క్రీస్తు కారుణ్యం  మనకు ఆదర్శం | funday :cover story speical on jesus | Sakshi
Sakshi News home page

క్రీస్తు కారుణ్యం  మనకు ఆదర్శం

Published Sun, Apr 1 2018 1:28 AM | Last Updated on Sun, Apr 1 2018 1:28 AM

funday :cover story speical on jesus - Sakshi

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్‌ పండుగను జరుపుకొంటున్నారు. మనుష్యుల హదయాల్లో వెలుగును నింపిన పండుగ ఇది. మరణాన్ని జయించి తిరిగిలేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. యేసు పునరుత్థానం మనిషికి నిజమైన పరమార్థాన్ని తెలియచేసింది. దేవునికి అసాధ్యమేదీ ఉండదని నిరూపించింది. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతీ యేటా కోట్లాదిమంది ఆ ఖాళీ సమాధిని చూసి పరవశంతో నింపబడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. క్రీస్తు జీవనశైలి ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైది. భువిపై ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకొని వచ్చింది. నిరాశ నిస్పృహల నుండి మనిషికి విడుదల ప్రసాదించింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. మహత్తర ఆధ్యాత్మిక భావాలు ఇమిడియున్న ఆయన బోధల ద్వారా ప్రయోగాత్మకమైన ఫలవంతమైన జీవితానుభవాలు పొందుకొనే సావకాశం ఏర్పడింది.

గర్వం, అహంభావం, దురహంకారం ఏలుబడి చేస్తున్న ప్రస్తుత లోకంలో ఘనతర లక్ష్యాలు నిలువుగా నీరు గారిపోతున్నాయి. మనిషి మస్తిష్కంలో గూడుకట్టుకుపోయిన పాప స్వభావం వల్ల సమాజానికి చాలా కీడు జరుగుతోంది. పాపం మనిషిని ఎటువంటి నీచస్థానానికైనా దిగజారుస్తుంది. ఆఖరుకు పతనానికి నడిపిస్తుంది. సాటి మనిషిని ప్రేమించని రాక్షస సమాజంలో తన దివ్యమైన బోధల ద్వారా నవ్యపథ నిర్దేశం చేసిన ఘనుడు యేసుక్రీస్తు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి తన ప్రేమతత్వాన్ని లోకానికి ఆచరణాత్మకంగా చాటిచెప్పాడు. తన పంతమే నెగ్గాలని ఉవ్విళ్లూరే ఉగ్రవాదానికి బలౌతున్న అభాగ్యులు ఎందరో. పైశాచిక మూర్ఖత్వపు దాడులు మానవాళి చరిత్రలో నెత్తుటి పుటలను లిఖిస్తున్నాయి. ఇటువంటి సమాజంలో మార్పును తీసుకురావాలన్న సదాశయంతో వెలువడిన క్రీస్తు సందేశాలు, బోధలు సదా ఆదరణీయం. ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది.’’ అని క్రీస్తు కొండమీది ప్రసంగంలో తెలియచేశాడు. ఆత్మలో దీనత్వం అనగా తన నిస్సహాయతను సర్వశక్తుడైన దేవుని దగ్గర నిర్మొహమాటంగా ఒప్పుకోవడం. ఒక చంటిబిడ్డ తన తల్లిపై ప్రతి చిన్న విషయానికి ఏవిధంగా ఆధారపడుతుందో అలా పరమాత్మునిపై ఆధారపడటం. స్వనీతి కార్యములు మోక్షప్రాప్తినివ్వవని మనస్ఫూర్తిగా గ్రహించి పశ్చాత్తాపంతో దేవుని పాదాలను అశ్రువులతో అభిషేకం చేయడం. భౌతిక ప్రపంచంలోనైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా పతనానికి దోహదమయ్యే దుర్లక్షణాలను దేవుని శక్తిద్వారా పరిత్యజించడం. 

‘‘తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.’’ అనే తన దివ్య బోధలతో శిలలను కూడా శిల్పంగా మార్చుతున్నాడు యేసు. భయరహిత వాతావరణం సృష్టించుకుంటూ దినదిన ప్రవర్ధమానం చెందడం క్రీస్తు బోధల ద్వారా నేర్చుకోవచ్చు.జీవితం విలువ తెలిసినవానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ అహంకారం ఉండదు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందనేది బైబిల్‌ ఉపదేశం. అసత్యపు బండలను కొట్టుకొని తునాతునకలౌతున్నమనిషిని సంపూర్ణతలోనికి నడిపించాలన్నదే క్రీస్తు ఆలోచన. జడత్వంతో నిండిన ఇంద్రియాలను చైతన్యపరచి, వర్ణరహిత వర్గరహిత సమసమాజ నిర్మాణం కోసం తన వంతు కృషి సలిపిన మహాఘనుడు యేసుక్రీస్తు. ‘ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప చూపించు’ అని బోధించిన యేసు అక్షరాలా దానిని తన జీవితంలో నెరవేర్చగలిగారు. యేసు దివ్యనామము విశ్వమంతటా మారుమోగడానికి గల అనేక కారణాలలో ‘ఆయన కారుణ్యం’ ప్రధానమైనది.క్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో యెరూషలేములోని మేడగదిలో తన శిష్యుల పాదాలను కడిగాడు. అది ప్రజల గుండెల్లో శాశ్వతకాలం నిలిచిపోయే ఓ అపురూప సంఘటన. అప్పటికే ఆయనకు ఆ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రజాదరణ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను గొప్పవానిగా, దేవునిగా గుర్తించి ఆయనను వెంబడిస్తున్నారు. యేసు భోజనపంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని పక్కన ఉంచి ఒక తువాలు నడుమునకు కట్టుకొని, పళ్లెములో నీళ్లు పోసి తాను ఏర్పరచుకొన్న శిష్యుల పాదాలు కడుగుటకు, వాటిని తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాడు. తాను కాళ్ళు కడిగే శిష్యులు చాలా సామాన్యమైన వారు. వారు ఆనాటి సమాజంలో విశిష్టులు కారు. ఆ సందర్భంలో శిష్యులు ఆయనను వారించినా భావితరాలకు స్ఫూర్తి కలుగుటకు, సేవాతత్పరతను అందరూ అలవాటు చేసుకొనుటకు ఆవిధంగా యేసు చేశాడు. తాను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని చేసిన ఆ సర్వోత్తమ కార్యము సాక్షాత్కరించిన జీవితాల్లో ‘సేవ’ పట్ల యథార్థ దృక్పథాన్ని రగిలించింది. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు’, ‘మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి’ అన్న క్రీస్తు బోధనలు చేతల్లో నిరూపించబడ్డాయి.

ఈ అసాధారణ సంఘటన ఆధారంగా  అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ప్రజాస్వామ్యానికి ఓ వినూత్న నిర్వచనాన్ని ఇచ్చాడు. ‘ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు’ అనే నినాదంతో నవ్యపథ నిర్దేశాన్ని చేశాడు. ‘మనుష్యులంతా సమానమే’ అంటూ వర్ణ వివక్షను రూపుమాపడానికి తనవంతు కృషి చేశాడు.క్రీస్తులో ఉన్న శాంత స్వభావాన్ని, కారుణ్యాన్ని, ప్రేమను ఆకళింపు చేసుకొన్న మదర్‌ థెరిసా భారతదేశ చరిత్రలో ఓ శ్రేష్టమైన స్థానాన్ని పొందింది. కేవలం మన దేశానికే కాదు యావత్‌ ప్రపంచానికే దీవెనకరంగా మారిన మదర్‌ క్రీస్తు ప్రేమాగ్ని జ్వాలల్లో నుంచి ఎగసిన ఓ నిప్పురవ్వ. అనాథలకు, అభాగ్యులకు సేవ చేయాలన్న తపనతో ఈ దేశానికి వచ్చిన మదర్‌ ఎందరినో అక్కున చేర్చుకొంది. కడుపునిండా అన్నం, కంటినిండా నిద్ర, ఒంటి నిండా బట్టలను ఇచ్చి మానవీయ హృదయంతో ప్రజలను ఆదుకొంది. ఎక్కడ నుంచో వచ్చిన ఆమెను ‘మదర్‌’ అని సంబోధిస్తూ ఆమెను గౌరవించిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నత స్థితిగతులను విడిచి లోకహితం కోసం పాటుపడాలన్న ఆకాంక్షతో కలకత్తా వీధుల్లో అనాథ పిల్లల పోషణ కోసం యాచన చేసేది. ఆ ప్రక్రియలో ఒకసారి వికృత చేష్టలకు బందీయైన ఒక వ్యక్తి, మదర్‌ థెరిసాపై ఉమ్ము వేశాడు. ‘దీనత్వం’ అంటే ఏమిటో నేర్చుకుంది కదా! ఆ ఉమ్మిని తుడుచుకొంటూ ‘‘నా కోసం ఇది ఇచ్చావు... అనాథ పిల్లల కోసం ఏమి ఇస్తావు?’’ అని తిరిగి అడిగింది.

ఆ ఒక్క మాటతో గర్వపు పొరలు విడిపోయాయి. ఇంతగా అవమానించినా తిరిగి ఏమీ అనని మదర్‌ గుండెల్లో ఉన్న తగ్గింపును అర్థం చేసుకొన్నాడు. జీవితాంతం మదర్‌ థెరిసా ఆశ్రమానికి తనకు తోచినంత సహాయం చెయ్యడం ప్రారంభించాడు. నోబెల్‌ బహుమతి ప్రదానం రోజున మదర్‌ మాట్లాడుతూ ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగడమే నిజమైన క్రైస్తవ్యం’ అని తాను ఎవ్వరి నుంచి సేవాస్ఫూర్తిని పొందిందో ఆ విషయాన్ని కచ్చితంగా ప్రపంచానికి తెలిపింది. నేటికీ ఆమె ద్వారా స్థాపించబడిన సంస్థల ద్వారా విశేషమైన సేవలు పేదలకు అభాగ్యులను అందుతున్నాయి. కొంత చేసి ఎంతో చేశామని ప్రగల్భాలు పలికే  నేటి సమాజంలో ఎంతో చేసినా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో నింపబడిన వ్యక్తులను కనుగొనడం కొంచెం కష్టమే. అటువంటి వారిలో విలియం కేరీ ఒకడు. ఇంగ్లండ్‌ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎన్నో విశిష్ట కార్యాలు చేశాడు. ఒక్కమనిషి తన జీవితకాలంలో ఇన్ని కార్యాలు చేయగలడా? అనిపించే విధంగా సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. అంతే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను 36 భాషల్లోకి అనువదించాడు. అనేక భారతీయ భాషల్లో నిఘంటువులు రాశాడు. పట్టాను బహూకరించే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. స్వదేశ భాషలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాను సాధించాలనుకున్న వాటిని సాధించి తీరాడు. దేశచరిత్రలో, ప్రజల గుండెల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు. జీవన పరిణామాలన్నింటిని సమదృష్టితో చూడగలిగే స్థితప్రజ్ఞతను ఆకళింపు చేసుకున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఒకసారి ఇంగ్లండ్‌ వెళితే తన స్నేహితుడొకడు వచ్చి అపహాస్యంతో, విలియం కేరీని కించపరచాలనే ఉద్దేశంతో ‘నీవు చెప్పులు తయారు చేసుకొనే వ్యక్తివని మర్చిపోవద్దు’ అన్నాడు. క్రీస్తు కారుణ్యంతో, వినమ్రతతో నింపబడిన కేరీ ‘అయ్యా! నేను చెప్పులు తయారు చేసేవాణ్ణి కాదు... వాటిని కేవలం బాగుచేసుకునేవాణ్ణి’’ అని బదులిచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన కేరీ ఇచ్చిన సమాధానం, అతనిలో ఉన్న తగ్గింపు ఆ వ్యక్తిని ఎంతగానో ఆశ్చర్యపరచింది. అంతేమరి! నిండుకుండ ఎప్పుడూ తొణకదు కదా! ‘కారుచీకటిలో కాంతిరేఖ’ అని కేరీని పిలవడంలో అతిశయోక్తి లేదుకదా!

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ప్రపంచంలో నేటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు క్రీస్తు కారుణ్యమునకు, దీనత్వమునకు ఆరాధకులే. ఆధ్యాత్మిక చింతన కోసం, జీవన సాఫల్యం కోసం తపించే ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఉన్న మహోన్నత ప్రేమతత్వానికి మంత్రముగ్ధులే. మానవ హృదయ వైశాల్యాన్ని పెంచుతూ, గుణాత్మక పరివర్తనకు దోహదపడుతున్న క్రీస్తుప్రభువు తగ్గింపు జీవితం సదా అభినందనీయం. 
యేసుక్రీస్తు పరలోకములో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి, తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడని పౌలు మహాశయుడు తెలియజేశాడు. నిజమే.. యేసు పుట్టింది పశువులశాలలో. పసికందుగా పవళించింది గరుకైన పశువుల తొట్టెలో! దేవుడు ఈ లోకంలో పుట్టాలనుకుంటే ఆయన మాట ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో పూల పాన్పులు, అంతఃపురాలు ఆయనకు ఆహ్వానం పలుకలేవా? ఎందుకు ఆయన పశువులశాలలో పుట్టాడు? పశువుల శాల వంటి మానవ çహృదయాన్ని పావనపరచుటకు ఆయన పశువుల తొట్టెలో జన్మించాడు. రెండవ కారణం ‘‘పశువుల శాలలోనికి ఎవ్వరైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు’’. క్రీస్తును దర్శించుటకు కుల మత ప్రాంత వర్గ భేదాలు లేనేలేవు. వాస్తవానికి క్రీస్తు పుట్టినప్పుడు ఆయనను మొదటగా దర్శించుకున్నది గొర్రెల కాపరులు. రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దూత ద్వారా శుభవార్త అందింది. భక్తి పారవశ్యంతో క్రీస్తును దర్శించుకొని పరమానందభరితులయ్యారు. ఇది నిజంగా విడ్డూరమే! లోకరక్షకుడు అందరికీ చెందినవాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని క్రీస్తు తన జన్మ ద్వారా నిరూపించాడు.

పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణాపూరితమైన మనసును వేరుచేయలేము. క్రీస్తు ప్రేమ అనిర్వచనీయమైనది. అవధులు, షరతులు లేనిది. విలువైన ఆయన ప్రేమలో వంచన లేదు. మధురమైన క్రీస్తు ప్రేమకు మరణం అంటే ఏమిటో తెలియదు. ప్రవచనాల ప్రకారం క్రీస్తు పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది నజరేతులోని ఒక వడ్లవాని ఇంటిలో. ఆ కాలంలో గలిలయలోని నజరేతుకు ఏమాత్రం పేరుప్రఖ్యాతులు లేవు. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యోసేపు అనే వ్యక్తికి అన్ని విషయాలలో సహాయం చేశాడు. కష్టమంటే ఏమిటో తెలుసు. చెమటోడ్చడం అంటే తెలుసు యేసుకు. మనిషి సాధక బాధకాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. ఆ కాలంలో పరమ పాపులుగా పిలువబడే సుంకరులతో అనేకసార్లు భోజనం చేశాడు. వారితో సహవాసం చేసి దైవ మార్గాన్ని వారికి ఉపదేశించాడు. దైవభక్తిలో ఎడతెగని, అలుపెరుగని అలౌకిక అనుభవాలు దాగి ఉంటాయని తెలియచెప్పాడు. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి çహృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు.

నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. కానీ తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చిన ప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులను కౌగిలించుకున్నాడు. ఆ కాలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరాని వారుగా పరిగణించేవారు. సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. సొంత కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ద్వేషించేవారు. అలాంటివారిని తన దివ్య స్పర్శతో బాగుచేశాడు. వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రోగ పీడితులను పరామర్శించాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. వికటముతో మాట్లాడి, చులకనగా వ్యవహరించిన వారిని కూడా ప్రేమపూర్వక పదజాలంతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు.

మట్టల ఆదివారం రోజున క్రీస్తు గాడిదపై ప్రయాణం చేశాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు అని జెకర్యా ద్వారా పలుకబడిన ప్రవచనం నెరవేరింది. పూర్వదినాల్లో ఏ రాజైనా గుర్రంపై ప్రయాణిçస్తూ మరో పట్టణానికి వెళ్తే యుద్ధానికి వస్తున్నాడని ఇట్టే గ్రహించేవారు. గాడిదపై వస్తుంటే సమాధానం కోసం వస్తున్నాడని గ్రహించేవారు. కలవరంలో నిండిపోయిన యెరూషలేము పట్టణానికి సమాధానాన్ని ప్రకటించడానికి క్రీస్తు గాడిదపై దీనుడుగా ప్రయాణం చేశాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి నేను విశ్రాంతిని కలుగచేతును’’ అని క్రీస్తు ఏనాడో ప్రకటించాడు. నేటి దినాల్లో మనిషి మనశ్శాంతి కోసం తపిస్తున్నాడన్నది కాదనలేని సత్యం. విశ్యవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు శాంతి కోసం అన్వేషిస్తున్నారు. కొందరు ధన ధాన్యాలలో శాంతిని వెదకుతుంటే మరికొందరు కీర్తి ప్రతిష్టలలో వెదకుచున్నారు. కొందరు బంధాల్లో శాంతిని పొందుకోవాలని తపిస్తుంటే మరికొందరు ఒంటరి తనంలోనే సంతోషాన్ని వెదకుచున్నారు. ఈ వెతుకులాటలో నిజమైన శాంతి దొరకక అనేకులు ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. 

వాస్తవాన్ని అంగీకరించే మనస్సుంటే శాంతి అనేది భౌతిక సంబంధమైన విషయాలపై ఆధారపడి లేదు. ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు. కొందరు శాంతి సమాధానాల కోసం పరితపిస్తారు, మరికొందరు శాంతితో జీవిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గలవాడు శాంతి సమాధానాలతో జీవిస్తాడని భారతదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఒక సందర్భంలో తెలియజేశారు. అవును! పరమాత్ముడు సమాధానానికి సృష్టికర్త గనుక ఆయన పాదాల దగ్గర కాకపోతే మరెక్కడ శాంతి దొరుకుతుంది? క్రీస్తు పొంతి పిలాతు ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడి, వస్త్ర హీనునిగా చేయబడి, పరమ పవిత్రుడైనప్పటికీ మనిషి కోసం దోషిలా నిలువబడి, మానవ అపహాస్యాన్ని, హేళనను భరించిన సహనశీలి. తాను చేయని నేరాలను తలదించుకొని భరించాడు. చివరకు తనను యెరూషలేము వీధుల్లో ఈడ్చి, కల్వరి కొండపై మేకులతో సిలువకు కొట్టి, ముళ్ల కిరీటం ధరింపజేసి కిరాతకంగా హింసించిన వారిని కూడా క్షమించిన దయార్ద్ర హృదయుడు యేసు. ఒక్క ఎదురుమాట చెప్పినందుకే మొండెము నుండి తల వేరు చేయించిన చక్రవర్తులు ఎందరో చరిత్రలో ఉన్నారు. తమ మాటకు ఎదురు నిల్చినవారిని ఖండములుగా నరికినవారున్నారు. తమను అవమానపరచారని కత్తి వాతకు గురిచేసిన రాజులెందరో మానవ చరిత్రలో ఉండగా ప్రేమ చూపి సత్‌క్రియలు చేసి, దయను కురిపించి, ఆకలి తీర్చి, స్వస్థపరచి, మృతులను సైతం సజీవులుగా చేసిన మహోన్నతుడు యేసు. యేసు ఏమి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు? ఆయన పుట్టింది ఎవరో పశువులపాకలో. ఒకసారి ఓ పరాయి పడవలో అమరమున తలవాల్చి నిదురించాడు. అనేక రాత్రులు ఒంటరిగా గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడిపాడు. ఆఖరికి ఆయన మరణించిన తరువాత కూడా అరిమతయి యోసేపు అనువాని సమాధిలో ఉంచబడ్డాడు. ఇవన్నీ దేనికోసం? కేవలం మనిషిని సొంతం చేసుకోవాలన్న ఆశయంతో, తపనతో ఆయన దేన్నీ సొంతం చేసుకోలేదు. అవును! పరమాత్ముడు మనిషి çహృదయంలో వసించాలని ఆశిస్తున్నాడు. 

తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని క్రీస్తు పలికాడు. అది అక్షరాలా ఆయన జీవితంలో నెరవేరింది. ఒంటరిగా సిలువపై వేలాడుతూ ప్రజల పాపాల కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు సిలువలో మరణించాడు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్‌ జోసీఫసు కూడా క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించాడు. ఆ సమయంలో సిలువ చుట్టూ చేరిన అనేకులు సిలువ నుంచి దిగిరా! నీవు దైవకుమారుడని నమ్ముతామని క్రీస్తును సవాలు చేశారు. అంతమంది సవాలు చేస్తున్నా క్రీస్తు ఎందుకు సిలువను దిగలేదు? ఆ స్థానం నుంచి క్రీస్తు తప్పుకుంటే మానవునికి రక్షణ లేదు గనుక. పాప పరిహారం జరగదు గనుక.సమాధిలో ఉంచబడిన క్రీస్తు జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా! ఆయన జీవితం సమాప్తమైనదని భావించారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ మూడవ రోజున మరణ బంధనాలను తెంచుకొని యేసుక్రీస్తు బయటకు వచ్చారు. సమాధి ముందు పెట్టబడిన పెద్దరాయిగాని, చుట్టూ మోహరించి ఉన్న రోమన్‌ సైనికులు గాని ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లు మనిషిని ఏలుబడి చేసిన మరణం ఆరోజు మరణించింది. సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వత సమాధి చేయలేరని ఋజువుచేయబడింది. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. సమాధి నుంచి బయటకు వచ్చాడు గనుక ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు.

యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్‌ శతాధిపతి లాజినస్‌. ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తుండగా పిలాతు భార్య ప్రొక్యులా ఇలా అడిగింది – ‘‘క్రీస్తు పై నీ అభిప్రాయం ఏమిటి?’‘. ‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణం కచ్చితంగా ఓడిపోతుంది. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి శ్రీకారం చుడతాడు. విశ్వంలో ఆయన పేరు మారుమ్రోగుతుంది. ఈసారి ఆయన్ను ఏ రోమన్‌ చక్రవర్తి గాని, శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. ప్రియ నేస్తమా! ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అన్యాయం జరిగిందని బాధపడుతున్నావా? ప్రజలంతా నిన్ను నిందిస్తూ వేధిస్తున్నారా? నీవు ఎందుకూ పనికిరావు, నీ వల్ల ఏదీ కాదు అనినిన్ను హేళన చేస్తున్నారా? మౌనం వహించు! నీవు చేయాలనుకున్న కార్యమును నెరవేర్చడానికి ముందుకు సాగిపో! మరణాన్ని జయించిన దేవుని అనిర్వచనీయమైన కృప మరియు శక్తి నీకు తోడుగా ఉంటాయి. ఆయన్ను గుండెల్లో ప్రతిష్టించి క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కో, నిందలూ అవమానాలూ వస్తున్నాయని కృంగిపోకు! ప్రపంచంలోని విజేతలందరూ ఏదోక సందర్భంలో వాటిని ఎదుర్కొన్నవారే.  ధైర్యంతో ముందుకు సాగిపో! నీవు తప్పకుండా విజయం సాధిస్తావు. ఈ రోజు నీ తగ్గింపే రేపు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.ఈస్టర్‌ శుభాకాంక్షలు.
డా. జాన్‌ వెస్లీ
ఆధ్యాత్మిక రచయిత, వక్త
క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement