
శాస్త్రులు, పరిసయ్యలు కొందరు యేసును ఒక సూచక క్రియ అంటే అద్భుతం చేయమని అడిగారు. యేసు చేసిన అద్భుతాలతో ఆ ప్రాంతమంతటా ఆయనకెంతో పేరు వచ్చింది. అయితే, పేరుకోసం, తన దైవత్వాన్ని రుజువు చేయడం కోసం యేసు ఎన్నడూ అద్భుతాలు చేయలేదు. ఆయా వ్యక్తుల అవసరాలు తీర్చడానికి మాత్రమే ఆయన అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాల గురించి విన్న వారు ఆయన అద్భుతాలు చేస్తుంటే ప్రత్యక్షంగా చూడాలని చాలామంది ఉబలాటపడ్డారు. యూదయలో రోమా ప్రతినిధిగా ఉన్న పిలాతు కూడా తన ఎదుట విచారణ కోసం తలదాచుకుని నిలబడి ఉన్న యేసు క్రీస్తు ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూసి ఆన ందించాలనే గాక, దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన్ని విడుదల చేయాలనీ పిలాతు అభిమతం. కాని యేసు అద్భుతం చేయలేదు సరికదా తలవంచి పిలాతు విధించిన సిలువ శిక్షను భరించి చరిత్రలో రోమా ప్రభుత్వం సిలువ వేసి చంపిన కరడుగట్టిన నేరస్తులందరిలోకి అత్యంత సాత్వికుడిగా పేరు పొందాడు.
యేసు అద్భుతాలు చేశాడని నాలుగు సువార్తలూ సవివరంగా పేర్కొన్నాయి. ఆయన శిష్యులు, ఇతర అపొస్తలులు కూడా చేసిన అద్భుతాల ప్రస్తావన అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఉంది. ఆయన కొందరికి స్వస్థత వరాన్నిస్తాడని, తనను విశ్వసించేవారు తాను చేసిన కార్యాలకన్నా గొప్ప కార్యాలు చేస్తారని యేసే స్వయంగా చేసిన ప్రకటన కూడా బైబిలులో ఉంది (యోహాను 14:12). కాని ఈ స్వస్థతలు, అద్భుతాలు చేసే దైవిక శక్తిని లోక ప్రయోజనాలు, స్వార్థం, ధనార్జన కోసం వాడేందుకు అనుమతి మాత్రం బైబిలులో ఎక్కడా లేదు. ఈ వరాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు, పేరు సంపాదించడానికి, ప్రజల్ని అల్లకల్లోలం పాలు చేయడాన్ని దేవుడు అనుమతించలేదు. పాపాలను క్షమించి పరలోకాన్ని ప్రసాదించ గల రక్షకుడిగా గాక, యేసును కేవలం స్వస్థతలు, అద్భుతాలు చేసే గారడీవాడిగా చిత్రీకరించడం కన్నా భ్రష్టత్వం మరొకటి లేదు. పరిశుద్ధాత్మశక్తి నిజంగా ఉన్న వాడి నోట డబ్బు మాటే రాదు. డబ్బున్న చోట పరిశుద్ధాత్ముడుండడు. ఈ రెండూ పర స్పర విరుద్ధాంశాలు. అవి ఎన్నడూ కలవవు. లోకాన్ని మార్చే ‘దైవిక శక్తి’ లోకంతో ఎన్నడూ రాజీపడదు. రాజీపడ్డ మరుక్షణం ఆ శక్తి నిర్వీర్యమవుతుంది.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment