దైవ తనయుడి ప్రయాణం... | Travel divine Son | Sakshi
Sakshi News home page

దైవ తనయుడి ప్రయాణం...

Published Thu, Dec 18 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

దైవ తనయుడి ప్రయాణం...

దైవ తనయుడి ప్రయాణం...

యేసు జన్మించిన ప్రదేశం.. ఆయన నడయాడిన ప్రాంతాలు..

యేసు జన్మించిన ప్రదేశం.. ఆయన నడయాడిన ప్రాంతాలు.. సందేశాలు ఇచ్చిన స్థలాలు.. జీవితంలో ఒక్కసారైనా సందర్శించి, తరించాలని కోరుకునే భక్తులు ఎంతో మంది. ఈ నెల 25న యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ సందర్శంగా ఈ ప్రత్యేక కథనం...
 
‘బైబిల్ ల్యాండ్’, ‘హోలీల్యాండ్’గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ ప్రపంచంలోని చిన్న దేశాల్లో ఒకటి. యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు కూడా పరమపవిత్రమైన ఈ దేశం 1948లో స్వాతంత్య్రం పొందింది. అంతకు పూర్వం యూదు జాతీయులు పాలస్తీనాగా ఈ ప్రాంతాన్ని తమ దేశంగానే ప్రకటించుకున్నారు. స్వాతంత్య్రం పొందిన తరువాత ఇజ్రాయెల్‌లోని వెస్ట్‌బ్యాంక్, గాజా వంటి కొన్ని ప్రాంతాలను పాలస్తీనా ప్రజలకిచ్చి ఐక్యరాజ్య సమితి కూడా ‘ఇజ్రాయెల్’ను స్వతంత్ర సార్వభౌమదేశంగా గుర్తించింది. 85 లక్షల మంది నివసించే ఇజ్రాయెల్  యూదు జాతీయుల అసమానమైన తెలివితేటలు, నిర్వాహక సామర్థ్యం వల్లన అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరగలిగింది.

బెత్లెహేము పట్టణంలో జననం..

ఇజ్రాయెల్ దేశం గురించి ఇంతగా చెప్పుకోవడానికి కారణం లోక రక్షకుడైన యేసుక్రీస్తు అక్కడ జన్మించడమే! ఆ కారణంగానే ‘ఇజ్రాయెల్’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన దేశంగా వెలుగొందుతోంది. యేసు క్రీస్తు పుట్టిన స్థలమైన ‘బెత్లెహేము’ పట్టణం ఇజ్రాయెల్‌లోనే పాలస్తీనా భూభాగంలో ఉంది. ఆయన జన్మించిన స్థలంలో నిర్మించిన ‘చర్చి ఆఫ్ నేటివిటీ’ అత్యంత ప్రాచీనమైన చర్చిలలో ఒకటి. అదే ప్రాంతంలోని ‘సెయింట్ కేథరిన్ చర్చి’లో ప్రతి ఏడాది డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగే ‘క్రిస్మస్ ఆరాధన’ను ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ చానెళ్లూ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇక్కడకు కొద్ది దూరంలోనే ‘షెపర్డ్స్ ఫీల్డ్’గా ప్రసిద్ధి చెందిన స్థలం ఉంది. క్రీస్తు జన్మించిన వార్తను దేవదూత కొందరు గొర్రెల కాపరులకు తెలిపిన స్థలమది.

గలిలయ చుట్టూ ప్రయాణం...

యేసు పుట్టిన తర్వాత దూత చెప్పినట్లు బిడ్డనుతీసుకొని తల్లి మరియ, తండ్రి యోసేపు ఈజిప్టుకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ‘గలిలయ’ ప్రాంతంలోని యేసుక్రీస్తు పూర్వికుల స్వస్థలమైన ‘నజరేత్’ ఉంది. అక్కడే యేసుక్రీస్తు బాల్యమంతా గడిచింది. అక్కడ క్రీస్తు తల్లి మరియ ఇల్లు, తండ్రి యోసేపు ఇల్లు ఉన్నాయి. పక్కనే యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ‘కానా’ అనే పట్టణం ఉంది. ఆ ప్రాంతంలోనే ‘గలిలయ’ సరస్సు ఉంది. ఈ సరస్సు యోర్దాను (జోర్డాను) నదికి సంబంధించిన ఒక జలాశయం. యేసు ఈ నదిలోనే తన 30వ యేట ‘బాప్తీస్మం’ పొందినట్టుగా, అనంతరం 40 రోజులు అక్కడి అరణ్యంలోనే ఉపవాసమున్నట్టుగా చెబుతారు. యేసుక్రీస్తు ఆ ప్రాంత పరిసరాల్లోనే ఎక్కువగా సంచరించేవారు. ఆయన శిష్యులంతా ఆ ప్రాంతానికి చెందిన వారే! అందువల్లే అక్కడి జోర్డాను నదిలో ‘బాప్తీస్మం’ తీసుకోవాలన్నది చాలామందికి ఉండే కోరిక. ప్రపంచంలోకెల్లా అతి లోతైనదిగా ప్రసిద్ధి చెందిన మృత సముద్రం నీళ్లు చర్మరోగాలను నయం చేస్తాయని ఇక్కడి వారి నమ్మకం. ఇంకా మెరికో, బేతనీ, టెల్‌అవీవ్, కర్మేలు పర్వతం, హైఫా, ఎలాత్ పట్టణాలు కూడా మతపరంగా, పర్యాటక పరంగా కూడా ప్రసిద్ధ స్థలాలు. ఆ ప్రాంతంలోనే ధన్యతలకొండ ఉంది. కపెర్నామ్ ప్రాంతంలో తక్బా అంటే ‘ఓ ఐదు రొట్టెలు - రెండు చేపలను ఐదు వేల మందికి ప్రభువు పంచిన స్థలంగా పేరొందింది. ‘గలిలయ’ ప్రాంతమంతా పచ్చదనంతో, ప్రకృతి అందాలు ఉట్టి పడే స్థలం. అక్కడే చాలా కాలం పాటు ఉండిపోవాలన్న కోరిక కలగడం సహజం.
 
చివరి ప్రయాణం... జెరూసలేమ్!

 ఇజ్రాయెల్‌కు మతరాజధాని అయిన ‘జెరూసలేం’ బెత్లెహాముకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడ యేసుక్రీస్తును సిలువ వేసిన గొల్గొతా కొండ, ఆయనను సమాధి చేసిన కల్వరి స్థలం ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రార్థించిన, అవరోహణమైన ఒలీవల కొండ, ఆయన చివరి భోజనం చేసిన మేడగది, దావీదు సమాధి, రాచ భటులు ఆయన్ను బంధించిన గెత్సెమెనె తోట, మరియమ్మ సమాధి.. ఇంకా అనేక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ‘ప్రలాపాల ప్రాకారం’గా ప్రసిద్ధి చెందిన ఒక నాటి సొలొమోను నిర్మిత దేవాలయం తాలూకు ‘ప్రహరీ గోడ’ యూదులకు, క్రైస్తవులకు కూడా అత్యంత పవిత్రమైన స్థలం. అక్కడ చేసే ప్రార్థనలు దేవుడు విని తప్పక అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.
 
ప్రకటనలను నమ్మకూడదు

 ఇటీవలి కాలంలో క్రైస్తవులు మన రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నారు. అలా వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.  కొన్ని వ్యాపార ప్రకటనలలో క్రీస్తు పవిత్ర ప్రదేశాలకు తీసుకెళతామని చెబుతుంటారు. వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. అనుభవజ్ఞులు, అక్కడి చరిత్రకు బైబిలు విషయాలు కూడా జోడించి వివరణ ఇవ్వగలిగిన మత ప్రబోధకులైన కొద్ది మంది నిర్వహించే ట్రావెల్ గ్రూప్‌లలో చేరితే అటు ఆత్మీయంగానూ ఇటు సంతృప్తికరంగానూ ప్రయాణం కొనసాగుతుంది.

ఇజ్రాయెల్ సందర్శనకు పూర్తి ఖర్చులు 85 వేలకు మించి ఉండవు. చేతి ఖర్చులకు మరో పదిహేను వేల రూపాయలు సరిపోతాయి. కాకపోతే అక్కడ అన్ని ఖర్చులూ అందులోనే చేర్చుతున్నారా లేదా తెలుసుకోవాలి. ఖర్చులేవైనా అక్కడికి వెళ్లాక వసూలు చేస్తారా అన్నది కూడా ముందే తెలుసుకోవడం మంచిది.ఆగస్టు, సెప్టెంబరు మినహా (ఆ సమయంలో ఎండ విపరీతం) మిగతా మాసాల్లో ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడైనా వెళ్లవచ్చు. ఒక స్వెట్టర్ మన వద్ద ఉంచుకోవడం మంచిది. భోజనం విషయంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది కనుక ఇక్కడ నుండే పచ్చళ్లు తీసుకెళితే కొంత ప్రయోజనకరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement