
యేసును అమ్మేసిన యూదా!
హోలీవీక్
యేసు తన శిష్యులతో బేతనియలోని మరియ, మార్తల గృహంలో సేదతీరుతున్నాడు. కాని ఆయన శిష్యుల్లో ఒకరైన యూదా ఇస్కరియోతు యెరూషలేములో ప్రధాన యాజకులతో యేసునప్పగించేందుకు ముప్ఫై నాణేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముప్ఫై వెండి నాణేలకు సంతలో బానిసను కూడా కొనలేడు. అలాంటిది అంత తక్కువ మొత్తానికి సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణే అమ్మేసేందుకు సిద్ధమయ్యాడతను. మునుపొక విందులో ఒక స్త్రీ ఖరీదైన అత్తరుతో ప్రభువునభిషేకిస్తే, మూడొందల దీనారాల అత్తరును అలా వృధా చేసే బదులు అది అమ్మి పేదలనాదుకోవచ్చు కదా అని పోజులు కొట్టాడీ యూదా (యోహాను 12:4). యూదాకు పదవీకాంక్ష, బోలెడు కోరికలున్నాయి. ఆ కారణంగా దురాశాపరుడు, స్వార్థపరుడయ్యాడు.
బానిసలు, అత్తరు వంటి లోకాంశాల ఖరీదు తెలిసిన మహామేధావి అతను. కానీ మానవబంధాలు, ప్రేమలు, త్యాగం, దైవానుబంధం వంటి అమూల్యమైన అంశాల విలువ వారికి తెలియదు. యేసు వల్ల తన కోరికలు, కాంక్ష తీరవని అర్థమైన వెంటనే ఆయన్ను అమ్మకానికి పెట్టాడు, చివరికి జీవంతో సహా సర్వం కోల్పోయి భ్రష్టుడయ్యాడు యూదా. దేవుడు మనం కోరినదల్లా ఇవ్వడు. మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. సంపదలివ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు కాని ఆయన మహాసంతృప్తినైతే ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అల్లావుద్దీన్ దీపం కాదు, మానవాళికి పరమతండ్రి! తాను మహామేథావిననుకున్న యూదాకు ఈ చిన్నవిషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా లేదూ! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్