
హ్యాపీ ఈస్టర్!
కడుపు నిండా కరుణ... కడుపు నింపగల మహిమ. దయాదృష్టి ఎప్పుడూ ఫలభరితమే. అందుకే కాసింత రొట్టెముక్కను అమేయ అనంత ఆహార సంపదగా మార్చగల శక్తి జీసస్ సొంతం. కరుణామయమైన హృదయం వల్లనే అది సాధ్యం. ఆయన జీవన సందేశమంతా ఆ కరుణే. ఆ మృదు చేతి స్పర్శ నిండా కారుణ్యమే. రొటె ముక్కను విస్తృతం చేయగలిగిందంటే ఆయనది పెట్టే చేయి అని తెలియడం లేదా! ఆ చెయ్యి అలా శిలువ మీద ఆగిపోకూడదనీ పదుగురి ఆకలి తీర్చుతూ పగవారినీ కాచుతూ తిరిగి ఉత్థానం చెందారు జీసస్! ఈస్టర్ శుభదినాన ఆయనను తలచి కళ్లకద్దుకొని తినడం కోసమే ఈ వంటకాలు. కడుపునూ, గుండెనూ ఏకకాలంలో నింపే ప్రేమామృత ఆహారాలు.
ఈస్టర్ ఎగ్స్/మార్జిపాన్ ఎగ్స్
కావలసిన పదార్థాలు: చక్కెర – 200గ్రా., నీళ్లు – 100 మి.లీ., క్రీమ్ ఆఫ్ టాటర్ – చిటికెడు, బాదం పౌడర్ – 100 గ్రా., లిక్విడ్ గ్లూకోజ్ – 1 టీస్పూను, వెనీల ఎసెన్స్ – కొన్ని చుక్కలు, ఫుడ్ కలర్ – కావలసినంత
తయారి: ఒక పాన్‌లో చక్కెరను తీసుకొని నీళ్లు కలుపుతూ కరగపెట్టాలి. దానికి క్రీమ్ ఆఫ్ టార్టర్‌ను కలిపి స్టౌ మీద పెట్టి ఒక పొంగు వచ్చేదాకా మరిగించాలి. మంట తగ్గించి, దీనిలో బాదం పౌడర్‌ను వేసి బాగా కలియపెట్టాలి. ఈ మిశ్రమం గిన్నె అంచులను అంటి పెట్టుకోకుండా ఉండే వరకు తిప్పుతూ ఉండాలి. తరవాత స్టౌ మీద నుంచి దించి చదునుగా, నున్నగా ఉన్న పీట మీద లేదా కిచెన్ ప్లాట్‌ఫాం మీద పరవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు దానిని బాగా మెదపాలి. ఈ పదార్థాన్ని మార్కెటో దొరికే ఎగ్ లేదా రకరకాల షేప్స్‌లో దొరికే మౌల్డ్స్‌లో వేసి చల్లారబెట్టాలి. చివరగా నచ్చిన ఆకారంలో ఐసింగ్‌తో డెకరేట్ చేసుకుంటే ఆకర్షణీయమైన ఈస్టర్ ఎగ్స్ రెడీ.
స్టఫ్డ్ రోస్ట్ చికెన్
కావలసిన పదార్థాలు: కోడి – సుమారు రెండు కిలోల బరువున్నది
స్టఫింగ్‌కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ – నాలుగు స్లైసులు, ఉడకపెట్టిన క్యారట్ ముక్కలు – 1 కప్పు, ఉడకపెట్టిన బఠాణీలు – 1/4 కప్పు, బాదం పప్పులు – కొన్ని, పచ్చి మిరపకాయలు – 3, ఆలుగడ్డ – 1(ఉడకపెట్టి ముక్కలు చేయాలి), తరిగిన ఉల్లిపాయముక్కలు – 2 కప్పులు, అల్లం తరుగు – అర టీస్పూన్, తొక్క తీసి తరిగిన టొమాటో ముక్కలు – 1 కప్పు, సుల్తానాస్ – 2 టీస్పూన్‌లు, తరిగిన పుదీనా – 1 టీస్పూన్, నిమ్మరసం – ఒక కాయ నుండి తీసినది, బేకన్ ముక్కలు – సగం కప్పు(చిన్న ముక్కలు చేయాలి), చక్కెర – 1/2 టీస్పూన్, మిరియాల పొడి – 1/2 టీస్పూన్, ఉప్పు –తగినంత, నీళ్లు – తగినన్ని, బటర్ – తగినంత
తయారి: ముందుగా కోడిని (డ్రెస్సింగ్ పూర్తయ్యాక) కడిగి ఉప్పుతో రుద్ది పక్కన పెట్టుకోవాలి. కోడి లోపలి కాలేయం, గుండె మొదలైన వాటిని ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా బటర్ వేసి బ్రెడ్ ముక్కలను బ్రౌన్‌గా అయ్యే వరకు కాల్చాలి. పచ్చిమిర్చి, అల్లం, పుదీనాలను రుబ్బి ముద్దగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను బటర్‌లో దోరగా వేయించి అందులో అల్లం ముద్దను వేయాలి. దానికి చక్కెర, టొమాటో ముక్కలను కలపాలి. తరువాత ముందుగా ఉడికించిన కాలేయం, గుండె ముక్కలను వేసి ఉడికించాలి. ఇప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలు, బేకన్, ఉడికించిన కూరగాయలు, ఆలూ, డ్రైఫ్రూట్స్‌ను వేసి కలపాలి. దీనికి మిరియాల పొడి, నిమ్మకాయ రసాన్ని చేర్చాలి. ఇలా తయారైన స్టఫ్పింగ్‌ను ఉప్పు రాసి సిద్ధంగా ఉన్న కోడిలోకి కూర్చి, సూది, దారంతో కుట్టేయాలి. అవెన్‌ని 240 డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి. కోడిని అవెన్‌లో పెట్టే ముందు అవెన్ వేడిని 180 డిగ్రీలకు తగ్గించాలి. ఈ టెంపరేచర్‌లోనే కోడి అన్ని వైపులా బ్రౌన్‌గా అయ్యేవరకు రోస్ట్ చెయ్యాలి. దీనిని బయటకు తీసిన తరవాత రెండు కప్పుల వేడి నీళ్లున్న గిన్నెలో పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా తయారైన రోస్టెడ్ చికెన్‌ను ఫ్రై చేసిన ఆలూముక్కలతో సర్వ్ చెయ్యాలి.
చాక్లెట్ ఎగ్స్
కావలసిన పదార్థాలు: డార్క్ కుకింగ్ చాక్లెట్ – అరకిలో, వైట్ కోకో బటర్ – 1 టీ స్పూన్
తయారి: కుకింగ్ చాక్లెట్‌ను చిన్న ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలో వేయాలి. స్టౌ మీద ఒక పెద్దగిన్నెలో నీళ్లు పోసి మరిగించి అందులో మొదట కట్ చేసుకున్న చాక్లెట్ ముక్కల గిన్నెను ఉంచాలి. సన్న మంట మీద చాక్లెట్ ముక్కలు కరిగే వరకు కలియపెట్టాలి. చాక్లెట్ ముక్కలు పూర్తిగా కరిగిన తరవాత అందులో కోకో బటర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్‌లో వేసి 5–10 నిముషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరువాత ప్రతి రెండు మౌల్డ్స్‌ను ఐసింగ్‌తో జతచేస్తే చాక్లెట్ ఎగ్స్ రెడీ అయినట్లే. ఇవి ఎండాకాలంలో త్వరగా కరిగిపోతాయి కాబట్టి వెంటనే తినాలి.
హాట్ క్రాస్ బన్స్
కావలసిన పదార్థాలు: మైదా – 25 గ్రా, తాజా ఈస్ట్ – 1 1/2 టీస్పూన్, నీళ్లు – 135 మి.లీ., చక్కెర‡ – 50 గ్రా., కండెన్స్‌డ్ మిల్క్ – 1 టీస్పూన్, రిఫైండ్ ఆయిల్ – 1టీస్పూన్, కిస్‌మిస్ – 1 కప్పు, ఉప్పు – 1/4 టీ స్పూన్
తయారి: మైదా పిండిని జల్లెడ పట్టి మధ్యలో గుంటలా చేసుకోవాలి. దానిలో నీళ్లు, ఈస్ట్, చక్కెర వేసి కండెన్స్‌డ్ మిల్క్ కూడా చేర్చి మెత్తగా అయ్యే వరకు మెదపాలి. దీనికి రిఫైండ్ ఆయిల్ వేసి మళ్లీ మెదిపితే చపాతీల పిండిలా వస్తుంది. దీనిని ఒక గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత కిస్‌మిస్‌లు చేర్చి మరో అరగంట అలాగే ఉంచాలి. తరువాత ఈ పిండిని సున్నితంగా మళ్లీ మెదిపి చిన్న గోళీలుగా చేసుకోవాలి. వీటిని పొంగే వరకు అలాగే ఉంచి, తర్వాత బ్రష్‌తో పాలను అద్ది దాని మీద ఒక క్రాస్ (గీ) మార్క్‌ను పెట్టాలి. వీటిని 215 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వేడి మీద అవెన్‌లో పెట్టి 12–15 నిముషాల పాటు బేక్ చెయ్యాలి. ఈ బన్‌ల మీద ఇంకొక్కసారి పాలను, నూనెను బ్రష్‌తో అద్ది మరో రెండు నిముషాల పాటు అవెన్‌లో ఉంచితే పైన బాగా కాలిన హాట్ క్రాస్ బన్స్ తినడానికి సిద్ధం.
ఈస్టర్ స్పెషల్ సలాడ్
కావలసిన పదార్థాలు: ఉడికించిన బఠాణీలు – కప్పు, ఉడికించిన క్యారట్ ముక్కలు – కప్పు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు – 1 1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చి క్యాబేజీ – కప్పు, ఉడికించిన బీన్స్ ముక్కలు – సగం కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1/4 కప్పు, అక్రోట్ ముక్కలు – సగం కప్పు, కిస్‌మిస్ – 2 టీ స్పూన్‌లు, కొత్తిమీర – 2 టీ స్పూన్‌లు , సన్నగా తరిగిన క్యాప్సికమ్ – 1 టేబుల్ స్పూన్, ఉడికించిన గుడ్లు – 4, మయోనేస్ – 4 టీ స్పూన్‌లు
తయారి: ఒక పెద్ద గిన్నెలో ఈ ముక్కలన్నింటినీ వేసి మయోనేస్ కూడా చేర్చి కలపాలి. గుడ్లని నాలుగు భాగాలుగా కట్ చేసి, దీని మీద డెకరేట్ చేసుకోవాలి. కిస్‌మిస్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈస్టర్ స్పెషల్ సలాడ్ రెడీ.
ఈస్టర్ కేక్
కావలసిన పదార్థాలు: బటర్ – 110 గ్రా, చక్కెర – 110 గ్రా, గుడ్లు – 3(గిలక్కొట్టాలి), మైదా పిండి – 150 గ్రా, ఉప్పు – చిటికెడు, మిక్స్‌డ్ ఫ్రూట్ జాం – 1లేదా 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ – 1 కప్పు
బాదం పేస్ట్ తయారీకి: చక్కెర – 125 గ్రా., బాదం పౌడర్ 125గ్రా., గిలక్కొట్టిన గుడ్డు–1, బాదం ఎసెన్స్ – సగం టీస్పూన్. ఫుడ్ కలర్– చిటికెడు (ఇష్టమైన రంగు).
తయారి: వీటన్నింటినీ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసుకొని మీ కేక్ పాన్ సైజులో మందంగా చపాతీలాగా వత్తుకోవాలి.
కేక్ తయారి: బటర్‌లో చక్కెర వేసి, కరిగే వరకు బాగా కలియతిప్పాలి. దీనిలోనే గిలక్కొట్టిన గుడ్లను కూడా వేసి మళ్లీ కలపాలి. మైదాపిండిలో ఉప్పును చేర్చి, కొద్దికొద్దిగా ఈ పిండిని పై మిశ్రమంతో కలుపుకోవాలి. దీంట్లో డ్రైఫ్రూట్స్ కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని బటర్ రాసిన కేక్ పాన్‌లో వెయ్యాలి. అవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడిచేసి పెట్టుకొని, కేక్‌పాన్‌ని అందులో పెట్టుకోవాలి. ఇలా 25నిముషాలపాటు బేక్ చెయ్యాలి.
డెకరేషన్: చల్లారిన కేక్ మీద మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్‌ను రాసి, ముందుగా చేసుకున్న బా దాం చపాతీలను ఆ కేక్‌కి పైనా, కిందా అతికించాలి. దీన్ని మరో పది నిముషాల పాటు అవెన్‌లో బేక్ చెయ్యాలి. తరువాత ఐసింగ్‌తో కావలసిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.