‘అహం’ నశిస్తే...అంతా ఆనందమే!
ఇంగ్లిష్ ఛానెల్‌కెదురుగా విన్‌స్టాన్లీ అనే గొప్ప ఆర్కిటెక్ట్ 250 ఏళ్ల క్రితమే ఒక లైట్‌హౌజ్ నిర్మించాడు. దాని ఆవిష్కరణ ఫలకం మీద ‘సముద్రపు అలలకు, గాలులకు ఇదే నా సవాల్! నా ఈ కట్టడాన్ని కూల్చి మీ బలం నిరూపించుకోండి!’ అని రాయించాడు. పాపం, మూడేళ్లకే ఒక తుఫానులో లైట్‌హౌజ్‌తోపాటు అతనూ కొట్టుకుపోయాడు. కొన్నేళ్లకు 1756లో జాన్‌స్మీటన్ అనే సాధారణ ఇంజినీరు దానికి దగ్గరలోనే బండమీద పునాదివేసి దాన్ని పునర్‌నిర్మించి ‘యొహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థం’ అన్న బైబిలు వాక్యాన్ని రాయించాడు (కీర్తన 127:1)
మనం చూసుకుని మురిసే అధికారం, ఐశ్వర్యం పలుకుబడి, జ్ఞానం ఇవన్నీ కలిసినా దేవుని కృపముందు వెలవెల బోయే పరిస్థితి ఏర్పడినప్పుడు మనమెంత బలహీనులమో అర్థమవుతుంది. సిరియా సైన్యాధిపతి నయమాను మహాశూరుడు. కాని ఏం లాభం? అతనికి కుష్టువ్యాధి సోకింది. ఎలీషా ప్రవక్త ప్రార్థిస్తే నయమవుతుందని తెలిసి అతనికోసం శత్రుదేశమైన ఇజ్రాయేలుకు వచ్చాడు. యోర్డాను నదిలో ఏడుసార్లు మునగమని ఎలీషా తన సేవకునితో అతనికి చెప్పించాడు. తనంతటివాడు వస్తే ఎలీషా ఉబ్బితబ్బిబ్బై తనకు రాచ మర్యాదలు చేయకపోగా కనీసం పలకరించకపోవడంతో అతని అహం దెబ్బతిని నా దేశంలో అంతకన్నా గొప్పనదులున్నాయంటూ ఆగ్రహించాడు.
తర్వాత తగ్గి యోర్డానులో మునిగితే అతని వ్యాధి మాయమైంది. అతను తిరిగొచ్చి ఎలీషాకు కానుకలివ్వబోగా, ‘దిక్కులేక దేవుని కృపనాశ్రయించినవాడవు, నీవు దేవునికిచ్చేంత వాడివయ్యావా!’ అన్న అర్థం వచ్చేలా ఎలీషా తిరస్కరించి ‘నీ జీవితాన్ని మార్చుకో’ అని సూచించాడు. నయమాను నిజంగానే మారిపోయాడు (2 రాజులు 5:1-19). ఎంతడబ్బు, ఐశ్వర్యం, ఘనత, సౌందర్యమున్నా కుష్ఠురోగం సోకితే అదెంత దౌర్భాగ్యం?’ ‘పాపం’ అనే ఘోరమైన వ్యాధి సోకినవాడిదీ అదే పరిస్థితి! దేవుని కృపకు, క్షమాపణకు దూరంగా బతికేవాళ్లు ఎంతటివారైనా ‘నాకు కుష్టువ్యాధి కలదు’ అన్న బోర్డును మెడలో వేసుకుని తిరిగేవారే!
అలాంటివారు ఏదో ఒకరోజు దేవుని ఉగ్రత అనే తుఫానులో కొట్టుకుపోక తప్పదు. అయితే ‘పాపం’ అనే వ్యాధిని దేవుడొక్కడే నయం చేయగలడు. అందుకే ఆయన కృప, క్షమాపణ పునాదిగా జీవితాన్ని, కుటుంబాన్ని నిర్మించుకునేవాడు నిజంగా తెలివైనవాడు. ఒక చిన్న బహుమతి కోసం లోకమంతా చుట్టిరావడానికి సిద్ధపడే మనిషి, దేవుడిచ్చే అమూల్యమైన ‘నిత్యత్వం’ కోసం పాపక్షమాపణ దిశగా ఒక అడుగైనా వేయడానికి ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. మనుషుల్లో ఏ ఒక్కరి జననమూ కాకతాళీయం కాదని, దేవుని ప్రణాళికలో భాగంగానే అది జరుగుతుందని బైబిలు చెబుతోంది.
మానవునిపట్ల దేవుని ఆలోచనలు, యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ ద్వారానే సాకారమవుతాయి. కాని ‘నేను’, ‘నా’ అన్న అహం మనిషిని దేవునికి దూరం చేసి బలహీనపర్చుతుంది. మానవాళికి తన రూపాన్ని, స్వభావాన్ని ఇచ్చేందుకే దేవుడైన యేసుక్రీస్తు మానవుడయ్యాడు. అలాంటి దైవిక స్వభావాన్ని సంతరించుకున్న విశ్వాసిలో ఆత్మీయత పరిఢవిల్లి అతని జీవితమే కొత్తగా రూపాంతరం చెందుతుంది. అతడు లోకాన్ని, పరిణామాలను కొత్తకోణం నుండి చూడటం ఆరంభిస్తాడు.
మాథ్యూ హెన్రీ అనే గొప్ప దైవజనుడు ఒకసారి దారి దోపిడికి గురయ్యాడు. ఆ విషయాన్ని తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ‘జీవితంలో దోపిడీకి గురికావడం ఇదే మొదటిసారైనందుకు దేవునికి వందనాలు. వాళ్లు నా పర్సు లాక్కున్నారు, కాని నాకున్నదంతా కాదు. వాళ్లు నన్ను దోచుకున్నారు. నేను వాళ్లను దోచుకోలేదు. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు!’
-ఇదీ విశ్వాసి దృక్పథం!!
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్