనను దొంగముద్దు పెట్టుకొని అమ్మివేస్తే, ఆ రాణువవారికి అప్పగిస్తే ప్రక్కలో అందరికి కనబడేటట్టు పొడవబడిన బల్లెపు పోటుకన్నా ఆ పని ఆయన గుండెల్లో దూసుకెళ్ళిన గునపపు పోటంత నొప్పయింది. నోరు తెరువక, చిరునవ్వుతో దుఃఖమునంతా పెదవి చాటున అదిమిపట్టి వారు పెట్టిన బాధలన్ని మౌనంగా  భరించి... సిలువను మోసుకొని మేకులతో సిలువకు కొట్టబడి.... ఆ మండుటెండలో...ధారాపాతంగా ఒలుకుతున్న రక్తధారల సవ్వడిలో ...ఓ మాటకోసం నోరు తెరిచాడు క్రీస్తు.
∙∙ 
యేసుక్రీస్తు మరణించినప్పుడు ఎన్నో అద్భుత సంగతులు చోటుచేసుకున్నాయి. యెరూషలేము దేవాలయంలో ఒక పెద్ద తెర వ్రేలాడదీయబడి ఉంటుంది. సుమారుగా నాలుగు అంగుళాలు మందం కలిగిన ఆ తెర పై నుంచి కిందకు చిరిగిపోయింది. దేవుడే మనిషికి తనకు మధ్య ఉన్న తెరను తొలగించాడన్న సత్యం విశదపరచబడింది. దేవుని యొద్దకు చేరుకొనుటకు మార్గం ఏర్పడింది. సృష్టిలో విచిత్రమైన మార్పులు జరిగాయి. ఎవరైతే క్రీస్తు ప్రభువును సిలువవేయడానికి రోమన్‌ గవర్నరైన పిలాతు ద్వారా నియమించబడ్డాడో ఆ వ్యక్తి సిలువ ముందు మోకాళ్ళూని నీవు నిజముగా నీతిమంతుడవని ఒప్పుకున్నాడు. ఇతనియందు ఏ దోషము నాకు కనబడడంలేదని అంతకు ముందే తీర్పు తీర్చిన పిలాతు ఒప్పకోక తప్పలేదు.  యేసుక్రీస్తు వ్రేలాడదీయబడిన సిలువపై ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే విలాసము ఉంచబడింది. ఆ వ్రాత ఆనాటి కాలంలో ప్రసిద్ధిగాంచిన హెబ్రీ, లాటిన్, గ్రీకు భాషల్లో వ్రాయబడింది. ఆవైపు వెళ్తున్న ప్రజలంతా దానిని చదవాలని అలా చేసారు. ఈ మూడు భాషలు క్రీస్తు యొక్క సర్వాధికారాన్ని సూచిస్తున్నాయి. క్రీస్తు సిలువపై మరణించాడనుటకు బైబిల్‌ ఆధారాలు మాత్రమే గాక చారిత్రక, శాస్త్రీయ ఋజువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని మనుష్యులందరి కోసం అర్పించాడు. త్యాగనిరతిని చాటిచెప్పాడు. నిజమైన ప్రేమను ఋజువు చేశాడు. 

అరిమతయియ యోసేపు మరియు నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువ నుంచి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిçస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునర్‌ అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. 

గుడ్‌ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం ఈస్టర్‌ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంతోష ఆనందాలతో జరుపుకుంటారు. మరణాన్ని జయించిన క్రీస్తును కొనియాడుతూ ఆత్మలో పరశిస్తారు. యేసుక్రీస్తు ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. మొదటి శతాబ్దపు తత్వజ్ఞానుల్లో ఒకడైన పౌలు క్రీస్తు జీవితాన్ని సంపూర్తిగా అధ్యయనం చేసి ఇలా అంటాడు. ‘క్రీస్తు మృతులలోనుండి లేపబడియుండని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే’. వీరాధి వీరులు, శూరాధి శూరులు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు, గండపెండేరములు సంపాదించిన కవీశ్వరులు, విప్లవకారులు మరియు కళాకారులు ఎందరో మరణం ముంగిట తలవంచితే రెండువేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ముందు మరణమే తలవంచింది.

ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికీ ఫరోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫరోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్‌ సీజర్‌ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు.  యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది.క్రీస్తు పునరుత్థానము మనిషిలో ఉన్న భయాలను పోగొట్టింది. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోండంటూ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారవేత్త పిలుపునిచ్చాడు. ఆ పని జరిగిందో లేదో తెలియదు గానీ మనిషి మాత్రం భయం గుప్పెట్లోకి వెళ్ళిపోయాడన్నది గమనార్హం. ప్రతి మనిషి ఏదోక భయంతో అల్లాడిపోతున్నాడు. గత జీవితంలో చేసిన తప్పిదాల వలన, భవిషత్తులో ఏం జరుగబోతుందన్న ఆందోళన వలన, ఛిద్రమౌతున్న బంధాలను బట్టి మానవుడు విపరీతంగా కృంగిపోతున్నాడు. అన్నిటికన్నా మనిషిని భయపెట్టేది మరణం. కడపట నశింపచేయు శత్రువు మరణం. క్రీస్తు మరణాన్ని జయించి తిరిగిలేవడం వలన మరణం తరువాత కూడా మహోన్నతమైన జీవితం ఉందని ఋజువుచేశాడు. ఆదివారం ఉదయమున స్త్రీలు సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పూయాలని ఆశించగా వారక్కడ ఖాళీ సమాధిని చూశారు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచియున్నాడు. ఆకాశం భూమి గతించినా దేవుని మాటలు ఎన్నడును గతించవు. భయంతో వణికిపోతున్న స్త్రీలకు వచ్చిన వాగ్దానం ‘భయపడకుడి’. పునరుత్థానుడైన యేసు తనకు కనబడినవారికందరికి ఇచ్చిన శక్తివంతమైన వాగ్ధానం ఇదే. దేవుడు మనకు రక్షకుడుగా వెలుగుగా ఉంటాడు గనుక మనిషి  భయపడనక్కరలేదు. భౌతిక ప్రపంచంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా భయం అనేది పతనానికి దారితీస్తుంది. సంకల్పశక్తి, మహాబల సంపన్నత దేవుని పాదాల చెంత లభిస్తుంది. సర్వశక్తుడు మనలో ఉన్న అచేతనాన్ని తన దివ్యశక్తి ద్వారా చైతన్యపరుస్తాడు. సూక్ష్మమైన పరమాణువులలో ఉన్న శక్తి చైతన్యపరచినప్పుడే గదా అపరిమితమైన శక్తి వెలువడుతుంది. ఇకపై వ్యాధులకు, బాధలకు, శోధనలకు, శత్రువైన సాతానుకు, భవిష్యత్తు కొరకు భయమక్కరలేదు. దేవుడు శాశ్వతకాలం తన ప్రజలతో ఉంటాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరుంది. దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’.

క్రీస్తు పునరుత్థానం ‘సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వతంగా సమాధి చేయలేరన్న సత్యాన్ని నిరూపించింది’. నేనే సత్యమని క్రీస్తు తెలియచేశాడు. శాస్తుల్రు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు, రోమన్లు అందరూ కలిసి క్రీస్తును హింసించి, సంహరించి సమాధిలో ఉంచారు. సత్యాన్ని సమాధి చేసేశాం అంటూ పండుగ చేసుకున్నారు. కానీ వారి అంచనాలు తలక్రిందులై పోయాయి. మరణపు మెడలు వంచుతూ, సమాధిని చీల్చుకుంటూ క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు. సమాధిముందు ఉంచబడిన రాణువవారుగానీ, రెండు టన్నుల రాయి గానీ క్రీస్తు ప్రభంజనాన్ని అడ్డులేకపోయాయి. అబద్ధం కొంతకాలమే మనిషిని ఊరిస్తుంది. సత్యం ఎప్పటికి నిలుస్తుంది. అంతిమ విజయం సత్యానిదే. క్రీస్తు పునరుత్థానం వలన సర్వలోకానికి శుభం కలిగింది. కలవరంతో, ఆందోళనతో నిండియున్న వారికి మీకు శుభమగును గాక అనే వాగ్దానం క్రీస్తు నుండి అందింది. తన భక్తులతోను తన ప్రజలతోను దేవుడు శుభవచనం సెలవిస్తాడు అనేది బైబిల్‌ వాగ్దానం. దేవుడు మంచివాడు గనుక తనను ఆశ్రయించినవారికి తప్పకుండా మంచి చేస్తాడు. సర్వశక్తుడు ఏ ఒక్కరికీ కీడు చేయడు. సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు మానవుడు అనుభవిస్తాడు. దేవుడు తన బిడ్డల అవసరాలు తీర్చువాడు. తన దివ్యానుభూతితో, మధురాతిశయంతో, ఆనంద పారవశ్యంతో నింపేవాడు. ఆయన పాదాలను తేరి చూచేవారికి ఏలోటూ లేదు. ఉండదు కూడా. ఆయన దివ్య తేజస్సును మనసారా ఆస్వాదించడమే జీవిత పరమార్థం.

క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతుంది. శాంతిగా బ్రతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బ్రతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్‌ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్‌ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తూ ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. 

జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్‌ లూథర్‌ గురించి తెలియనివారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థ జీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. మార్పు అనేది ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి ద్వారా ప్రారంభమవ్వాల్సిందే కదా. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే.ఒకరోజు మార్టిన్‌ లూథర్‌ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. గమ్యాన్ని చేరుకోలేనేమోనన్న భయం వెంటాడుతుంది. తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్‌ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్‌ ముందు నిలువబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. 

‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను... దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్‌. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్‌ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్‌ లూథర్‌ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికి బెదిరిపోడు... చింతించడు’. ‘తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్‌ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు.  ఇశ్రాయేలు దేశంలో ఝెరూషలేములో యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. నిరాశ నిస్పహలతో అంతమొందే మానవ జీవితానికి ఈ ఈస్టర్‌ అనగా యేసుక్రీస్తు పునరుత్థానం గొప్ప నిరీక్షణ యిస్తున్నది. నా కొరకు ఒకరు మరణించడమే కాదు నన్ను బలపరచి నాకు ఎల్లప్పుడు తోడుగా వుండటం కొరకు మరణాన్ని కూడా జయించి తిరిగి లేవడమనేది ఎంత ఆశాజనకమైన, ఆనందకరమైన భావన!!!

చివరగా ఒక్కమాట! భవిష్యత్తుమీద భయంతో, కలవరంతో జీవిస్తున్న ప్రియ మిత్రమా! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం పరలోకాన్ని విడచివచ్చి నీ స్థానాన్ని సిలువలో తీసుకొని నీకు బదులుగా మరణించాడు. దేవుడు నీకేం ఇచ్చాడని ఎవరైనా ప్రశ్నిస్తే ‘నా దేవుడు నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు’ అని చెప్పగలగడం ఎంత గొప్ప విషయం. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కొని నిరాశలో జీవిస్తున్నావా? కీడు జరుగుతుందేమోనన్న భయం నిన్ను వేదిస్తుందా? అయితే క్రీస్తు నామాన్ని స్మరించు. మధుమధురమైన ఆయన నామ స్మరణ నీకు అన్ని విషయాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. మరణాన్ని జయించిన క్రీస్తు సమస్త విషయాల్లో నిన్ను ఆశ్వీరదించగలడు. కీడు నీ పాదాలను తాకకముందే నిన్ను తన కౌగిట్లోకి లాక్కుంటాడు. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని చెప్పి నిన్ను ఊరడిస్తాడు. అంతులేని ఆనందంతో తేలియాడతావు. మహోన్నతుడైన దేవుడు నీ పట్ల కలిగియున్న ప్రణాళికలను గుర్తించి పరవశిస్తావు. నిరాశ చీకట్లు తొలగిపోయి ఆధ్యాత్మిక జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి. 
ప్రతి ఒక్కరికి గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్‌ శుభాకాంక్షలు. 

క్షమాపణ
సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు పలికిన మొదటి మాట.‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’... ఇది దైవిక క్షమాపణ ఔన్నత్యాన్ని తెలిపే మాట. దేవుడు మనలను క్షమించువాడు. మనిషికి నిజమైన ఆనందం క్షమాపణ ద్వారానే లభిస్తుంది. కొన్నిసార్లు మనిషిచేసిన తప్పులను, పాపాలను సొంత కుటుంబ సభ్యులే క్షమించలేకపోవచ్చు. మానవుని క్షమాపణకు కొన్ని సరిహద్దులుంటాయి. దేవుని క్షమాపణ అవధులు లేనిది. తనను అతి క్రూరంగా హింసించిన వారిని, శ్రమపెట్టిన వారిని సైతం క్షమిస్తున్న ప్రేమ దేవునిది. నీవు దేవుని కుమారుడవైతే సిలువ దిగిరా నిన్ను నమ్ముతాం అనే సవాళ్ళు వినబడుతున్నా...నీవు రాజువట గదా ఈ మాత్రం గౌరవం చాలా? లేక ఇంకా ఎక్కువ కావాలా అనే హేళన మాటలు తూటాలా గుచ్చుకుంటున్న వేళ క్రీస్తు పలికిన ఈ మా మానవ ఊహకు అందనిది. మిమ్మును హింసించువారికోసం ప్రార్థించండి అని తాను చేసిన బోధను ఆచరణలో పెట్టిన ఆయన మనస్సు ఎంత ఉత్తమమైనది. చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో తాము చేస్తున్న ఆధ్యాత్మిక మరియు సాంఘిక కార్యక్రమాలకు కృతజ్ఞత తెలపడానికి బదులు అతి కిరాతకంగా గ్రాహవ్‌ు స్టెయిన్స్‌ మరియు ఆయన ఇద్దరు కుమారులను పొట్టన పెట్టుకున్న వ్యక్తులను నేను మనసారా క్షమిస్తున్నాను అని చెప్పిన గ్లాడిస్‌కు స్ఫూర్తి క్రీస్తు సిలువలో పలికిన మాట కాదంటారా? ఒక మనిషిని తోటి మనిషి క్షమించకపోవచ్చు. చట్టాలు, వ్యవస్థలు క్షమించకపోవచ్చు గానీ దేవుని పాదాల చెంతకు వచ్చి ఆ తప్పిదాలను, పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. తన శాంతితో, సమాధానంతో నింపుతాడు. 

రక్షణ
సిలువలో క్రీస్తు పలికిన రెండవ మాట ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’. ఇది రక్షణ ప్రాముఖ్యతను తెలిపే మాట. కలువరిగిరిపై క్రీస్తు సిలువవేయబడినప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు వ్రేలాయవేయబడ్డారు. వాస్తవానికి యేసుక్రీస్తు బరబ్బా అనే బందిపోటు స్థానంలో వ్రేలాడవేయబడ్డాడు. ఎడమప్రక్కన సిలువవేయబడినవాడు క్రీస్తును దూషించాడు. అయితే కుడి ప్రక్కన సిలువవేయబడిన దొంగ పశ్చాత్తాపంతో క్రీస్తును వేడుకున్నాడు. మరణం తరువాత మరొక జీవితం ఉందని...ఆ రాజ్యాన్ని క్రీస్తు ప్రభువు ప్రసాదించగలడని నమ్మి యేసూ! నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అంత వేదనలో సైతం అతని పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలుకు శుభకరమైన జవాబిచ్చి... తన పరదైసులో చోటిస్తానని వాగ్దానం చేసాడు. పశ్చాత్తాపపడితే ఎంతటి హీనులనైనా తన అద్భుత రాజ్యంలో చోటుందని ప్రకటించాడు. చుట్టూ ఉన్నవారు ఎంతో సేపటి నుంచి ఏవేవో చేయమని అడిగారు. ఎడమవైపున వ్రేలాడదీయబడినవాడు కూడా రక్షించమని అడిగాడు. వారి ప్రార్థనలకు, విన్నపములకు జవాబు రాకపోవడానికి కారణం అవి హృదయపు లోతుల్లోనుండి వచ్చినవి కావు. ఒక మనిషి చేసే యథార్ధమైన మరియు నిస్వార్థమైన ప్రార్థనలకు క్రీస్తు దగ్గర ఎప్పుడూ ఓ గొప్ప సమాధానం సిద్ధంగా ఉంటుంది. కరడు కట్టిన ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభువు వెంటనే రక్షణ ప్రసాదించాడు. అది శరీర సంబంధమైనది కాదు. ఆత్మ రక్షణ ప్రసాదించాడు. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థము. రక్షణ అనగా శిక్ష నుంచి తప్పించబడుట. నశించినదానిని వెదకి రక్షించుటకు తాను ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని యేసు ఆయా సందర్భాల్లో «ధ్రువీకరించాడు. 

బాధ్యత
సిలువలో క్రీస్తు పలికిన మూడవ మాట ‘‘అమ్మా ఇదిగో నీ కుమారుడు! శిష్యునితో ఇదిగో నీ తల్లి’’. ఇది సంబంధ బాంధవ్యాలను తెలిపే మాట. ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయవద్దు,  నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేవి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న విశిష్ట సత్యాలు. అంత అధికమైన సిలువ శ్రమలో సైతం తనకు శారీరకంగా జన్మనిచ్చిన తల్లికి ఆదరణ కనుపరచి ఆమె యెడల బాధ్యతను వ్యక్తం చేశాడు. ఎడబాటును తట్టుకోలేక దుఃఖిస్తున్న తన తల్లికి ఆదరణిచ్చాడు. తనకు ప్రాణప్రదంగా ప్రేమించిన శిష్యుణ్ణి అనా«థగా వదలక తన తల్లినే అతనికి తల్లిగా అందించాడు. తనను నమ్మకంగా వెంబడించి, తన చిత్తాన్ని నెరవేర్చేవారిని అనాథలుగా చేయనని వారిని ఆదుకొనే దేవుడనని ఋజువుచేశాడు. తల్లిదండ్రుల ఆస్తులను చేజిక్కించుకొని వారిని నడిరోడ్డుల మీదనో, వృద్ధాశ్రమాల్లోనో విడిచి వారి బాగోగులు పట్టించుకోని మూర్ఖస్వభావులకు క్రీస్తు చూపిన మార్గం ఎంతో గొప్పది. 

సహవాసం
సిలువలో పలికిన నాల్గవ మాట ‘నాదేవా! నాదేవా! నన్నెందుకు చేయి విడిచితివి’. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవితం అత్యంత విలక్షణమైనది. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సిలువమీద శ్రమనంతటిని సంపూర్ణ మానవుడుగా అనుభవించాడు. ఏ బేధము లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవుచున్నారు. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మనిషిని పతనం చేసింది. దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా మానవుడు ఎడబాటును అనుభవిస్తున్నాడు. అందువలననే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనిషికి నిత్యానందము లభించుట లేదు. ఆ సందర్భంలో క్రీస్తు సర్వలోక పాపములన్నింటినీ భరిస్తున్నాడు. ఆయన పాపి కాదుగాని మనుష్యులందరి కోసం పాపముగా చేయబడ్డాడు. పాపము ద్వారా ఏర్పడిన భయంకరమైన ఎడబాటు తీవ్రతను క్రీస్తు వ్యక్తం చేశాడు. తండ్రికి తనకు వున్న అన్యోన్యత పాపియైన మానవుని రక్షించే కార్యముతో తెగిపోవుటతో ఎంతో వ్య«థకు గురై తన తండ్రికి తనకు వున్న సంబంధాన్ని, ఆయన చిత్తము చేయుటలో తను చూపించిన ఆ కర్తవ్యాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేయగలిగాడు. దేవునితో సహవాసము కలిగియుండుటకు మానవుడు కోరిక కలిగియుండాలన్న సత్యాన్ని యేసు విశదీకరించాడు. మానవునికి దేవునితో సత్సంబంధం ఎంతో అవసరం. పరమాత్ముని కృప మరియు సహకారం లేకుండా మనిషి ఏమియు చేయలేడు. 

సహనం
సిలువలో క్రీస్తు పలికిన ఐదవ మాట ‘‘దప్పిగొనుచున్నాను’’. సమరయలోని సుఖారు అను గ్రామంలో పాపపు వాంఛ కలిగిన స్త్రీతో యేసు మాట్లాడుతూ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెన్నడు దప్పిగొనడు అని చెప్పాడు. మరి సిలువలో ఆయకున్న దాహం ఏమిటి? శారీరకంగా యేసుకు దాహం ఉంది. గెత్సెమనే తోటలో ఆయన్ను పట్టుకున్న దగ్గర నుండి ఎంతో భయంకరంగా హింసించారు. యెరూషలేము రోడ్లమీద సిలువను మోస్తూ అతి తీవ్రంగా అలసిపోయాడు. ఆ సమయంలో దాహం సహజమే. అయితే శారీరక దాహం కన్నా యేసులో మరొక దాహం ఉంది.  మనుష్యులందరూ పాపపు సంకెళ్ళ నుంచి విడుదల పొందాలనే కోరిక. సమసమాజ నిర్మాణం జరగాలన్న ఆకాంక్ష. మమతాను రాగాలతో ప్రజలంగా వర్ధిల్లాలనే ఆశ. శాపపు కాడి నుండి ప్రతి ఒక్కరూ విడుదల పొంది స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే కోరిక. కుల మత వర్గ బేధాలు లేకుండా ప్రజలంతా శాంతి సంతోషాలతో జీవించాలనే తపన. 

విజయం
సిలువలో క్రీస్తు పలికిన ఆరవ మాట ‘సమాప్తమైనది’. అందరూ క్రీస్తు జీవితం సమాప్తమైనదని తలంచారు. లోకరక్షణార్థం తాను చేయాలనుకున్న పుణ్యదానం సమాప్తమైనది. మనుష్యులందరి కోసం దేవుడు తలపెట్టిన నిత్య బలియాగం సంపూర్తి చేయబడింది. సృష్టికర్తయైన తాను ఏ ఉద్దేశంతో సృష్టిగా మారి వచ్చాడో ఆ కార్యం నెరవేరింది. సిలువపై తాను మరణించుట ద్వారా మనిషికున్న దాస్య శృంఖలాలు తెగిపోయాయి. విరోధియైన అపవాది తల చితికిపోయింది. శత్రు బలమంతటి మీద అఖండ విజయం అనుగ్రహించబడింది. మనిషి దుఃఖానికి, నిట్టూర్పులకు ముగింపు లభించింది. గోనెపట్టలు విప్పబడ్డాయి. సంతోష వస్త్రాలు బహుకరించబడ్డాయి. నిర్లక్ష్యం, నిర్లిప్తత తొలగిపోయాయి. 

ఆనందం
సిలువలో క్రీస్తు పలికిన ఏడవ మాట ‘తండ్రి ! నా ఆత్మను నీకప్పగించుకొనుచున్నాను’. దేవుడు మనిషిని ఎంతగా తనకు దగ్గరగా చేర్చుకున్నాడో తెలియచేసే మాట. క్రీస్తునందు విశ్వాసముంచు ఎవ్వరైనా సర్వోన్నతుడైన దేవున్ని తండ్రీ అని సంబోధించవచ్చును. ఇది విడదీయరాని ఓ అనిర్వచనీయమైన బంధం. పన్నెండు సంవత్సరాలు రక్తస్రావరోగంతో బాధపడుచున్న స్త్రీని యేసు కుమారి అని సంబోధించాడు. అది ఆమెకు ఎంతో ఊరటనిచ్చిన పిలుపు. మానవుడు అనగా పైకి కనిపించే శరీరం కాదు. వాస్తవానికి మానవుడు ఆత్మయై యన్నాడు. అతనికి ప్రాణం ఉంది. ఆత్మ, ప్రాణం శరీరంలో నివశిస్తున్నాయి. ఏనాడైనా శరీరం మృతమైతే ఆత్మ నిత్యత్వంలో నిత్యజీవం, నిత్యనరకం అనే రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి చేరుకోవాలి. ఈ భూమ్మీద ఉండగానే మానవుడు దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో సహవాసం చేస్తే నిత్యత్వంలో ఆయనతో యుగయుగాలు జీవిస్తాడు. ఇది శుభకరమైన నిరీక్షణ. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement