తాను పూర్తిగా దీనులు, పేదల పక్షపాతినని యేసుప్రభువు ఎన్నో వాక్యాల్లో, ఉదంతాల్లో స్పష్టం చేశాడు. దౌర్జన్యాన్ని దీనత్వంతో, దుర్మార్గాన్ని ప్రేమతో, అరాచకాన్ని క్షమాశక్తితో మాత్రమే ఎదుర్కొని శాశ్వతంగా శాంతిస్థాపన చేయగలమని యేసుప్రభువు విశ్వసించాడు, బోధించాడు, ఆచరణలో రుజువు చేశాడు కూడా.
యెరూషలేములోని ఆదిమ చర్చిని, విశ్వాసులను భయంకరంగా హింసించిన పౌలు ఇపుడు సిరియా లోని చర్చిల్ని ధ్వంసం చేసి, విశ్వాసులను చెరపట్టి యెరూషలేముకు తెచ్చి హింసించేందుకు అనుమతి పత్రికలతో బయలుదేరుతుంటే ప్రధాన యాజకులు, యూదులు బహుశా పట్టణంలో తోరణాలు కట్టి మరీ అతనికి గొప్ప వీడ్కోలునిచ్చి ఉంటారు (అపో.కా. 9:2). పట్టణమంతా ఇలా యూదుల కోలాహలంతో నిండి ఉంటే, పౌలు అరాచకాలకు బాధితులై భయపడి, పూర్తిగా కృంగిపోయిన నిస్సహాయులైన క్రైస్తవ విశ్వాసులు మాత్రం పౌలు చిత్రహింసలనుండి విడుదల కోసం యెరూషలేములోనే రహస్యస్థలాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో బలహీనులు చేసే ప్రార్థనకు వెయ్యి ఏనుగుల బలముంటుంది. సిరియాలో అరాచకం సృష్టించేందుకు వెళ్లిన పౌలును, వారి ప్రార్థనలకు జవాబుగా దమస్కు శివార్లలోనే దేవుడు పట్టుకున్నాడు. అక్కడ యేసుప్రభువు సాక్షాత్కారంతో పౌలు అనూహ్యంగా గొప్ప క్రైస్తవ సాక్షిగా మారాడు. సిరియాలోని క్రైస్తవులను తెగనరికి వారి తలలతో యెరూషలేముకు తిరిగొస్తాడనుకున్న పౌలు, ఇపుడు సువార్తికుడై చేతిలో బైబిలుతో తిరిగొచ్చి తాను చర్చిలను పడగొట్టి, విశ్వాసులను హింసించిన చోటే యేసే రక్షకుడంటూ సువార్త ప్రచారం చేస్తున్నాడు. ఇది అక్కడి యూదులకు, క్రైస్తవ విశ్వాసులకు కూడా అనూహ్యమైన పరిణామం. ఒకప్పటి ‘యూదుల హీరో’, ఇపుడు విశ్వాసులు, చర్చిల తరపున పరిచర్య చేసే ‘క్రైస్తవ హీరో’ అయ్యాడు. చేతిలో కత్తితో పౌలు ఎంత బీభత్సాన్ని సృష్టించాడో, ఇపుడు చేతిలో బైబిలుతో అంత శాంతిస్థాపన చేస్తున్నాడు. ఒకప్పుడు తుఫాను గాలులకు అల్లాడిన చెట్టుకొమ్మల్లాగా భయంతో హడలిపోయిన చర్చి, ఇప్పుడు దినదినం క్షేమాభివృద్ధినొందుతూ శాంతితో విలసిల్లిందని బైబిల్ చెబుతోంది (అపో.కా. 9:31). విశ్వాసుల ప్రార్థనకు జవాబుగా ఒకే అధ్యాయంలో కేవలం 30 వచనాల్లో దేవుడు చేసిన అద్భుతం ఇది.
దీనులు, నిస్సహాయులు, కృంగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ప్రార్థనలకు దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. వారి మొరలకు ఆయన తప్పక జవాబునిస్తాడు. ఎందుకంటే దేవుడు బలవంతులు, ధనికుల పక్షం కాదు, తాను పూర్తిగా దీనులు, పేదల పక్షపాతినని యేసుప్రభువు ఎన్నో వాక్యాల్లో, ఉదంతాల్లో స్పష్టం చేశాడు. దౌర్జన్యాన్ని దీనత్వంతో, దుర్మార్గాన్ని ప్రేమతో, అరాచకాన్ని క్షమాశక్తితో మాత్రమే ఎదుర్కొని శాశ్వతంగా శాంతిస్థాపన చేయగలమని యేసుప్రభువు విశ్వసించాడు, బోధించాడు, ఆచరణలో రుజువు చేశాడు కూడా. యెరూషలేములో బలహీనులైన ఆనాటి విశ్వాసులు చేసిన ప్రార్థనలు చరిత్ర గతినే మార్చేశాయి. పౌలు పరివర్తనతో యూదుల నోళ్లు మూతపడి, మరెప్పుడూ కోలుకోలేని విధంగా వారు పూర్తిగా బలహీనపడ్డారు, కాని చర్చి మాత్రం ఎంతో బలపడి తన జైత్రయాత్రలో ఘనవిజయాల దిశగా సాగిపోయింది. మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో తీరని సమస్య, పూడ్చలేని లోటు ఉన్నాయా? మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మోకరించి, ‘దేవా నీవే నాకు దిక్కు, సాయం చెయ్యి’ అని ఒక నిస్సహాయుడిగా ప్రార్థించండి. దేవుడు ఊహించని విధంగా జవాబిస్తాడు. చర్చికి సమస్యగా ఉన్న పౌలు, విశ్వాసుల ప్రార్థనలకు జవాబుగా మారి అదే చర్చికి ఆశీర్వాదమైనట్టు, మీ సమస్యనే దేవుడు ఆశీర్వాదంగా మార్చుతాడన్నది బైబిల్ చెప్పే సత్యం,
– రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment