Bible Scripture
-
విశ్వాసికి దేవుడే విలువైన ఆస్తి
డబ్బు, ఆస్తులు మనకు గుదిబండలు కాకూడదు, అవి ఆకాశంలో స్వేచ్ఛగా, ఆనందంగా ఎగిరేందుకు తోడ్పడే రెక్కలు కావాలి. అబ్రాహాముది యూఫ్రటీసు మహానదికి అవతలి వైపున్న మెసొపొటేమియా దేశం. అది ఎంతో అందమైన భవనాలు, సంపన్నులు, యోధులుండే ప్రాంతం. ఒకప్పుడు ఎంతో ఎత్తైన బాబేలు గోపురాన్ని కట్టేందుకు పూనుకున్నది అబ్రాహాము పూర్వీకులే. అలాంటి భవనాలను, సంపన్నతను, శూరులైన తన స్వజనులను వదిలేసి, నాకు దేవుడు మాత్రమే చాలనుకుని, దేవుని ఆజ్ఞతో 1200 మైళ్ళ దూరం ప్రయాణించి వచ్చి కనాను దేశంలో గుడారాల్లో వినమ్రంగా, నిరాడంబరంగా నివసించిన గొప్ప విశ్వాసి అబ్రాహాము. ఆయన తనకున్న కొద్దిమంది సేవకులతోనే కనానులో ఒకసారి నలుగురు రాజులను ఓడించిన మహా యోధుడు కూడా (ఆది 14:5–7). కనానులో దేవుడాయనకు గొప్ప ఆస్తినిచ్చినా అతిశయపడకుండా దేవుడే తన విలువైన ఆస్తి అని భావించిన నిగర్వి. అబ్రాహాము ఒకసారి దేవునితో, నాకు వంశోద్ధారకుడు లేకపోతే, ఆస్తినంతా నా వద్ద బానిసగా ఉన్న ఏలీయాజరుకే ఇచ్చేస్తానన్నాడు (ఆది 15:20). నిజానికి తన సోదరుని కుమారుడైన లోతును అబ్రాహాము తన వెంట తెచ్చుకొని పెంచి పెద్దవాణ్ణి చేశాడు. అలాంటి తన రక్తసంబంధియైన లోతుకు తన ఆస్తి ఇవ్వాలనుకోవడం అందరూ చేసే లోకపరమైన ఆలోచనే. కాని తన రక్తసంబంధికి కాక తన బానిసకు ఆస్తినంతా ఇచ్చేయాలనుకోవడం అబ్రాహాములో పరిమళించిన క్రైస్తవం!! ‘క్రీస్తు యేసుది అయిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి’ అంటుంది బైబిల్ (ఫిలి 2:5). యేసు తన ఈ ‘గొప్ప మనసునే’ వెలలేని ఆస్తిగా మనకిస్తాడు. అదే మన జీవితాన్ని, కుటుంబాన్ని పరలోకానందంతో నింపుతుంది. మన నాణ్యతను తేల్చుకోవడానికి పెద్ద పరీక్షలు అఖ్ఖర్లేదు. ఇంట్లో మన పనివాళ్లను మనం చూసే పద్ధతిలోనే అది తేలిపోతుంది. పనివాళ్లను రాచిరంపాన పెట్టే యజమానులు పైకి ఎంత ప్రార్ధనాపరులు, పండితులు, విశ్వాసులైనా ఆంతర్యంలో వాళ్ళు దేవునికి విరోధులే!!. మన పనమ్మాయి, మన కార్ డ్రైవర్, మనమూ పరలోకంలో అంతా సమానులమై పక్కపక్కనే కూర్చుంటామన్న సత్యాన్ని గ్రహించిన రోజున మన జీవితాలు మారిపోతాయి. గుడారంలో ఉంటూ కూడా అబ్రాహాము పరలోకానందంతో నివసించాడు. దేవుని మనసును అనుకరిస్తూ, అలవర్చుకొంటూ సమృద్ధియైన క్రైస్తవంతో జీవిస్తూ, ఆయన తన గుండెలోనే ఒక గొప్ప గుడి కట్టి తన ప్రభువును అందులో ప్రతిష్టించుకున్నాడు. ఈ గుడిలో ఆరాధనలు ఆగవు, ఈ గుడికి ‘లాక్ డౌన్’లో కూడా తాళాలు పడవు. విశ్వాసి గుండెగుడిలో నుండి పారే నిరంతర ‘ఆరాధనామృతధార’ జీవితాన్ని, లోకాన్ని ప్రేమతో, పవిత్రతతో, ఆనందంతో ముంచెత్తుతుంది. – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్ -
ప్రార్థన పూర్వక జీవితం పరిమళభరితం
క్రైస్తవ విశ్వాసానికి పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అనే ముగ్గురిలో ఇస్సాకు ప్రస్తావన ఎక్కువగా కనిపించదు. అబ్రాహాములాంటి అసాధారణమైన విశ్వాసికి పుట్టిన అతిసాధారణమైన కొడుకు, యాకోబు లాంటి అసాధారణమైన కొడుకును కన్న అతిసాధారణమైన తండ్రి ఇస్సాకు. అబ్రాహాము, యాకోబుల సాహసోపేతమైన జీవితంతో పోల్చితే ఇస్సాకుది సాదా సీదాగా సాగిన ఎంతో సాధారణమైన జీవితం. ఇస్సాకు సాత్వికుడు, ప్రార్థనాపరుడు. ఏకైక కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని దేవుడు అబ్రాహామును ఆదేశించాడు. అపుడు ఇస్సాకుది దహనబలికి అవసరమైన బోలెడు కట్టెలు మోసుకొంటూ మోరియా పర్వతాన్ని ఎక్కగలిగిన వయసు. అంటే తానే బలిపశువునని కూడా అర్థం చేసుకునే వయసే అతనిది. అయినా అతను మౌనంగా తండ్రికి విధేయుడయ్యాడు. నా కుమారుణ్ణి దేవుడు ఈ లోకంలోనైనా, పరలోకంలోనైనా తప్పక సజీవుని చేస్తాడన్న గొప్ప విశ్వాసం అబ్రాహాముదైతే, తండ్రి తనను బంధించి బలిపీఠం మీద పడుకోబెడుతున్నపుడు, నేను ఈ బలిపీఠం మీద చనిపోయి దహనమైనా నా తండ్రియైన అబ్రాహాము దేవుడు నన్ను తిరిగి సజీవుని చేస్తాడన్న మౌనవిశ్వాసం ఇస్సాకుది. అదే జరిగింది. దేవుడు జోక్యం చేసుకొని ఇస్సాకును కాపాడి చనిపోవలసిన వాణ్ణి నిజంగానే సజీవుని చేశాడు. మంచితనం, సాత్వికత్వం, ప్రార్థన, పరిణతితో కూడిన మౌనం ఇవన్నీ సమపాళ్లలో మిళితమైన క్రైస్తవ పరిమళభరితం’ ఇస్సాకు జీవితం. ఇస్సాకు కోసం భార్యను వెదికి తీసుకురావడానికి అబ్రాహాము దాసుడైన ఎలియాజరు నాహోరు ప్రాంతానికి వెళ్తే, అతని ప్రయాణం సఫలం కావాలంటూ ఇంటివద్ద ప్రార్థిస్తున్నాడు ఇస్సాకు. అందుకే కాబోయే భార్య రిబ్కాకు కనానులో ఇస్సాకు ప్రార్థించడానికి పొలానికి వెళ్తూ కనిపించాడు (ఆది 24:63–65). ఇస్సాకుకు నలభై ఏళ్ళపుడు రిబ్కాతో వివాహమైంది. ఆ తర్వాత ఇరవై ఏళ్లపాటు రిబ్కా గర్భవతి కాకపోతే భార్య గర్భం తెరవమంటూ ఇస్సాకు ప్రార్థన చేశాడు(ఆది 25:21). అపుడు ఏశావు, యాకోబు అనే కవలలకు ఇస్సాకు 60 ఏళ్ళ వయసులో తండ్రయ్యాడు. హిమాలయాన్ని అధిరోహించడం, మహా సముద్రాలు దాటడం గొప్ప సాహసమే. కాని దేవుడిచ్చే ఈవుల కోసం ఎన్నేళ్ళైనా, ఎన్ని కష్టాలొచ్చినా మౌనంగా, ఓపిగ్గా కనిపెట్టగలగడం దాన్ని మించిన సాహసం. ఇస్సాకుది ఈ రెండో కోవకు చెందిన సాహసం. ఇస్సాకు ఎన్నోసార్లు తవ్విన బావుల్ని శత్రువులు పగతో పూడ్చేస్తే ఆయన మరో చోట మరో బావి తవ్వుకున్నాడు కాని వారితో ఎన్నడూ తగవులు పెట్టుకోలేదు. ఒక చెంపను కొడితే సాత్వికత్వంతో మరో చెంప చూపించాలి తప్ప ఎదురు దాడి చెయ్యరాదన్న యేసుప్రభువు ప్రేమ ప్రబోధాలకు పాత నిబంధనలోనే ప్రతీకగా నిలిచిన పరిపూర్ణ విశ్వాసి ఇస్సాకు. –రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మంచి శుక్రవారమును గూర్చిన మంచి ఏమిటి?
చరిత్రలో యేసుక్రీస్తు జీవితం ఒక శ్రేష్టమైన జీవితం. ఆయన పేదవారికి, అవసరతలో ఉన్నవారికి ఎంతో మేలు చేశాడు. వికలాంగులకు, పాపులు అనబడే వారికి ప్రేమను చూపించాడు. ఎంతో పవిత్రమైన, స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాడు. ఆయన మాట్లాడిన మాటలు, చేసిన పనులు గత రెండువేల సంవత్సరాలుగా మనుష్యులను ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచమంతటా లక్షలాది మందిని ప్రభావితం చేశాయి. అలాంటి వ్యక్తి మరణాన్ని మంచిదిగా ఎందుకు ఎంచుతున్నాం? ఇతరులకు కీడు కలిగించే మూర్ఖులు ఎవరైనా మరణిస్తే దాన్ని ‘మంచి’ అనుట సహజం. కానీ, యేసుక్రీస్తు మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా మంచి శుక్రవారంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా మనుష్యులలో ఎవరైనా మరణిస్తే, దానిని ‘మంచి’ అనము కదా! అసలు యేసుమరణించిన విధానం ఎంతో ఘోరమైనది. రోమా ఉరికంబంపై చంపబడుట అంటే ఎంతో మనోవ్యధ కలిగించెడి విషయం. అయినా కూడా ఆయన మరణించిన దినాన్ని మంచిదిగా ఎందుకు భావిస్తున్నారు? యేసు ఎవరు? చారిత్రాత్మకంగా గమనిస్తే, యెరూషలేమునకు సమీపాన ఉన్న బెత్లెహేములో క్రీ.పూ. 6వ సం॥ఒక వడ్రంగి కుటుంబంలో యేసు జన్మించాడు. యేసు జీవితం బైబిల్ గ్రంథంలోని నాలుగు సువార్తల్లో రాయబడింది. అందరిలాగే ఆయన కూడ చనిపోయి, అలాగే పాతిపెట్టబడి ఉండి ఉంటే ఆయనను అందరూ మర్చిపోయేవారు. కానీ, ఆయన మరణించిన మూడు దినముల పిమ్మట తిరిగి లేచాడని, ఆయనను చూచిన ఆయన శిష్యులు తెలియబరిచారు. ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన మరణంలోంచి లేచిన పిమ్మట నలభై రోజులలో పది వేర్వేరు సందర్భాల్లో తన శిష్యులకు కనబడ్డాడని చెప్పబడుతున్నది. ఈ వాస్తవం కొరకు ఆయన శిష్యులు తమ ప్రాణాలను ఇచ్చుటకైనను వెనుదీయలేదు. నేటికీ అనేక లక్షలాది మంది ఆయనను తమ రక్షకునిగా స్వీకరించి రూపాంతరం చెందుతున్నారు. తండ్రిని బయలు పరచుటకు వచ్చానని యేసుక్రీస్తు చెప్పడం ఆయన వాదంలో ఒకటి. దేవుడు తనను తాను మానవునికి బయలు పరచుకుంటే తప్ప, మానవుడు దేవుని ఎరుగలేడు. ఎందుకనగా, మానవుడు అవధులు కలిగినవాడేగాదు, దేవుని నుంచి దూరమైన పాపి కూడా. అయితే, దేవుడు తన కృప చేత తన పరిపూర్ణతను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరచాడు. అందుకే యేసుక్రీస్తు, ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమును’’ అని చెప్పాడు (యోహాను 14:6). ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ఒక సంపూర్ణమైన మానవుడుగా ఈ లోకంలో జీవించాడు. అలాంటి జీవితమే మానవుల పాప పరిహారమునకు తగిన బలి. మానవుడు పాపం చేసి దేవుని తీర్పునకు తగినవాడుగా ఉన్నాడు. మానవుని పాపానికి పరిహారం ఏమిటి? మానవుని కొరకు ఒకడు చనిపోవాలి. కానీ, ఏ ఒకడూ ఈ ప్రపంచంలో మానవుని పాపముకై చనిపోతగినవాడు కాడు. ఎందుకంటే, దేవుని దృష్టిలో అందరూ పాపులే. పాపులు పాపుల కొరకు మరణించలేరు. మానవుని పాపానికి పరిహారం దేవుడే చెయ్యగలడు. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువ మీద చనిపోయి, మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం చేయునట్లు చేశాడు. యెషయా ప్రవక్త ఈ విషయం సుమారు ఏడువందల సంవత్సరాల క్రీస్తుపూర్వం ఈ విధంగా ప్రవచించాడు. ‘‘మనమందరం గొఱ్ఱెలవలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను’’ (యెషయా 53:6). యేసుక్రీస్తు మరణం ద్వారా మానవులు పాపక్షమాపణ, దేవునితో సహవాసము పొందగలరు. ఇందుచేత, యేసుక్రీస్తు మరణాన్ని మంచిదిగా పరిగణిస్తున్నారు. క్రీస్తు నరరూప ధారణలో, ప్రాయశ్చిత్త మరణంలో, పునరుత్థానంలో మానవాళికి మేలు, క్షేమం, రూపాంతరం సమాధానం లభించును. - ఇనాక్ ఎర్రా