క్రీస్తు నడిచిన  దారులలో | Today merry christmas festival | Sakshi
Sakshi News home page

క్రీస్తు నడిచిన  దారులలో

Published Tue, Dec 25 2018 12:00 AM | Last Updated on Tue, Dec 25 2018 8:10 AM

Today merry christmas festival - Sakshi

అనంతమైన ప్రేమను పంచడానికి ఏసు తన శరీరాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు. సత్యమార్గం బోధించడానికి ఏసు తన భుజంపై శిలువ మోశాడు. కష్టతరమైన మార్గం ఆవల అగ్ని కంటే స్వచ్ఛమైన జీవనం మనిషిని వెలిగించును అని బోధించాడు. ఆస్తి అడగలేదు... క్షమను అడిగాడు. బంగారం అడగలేదు... కరుణ అడిగాడు.నీ నుంచి నీ దేహభాగాలను అడగలేదు... కేవలం పొరుగువారిని ప్రేమించమన్నాడు. తాత్కాలిక భోగలాలస దుఃఖహేతువు.  నీ నడవడిక బలిమి పరలోకానికి సేతువు. క్రీస్తుమార్గం నిజమనిషి మార్గం. ప్రతి మానవుని మార్గం.

ఏ మతమైనా మంచితనం, ప్రేమ, దయ, ఉన్నతమైన గుణాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషిలోనూ ఉండాలని బోధిస్తుంది. తద్వారా లోకమంతా ప్రశాంతంగా, హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. మనిషి మతం నుంచి అనుక్షణం ఎంత వీలైతే అంత మంచిని ఎరుకతో గ్రహించి తీసుకుంటూ ఉండాలి. దృష్టిని చెదరనీక ముక్కుసూటిగా వెళుతూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ప్రయాసపడాలి. మతానికి తాను వెలుతురు కావాలిగాని తన స్వార్థానికి మతాన్ని వెలుతురుగా మార్చుకొనరాదు.క్రిస్మస్‌ సందర్భంగా క్రీస్తు ఎల్లప్పుడూ బోధించే ప్రేమతత్వం, క్షమాగుణం గురించి ఈరోజు గుర్తు చేసుకోవడం ఆనందమే కాదు అవసరం కూడా.మనిషి సహజంగానే ఆశాజీవి. అతడు తనకెప్పుడూ మంచి జరగాలని తన జన్మకు జీవునికి ఒక ప్రయోజనం కలగాలని ఆశిస్తూ ఉంటాడు. అతడికి వచ్చేది ఏదీ లేకపోతే తాను ఏదీ ఇవ్వడు. ఇదే తీరులో పరలోక ప్రవేశానికి కూడా అతడు ప్రయత్నిస్తాడు. మనిషి లక్ష్యం ఎప్పుడూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనే ఉంటుంది. మనిషి తన జీవనంలో ఏ మంచి చేసినా క్రీస్తు నామమందు ఏ పనిలో లగ్నమైనా అతని దృష్టి సదా పరలోక రాజ్యంపైనే ఉంటుంది. ఎందుకంటే భూమిపై జీవితం అశాశ్వతం. పరలోక జీవనమే శాశ్వతం. అలా అని ఆరాధకుడు భావిస్తాడు. అయితే పరలోక రాజ్యం ఊరికే వస్తుందా? ఇందుకు రెండు ముఖ్యమైన కార్యాలు చేస్తుండాలి. ఒకటి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి ఆయన సూచించిన మార్గాలలో జీవితాలను గడపాలి. ఆ మార్గాలు: అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు.. తల్లిదండ్రులను సన్మానించాలి.. వ్యభిచరించకూడదు.. దొంగిలించకూడదు... నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి... క్షమాగుణం కలిగి ఉండాలి... ఇవన్నీ మన జీవితాల్లో ప్రతినిత్యం అనుసరిస్తూ ఉంటే పరలోక రాజ్యం సాధ్యం. ఇవన్నీ చేయాలంటే మనిషికి కష్టంగా ఉంటుంది. దానికి బదులు తేలికైనది, సులభమైనది అయిన దేవుడిని కీర్తించడం ద్వారా మనిషి తన పని సులవవుతుందని భావించడంలో అతడి అల్పత్వం, స్వార్థం బయట పడుతుంటుంది. తోబుట్టువుపై పగ, ద్వేషం పెట్టుకుని క్షమించడం రాక, మనసులో ఈర్ష్య పెట్టుకుని పొరుగింటివారిని హత్తుకోవడం రాక రెండు గంటలు మోకాళ్ల మీద దేవుని కన్నీటి ప్రార్థనలు చేయడం లాభదాయకం అన్న ఆలోచన ఎంత వరకు సమంజసం అన్నది ఆలోచించాలి. అలా చేస్తే నిజంగానే పరలోకం అనేది ఉంటే దాని ప్రవేశం కలుగుతుందా? ప్రభువు చెప్పిన శాంతిని మనం పెంపొందుతుందా?  నిజమైన శాంతి క్షమాపణలో ఉంటుంది అని మనమంతా గ్రహించాలి. అప్పుడే మనం కరుణా హృదయులుగా క్రీస్తులో విరాజిల్లుతాం.
 
క్రీస్తు చెప్పే ఎన్నో మంచి విషయాలను మనం పుస్తకాల ద్వారా ప్రసంగాల ద్వారా ప్రార్థనా కూటముల ద్వారా వింటున్నాం. ఆ సమయంలో ప్రభావితం అవుతాం. అయితే ఆ ప్రభావాన్ని ఘనంగా నిలబెట్టుకోవడంలోనే విఫలమవుతూ ఉంటాం. దైవం మనిషి రూపం ధరించి సాధించినది మనిషి జన్మ ఎత్తిన మనకు సాధ్యం కాకుండా పోతుందా? క్రీస్తు చెప్పేది చేసేది ఎప్పుడూ ఆత్మపరిశీలన గురించే. నిన్ను నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావు... తోటివారితో ఎంత స్వచ్ఛంగా ఉంటున్నావు అన్నదే క్రీస్తు బోధనల్లో ప్రధాన విషయం. క్రీస్తు చెప్పే ప్రతి అంశంలోనూ ప్రేమ, సమానత్వం ఉంటుంది. ‘నీ దగ్గరకు నేను బిచ్చగాని రూపంలో వస్తాను’ అంటాడు. అంటే ఒక అవసరం కోసం ఎదురు చూసేవారిలో తాను ఉంటానని, వారిని దేవునిలా ఆదరించమని అందులో ధ్వని. మనం ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మనం ఆ సహాయం చేయాలి. మంచిని పెంచాలి. క్రీస్తు ఖరీదైన బట్టలకు వెంపర్లాడటం అటుంచి ఎక్కువ మోతాదులో బట్టలూ ధరించలేదు. రుచుల కోసం వెంపర్లాడలేదు. రక్తమోడుతున్న క్రీస్తే మనకు తెలుసు. క్రీస్తు వరాలు ఇవ్వడు. నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకొమ్మని ఆశ, బలం ఇస్తాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉందని మనకి గుర్తు చేస్తూనే నీకు ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా సాధించగలవని భరోసా ఇస్తూ ఆశీర్వదిస్తాడు. బైబిల్‌ని చేత ధరించడంతోపాటు దానిని హృదయంలో దింపుకోవడంలోనే మనిషి వెలుతురువైపు ప్రయాణించడం ఉంటుంది.

నిజానికి బైబిల్‌ గొప్ప కౌన్సెలర్‌. మన నడవడికను గురించి ఈ కాలానికీ అవసరమైన సంస్కరణను చక్కగా సూచిస్తుంది. ఎంతో మధురమైన వాక్యాలను బోధిస్తుంది. వాటిని బట్టీ పట్టడంతో పాటు అర్థం చేసుకొని ఎదగడం కూడా మనం చేయాలి. తనను తాను చిన్న బిడ్డగా మార్చుకొని మార్పు పొంది తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని చెప్తుంది బైబిల్‌. ఇలా ఉన్నవారిని ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట తథ్యమని మనల్ని ఒక భయానికి గురి చేసైనా మంచిని పెంపొందిస్తుంది. ప్రేమ, క్షమాగుణం కలిగి, తల్లిదండ్రులను ప్రేమించడం అనే లక్షణాన్ని కలిగి ఉండటాన్నే అసలైన ఆస్తిగా బోధిస్తాడు క్రీస్తు. దానికి మించి మన దగ్గర ఉన్న ఇతర ఆస్తులను పేదలకు ఇచ్చేయమంటాడు.అప్పుడే నీకు పరలోకంలో జీవం ఉందంటాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్తాడు. రేపటి కోసం ఆస్తులు పోగు చేసుకోవద్దని చెప్పాడు.ఈరోజుకోసం తిండీ గుడ్డా ఉంటే చాలన్నాడు. ఎందుకంటే ఆహార్యం కంటే దేహం గొప్పదన్నవాడు క్రీస్తు. ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రక్రియ ఉంటేనే శాంతి, సమాధానం, మంచి గుణం బతికుంటుందని క్రీస్తు తత్వం చెబుతున్నాడని అర్థమవుతుంది. అదే క్రమంలో ప్రేమ దేవుని మూలంగా కలుగతున్నది. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మన కోసం సిలువేసుకోవడంలోనే అమితమైన ప్రేమ ఉంది అంటుంది బైబిల్‌. సమస్త లోకాన్ని ప్రేమతో నింపమంటుంది. ఇలా సకలం ప్రేమమయం కావాలంటే నీలో ముందు వంచన ఉండకూడదు. నువ్వు ఒకరిపై తీర్పులకు సిద్ధమైనప్పుడు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోక నీ సహోదరుడి కంట్లోని నలుసుని ఎందుకు చూస్తున్నావంటాడు యేసు.

క్రీస్తు రెండవ రాకడకు మనల్ని సిద్ధం చేస్తాడు దేవుడు. క్రీస్తు పరిశుద్ధ ఆత్మ అయి మళ్లీ ఈ భూమ్మీదకు రెండవసారి వచ్చేసరికి మనం సంసిద్ధంగా ఉండాలంటాడు. అంటే ధర్మశాస్త్రం చెప్పిన ఆశయాలను అనుసరించాలి అని అర్థం. మంచి వారిని దేవుడు పరలోకానికి తీసుకువెళతాడన్న చెడ్డవారిని ఇక్కడే వదిలేస్తాడన్న భయమే మనల్ని మంచితనంలోకి నడిపించాలి. అయితే మనం ఎంతవరకూ భయపడుతున్నాం అన్నది మనకు తెలియాలి. ఈరోజు మనిషి తమ జీవితాన్ని నిజంగా క్రీస్తు చెప్పిన తత్త్వంతో నింపుకున్నాడా లేదా అనేది తరచి చూసుకోవాలి. పరలోక రాజ్యానికై ఎదురు చూడటం కంటే నిజంగా అందుకు యోగ్యులుగా మారే లక్షణాల సాధన కోసం శ్రద్ధ పెట్టే సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులానే జీవించేవాడు క్రైస్తవుడు. వాడు నిజమైన మానవుడు. హ్యాపీ క్రిస్మస్‌. పరలోక రాజ్యం ఊరికే వస్తుందా? ఇందుకు రెండు ముఖ్యమైన కార్యాలు చేస్తుండాలి. ఒకటి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి ఆయన సూచించిన మార్గాలలో జీవితాలను గడపాలి. ఆ మార్గాలు: అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు.. తల్లిదండ్రులను సన్మానించాలి.. వ్యభిచరించకూడదు.. దొంగిలించకూడదు... నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి... క్షమాగుణం కలిగి ఉండాలి... ఇవన్నీ మన జీవితాల్లో ప్రతినిత్యం అనుసరిస్తూ ఉంటే పరలోక రాజ్యం సాధ్యం.  
∙మానస ఎండ్లూరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement