క్రైస్తవ విశ్వాసానికి పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అనే ముగ్గురిలో ఇస్సాకు ప్రస్తావన ఎక్కువగా కనిపించదు. అబ్రాహాములాంటి అసాధారణమైన విశ్వాసికి పుట్టిన అతిసాధారణమైన కొడుకు, యాకోబు లాంటి అసాధారణమైన కొడుకును కన్న అతిసాధారణమైన తండ్రి ఇస్సాకు. అబ్రాహాము, యాకోబుల సాహసోపేతమైన జీవితంతో పోల్చితే ఇస్సాకుది సాదా సీదాగా సాగిన ఎంతో సాధారణమైన జీవితం. ఇస్సాకు సాత్వికుడు, ప్రార్థనాపరుడు. ఏకైక కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని దేవుడు అబ్రాహామును ఆదేశించాడు.
అపుడు ఇస్సాకుది దహనబలికి అవసరమైన బోలెడు కట్టెలు మోసుకొంటూ మోరియా పర్వతాన్ని ఎక్కగలిగిన వయసు. అంటే తానే బలిపశువునని కూడా అర్థం చేసుకునే వయసే అతనిది. అయినా అతను మౌనంగా తండ్రికి విధేయుడయ్యాడు. నా కుమారుణ్ణి దేవుడు ఈ లోకంలోనైనా, పరలోకంలోనైనా తప్పక సజీవుని చేస్తాడన్న గొప్ప విశ్వాసం అబ్రాహాముదైతే, తండ్రి తనను బంధించి బలిపీఠం మీద పడుకోబెడుతున్నపుడు, నేను ఈ బలిపీఠం మీద చనిపోయి దహనమైనా నా తండ్రియైన అబ్రాహాము దేవుడు నన్ను తిరిగి సజీవుని చేస్తాడన్న మౌనవిశ్వాసం ఇస్సాకుది. అదే జరిగింది. దేవుడు జోక్యం చేసుకొని ఇస్సాకును కాపాడి చనిపోవలసిన వాణ్ణి నిజంగానే సజీవుని చేశాడు.
మంచితనం, సాత్వికత్వం, ప్రార్థన, పరిణతితో కూడిన మౌనం ఇవన్నీ సమపాళ్లలో మిళితమైన క్రైస్తవ పరిమళభరితం’ ఇస్సాకు జీవితం. ఇస్సాకు కోసం భార్యను వెదికి తీసుకురావడానికి అబ్రాహాము దాసుడైన ఎలియాజరు నాహోరు ప్రాంతానికి వెళ్తే, అతని ప్రయాణం సఫలం కావాలంటూ ఇంటివద్ద ప్రార్థిస్తున్నాడు ఇస్సాకు. అందుకే కాబోయే భార్య రిబ్కాకు కనానులో ఇస్సాకు ప్రార్థించడానికి పొలానికి వెళ్తూ కనిపించాడు (ఆది 24:63–65). ఇస్సాకుకు నలభై ఏళ్ళపుడు రిబ్కాతో వివాహమైంది. ఆ తర్వాత ఇరవై ఏళ్లపాటు రిబ్కా గర్భవతి కాకపోతే భార్య గర్భం తెరవమంటూ ఇస్సాకు ప్రార్థన చేశాడు(ఆది 25:21).
అపుడు ఏశావు, యాకోబు అనే కవలలకు ఇస్సాకు 60 ఏళ్ళ వయసులో తండ్రయ్యాడు. హిమాలయాన్ని అధిరోహించడం, మహా సముద్రాలు దాటడం గొప్ప సాహసమే. కాని దేవుడిచ్చే ఈవుల కోసం ఎన్నేళ్ళైనా, ఎన్ని కష్టాలొచ్చినా మౌనంగా, ఓపిగ్గా కనిపెట్టగలగడం దాన్ని మించిన సాహసం. ఇస్సాకుది ఈ రెండో కోవకు చెందిన సాహసం. ఇస్సాకు ఎన్నోసార్లు తవ్విన బావుల్ని శత్రువులు పగతో పూడ్చేస్తే ఆయన మరో చోట మరో బావి తవ్వుకున్నాడు కాని వారితో ఎన్నడూ తగవులు పెట్టుకోలేదు. ఒక చెంపను కొడితే సాత్వికత్వంతో మరో చెంప చూపించాలి తప్ప ఎదురు దాడి చెయ్యరాదన్న యేసుప్రభువు ప్రేమ ప్రబోధాలకు పాత నిబంధనలోనే ప్రతీకగా నిలిచిన పరిపూర్ణ విశ్వాసి ఇస్సాకు. –రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment