
మారని జీవితానికి విలువేముంది?
లోకం పాడెను సిద్ధం చేస్తే, వాళ్లనే దేవుడు పల్లకీలో ఊరేగించిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. ‘కొండ మీది ప్రసంగం’గా నేడు లోకంలో ప్రసిద్ధి చెందిన ప్రసంగాన్ని యేసుక్రీస్తు ఒక అరణ్యంలోని కొండ మీద చేశాడు.
సుబోధ
లోకం పాడెను సిద్ధం చేస్తే, వాళ్లనే దేవుడు పల్లకీలో ఊరేగించిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. ‘కొండ మీది ప్రసంగం’గా నేడు లోకంలో ప్రసిద్ధి చెందిన ప్రసంగాన్ని యేసుక్రీస్తు ఒక అరణ్యంలోని కొండ మీద చేశాడు. వేలాదిమంది అది విని ఆశ్చర్యపోయారు. అప్పట్లో సమాజ బహిష్కరణకు గురైన కుష్ఠురోగులు పట్టణాల్లోకి, దేవాలయంలోకి ప్రవేశార్హత లేక అరణ్యంలోనే జీవచ్ఛవాలుగా బతుకుతూ దిక్కులేనివారిగా చనిపోయేవారు.
అలా బహిష్కృతుడైన ఒక కుష్ఠురోగి అరణ్యంలోనే ఉంటున్న కారణంగా యేసుక్రీస్తు ప్రసంగం విన్నాడు. ‘అడగండి, మీకివ్వబడుతుంది’ అన్న ఆ ప్రసంగంలోని మాటల్ని అతడు తన జీవితానికి అన్వయించుకోవాలనుకున్నాడు (మత్తయి 7:7, 8:1-4). వెంటనే ప్రభువునాశ్రయించి, మొక్కి తనకు స్వస్థతనివ్వమని అడిగాడు.
ఆయన అతన్ని ప్రేమతో స్పర్శించి, బాగుచేస్తే, ఆ కొత్త జీవితాన్ని దేవునికే అంకితం చేసి, గొప్ప పరిచారకుడిగా మారి గత సాక్షి అయ్యాడని చరిత్ర చెబుతోంది. జీవితాలను మార్చగలిగిన మాటల్ని దేవుడు వినిపిస్తే, అవి విని ‘ఆశ్చర్యపడి’ ఏమాత్రం మార్పు లేకుండా బతికి రాలిపోయిన వాళ్లు వేలాదిమంది కాగా, అవి విని విశ్వాసిగా మారి, చరిత్రపుటల్లోకెక్కాడు ఒక కుష్ఠురోగి.
నీళ్లివ్వని నదికి, వెలుగివ్వని దివ్వెకు, మారని జీవితానికి విలువలేదు. అంతా వ్యయప్రయాసలకోర్చి దేవుణ్ణి చూసి, పూజించి, తరించేందుకు దేవాలయానికి వెళ్తారు. కాని దేవాలయ ప్రవేశార్హత లేని ఒక కుష్ఠురోగి ఆంతర్యంలో గల ఆత్మీయ తృష్ణను కనుగొని, యెరూషలేము దేవాలయంలో దేవుడైన యేసుక్రీస్తే దేవాలయం వదిలేసి అతన్ని వెదుక్కుంటూ అరణ్యంలోకి రావడం దేవుని ప్రేమకు పరాకాష్ఠ. మన ప్రార్థనలు, కానుకలు, పరిచర్యలతో కాదు, దేవుని మాటలకు తలవంచడం విధేయత చూపించడం ద్వారానే దేవుని ప్రసన్నం చేసుకోగలం. ఎంతో జ్ఞానం, బైబిల్ పరిజ్ఞానం, గంటలు గంటల ప్రార్థనానుభవమున్నా, జీవితం మారకపోతే విలువేముంది?
- రెవ. టి.ఎ.ప్రభుకిరణ్