
వెలుతురు చినుకులు
జీసస్ జననంతో ఆకాశంలో ఉదయించిన తార.. పశువుల కాపరులు....
జీసస్ జననంతో ఆకాశంలో ఉదయించిన తార.. పశువుల కాపరులు, పండితులైన జ్ఞానులు ఇద్దరిపైన వెలుతురు చినుకుల వానను సమంగా కురిపించింది. యుగయుగాలకు ఇది నిరంతర ప్రక్రియకావాలి. అదే నిజమైన క్రిస్‌మస్.
తూర్పు.. పడమర ఎలా అవుతుందో తెలుసుకోవాలంటే మనం కొన్ని క్షణాలు పాటు ‘క్రిస్‌మస్’ వైపు చూడాలి. క్రిస్‌మస్ ఈవ్ పేరిట మన చుట్టూ మనం ఇప్పుడు చూస్తున్నవి ఏవీ కూడా నిజానికి జీసస్ జన్మించినపుడు ఉన్నవికావు! అప్పుడు ఉన్నవి.. ఒక కంచర గాడిద, పశువుల పాక, పశువులు మేతమేసే రాతి తొట్టే, కొంత గోధుమ గడ్డి, ఆ పరిసరాల్లో గొఱ్ఱెలను మేపుకునే గ్రామీణ శ్రామికులు, వారి గొఱ్ఱెలు, గొంగళ్ళు, ఆయన జననం వార్తవిని సందర్శించడానికి వచ్చిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు వారి ఒంటెలు, వారు జీసస్‌కు కానుకగా సమర్పించడానికి తెచ్చిన - బోళము (ఒక రకం సుగంధ ద్రవ్యం) సాంబ్రాణి, బంగారము ఇవి మాత్రమే. ఇక ఈ జననం ఘటన ఆనాటి సమాజంలోని రెండు భిన్న వర్గాలైన - గొఱ్ఱెలను మేపుకునే శ్రామికులు, సంపన్నులైన తూర్పు దేశపు జ్ఞానులు, ఇద్దరి సమాగమానికి కూడా తొలి వేదికయింది.
అయితే ఈ మొత్తం పరిణామాలను సమన్వయపర్చిన ఘటన మరొకటి ఉన్నది. నిజానికి అది ఆధునిక రాజ్యపరిపాలనా వ్యవస్థలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. అది జనాభా లెక్కల సేకరణ.. సెన్సెస్. భూమికంటే పశుసంపద విలువైన ఆస్తిగా పరిగణించబడుతున్న కాలమది. దాంతో నీరు, పచ్చిక ఎక్కడ సమృద్ధిగా ఉంటే అక్కడికి మానవ సమూహాలు వలసలు వెళ్ళేవి. రోమన్ చక్రవర్తి సీజర్ ఆగస్టస్ జనాభా లెక్కల సేకరణకు ఆదేశాలు జారీచేశాడు. ప్రతి ఒక్కరూ తమ తమ స్వస్థలానికి వచ్చి అక్కడ మాత్రమే తమ పేరును జనాభా లెక్కల కోసం నమోదు చేయించుకోవాలి. తమ అవసరార్థమై వివిధ ప్రాంతాలకు తరలివెళ్ళినవారు తిరిగి స్వగ్రామాలకు వచ్చి పేర్లను నమోదు చేయించుకోవాలి. ఇది ఆ దేశపు తొలి జనాభా లెక్కల సేకరణ. అందుకోసమై జీసస్ తల్లిదండ్రులైన జోసఫ్, మేరి... నజరేత్ నుండి బెత్లెహేమ్‌కు బయల్దేరి వస్తారు. గర్భవతిగా ఉన్న మేరికి అవి ప్రసవ దినాలు. అక్కడ వారికి సత్రాలలో ఎక్కడా స్థలం దొరకదు. చివరికి ఒక పశువుల కొట్టంలో కొద్దిపాటి జాగా దొరుకుతుంది. ఆ రాత్రి ఆమె జీసస్‌కు జన్మనిస్తుంది. ఆ రాత్రి ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం ఉదయిస్తుంది. ఇదే క్రిస్మస్!
సంపన్న వర్గాలను, సంప్రదాయ వాదులను ప్రశ్నించడంతో జీసస్ యువజీవితం ఆరంభమైంది. ఆయన సంధించే ప్రశ్నలు పండితులమని చెప్పుకునే పలువురిని ఇరకాటంలో పెట్టేవి. ఆయన కలిసి తిరిగింది ఎవరితో? ఆయన కలిసి భోజనం చేసింది, బోధించింది వారిలోని శక్తిని వారికే తెలియజేసింది ఎవరికి? బహుజనులు! ద్రాక్షతోటల్లో పనిచేసేవారు, వలలు అల్లేవారు. చేపలు పట్టేవారు, దోనెలు చెక్కేవారు, డేరాలు కుట్టేవారు, అంగీగుడ్డలు నేసే వారు, దేవాలయాల బయటకూర్చుని బిక్షాటన చేసేవారు, బ్రతుకుతెరువుకు పడుపు వృత్తికి పాల్పడి బహిరంగ ప్రదేశాలలో శిక్షించబడే పతితలు.
కాలక్రమంలో మహనీయుల బోధనలు మతాలుగా మారాయి. వ్యక్తుల విశ్వాసాలు వ్యవస్థీకృతమయ్యాయి. మతాలకు స్థానిక సమాజాలలో ఉండే మంచి చెడూ రెండూ అన్వయించబడ్డాయి. రాజ్యానికి ‘మతం’ ప్రయోజనకరమనిపించింది. చివరకు ‘బైబిల్’ను కూడా తమ వాణిజ్య విస్తరణకు వాడుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం, జీసస్ పుట్టిన ఆసియాకు కూడా ‘యూరోపియన్ క్రీస్తు’నే దిగుమతి చేసింది. అందుకే మన క్రిస్మస్‌లో మన మట్టి వాసనలు మచ్చుకైనా కన్పించవు.
శ్రీ వివేకానంద స్వామి 1900 సంవత్సరం కాలిఫోర్నియాలో మాట్లాడుతూ... ‘‘బైబిల్ భాషలో ప్రయోగించబడ్డ అలంకారాలు, సామ్యాలు, చిహ్నాలు, అందులోని దృశ్యాలు, సన్నివేశాలు, స్థానిక పరిస్థితులు, మానసిక వైఖరులు, వర్గాలు చూసినపుడు ఒక తూర్పు దేశస్థుడు మీతో ప్రసంగిస్తున్నట్లు ఉంటుంది. నిర్మాలాకాశం, తాపం, ఉష్ణం, ఎడారి, దాహబాధితులైన మానవులు, పశువులు, స్త్రీ పురుషులు, కుండలు నెత్తిన పెట్టుకుని బావుల వద్ద కొచ్చి వాటిని నీళ్ళతో నింపడాలు, గొర్రెల మందలు, సేద్యగాళ్ళు, చుట్టూ జరుగుతున్న వ్యవసాయం, నీటియంత్రం, చక్రం తిరుగుళ్ళు - ఇవన్నీ ఆసియాలో నేడూ ఉన్నాయి’’ అన్నారు. భారతీయ జీవన విధానానికి బహుసారూప్యమైన అంశమిది.
భిన్న ధ్రువాలైన సంపన్న, ఆపన్న వర్గాలను తన జననంతోనే ఒక చోటికి చేర్చిన బాలుడు, యుక్త వయసులో తన సందేశాలతో బహుజనులను సంఘటిత పర్చిన యువకుడు జీసస్. కానీ ఆయన జన్మదినంగా ఆచరించే క్రిస్మస్ మనకు ఆడంబరాలకు ప్రతీకగా మారింది. జీసస్‌ను, ఆయన బోధనలను కూడా మరచి ఆయన జన్మదినం చుట్టూ మాత్రం రంగురంగుల కాగితపు పూల పందిళ్ళు కట్టుకుని వాటి వాసన్ని మనమిప్పుడు ఆస్వాదిస్తున్నాం! జీసస్ జననంతో ఆకాశంలో ఉదయించిన తార.. పశువుల కాపరులు, పండితులైన జ్ఞానులు ఇద్దరిపైన వెలుతురు చినుకుల వానను సమంగా కురిపించింది. యుగయుగాలకు ఇది నిరంతర ప్రక్రియ కావాలి. అదే నిజమైన క్రిస్‌మస్.