మంచి శుక్రవారమును గూర్చిన మంచి ఏమిటి?
చరిత్రలో యేసుక్రీస్తు జీవితం ఒక శ్రేష్టమైన జీవితం. ఆయన పేదవారికి, అవసరతలో ఉన్నవారికి ఎంతో మేలు చేశాడు. వికలాంగులకు, పాపులు అనబడే వారికి ప్రేమను చూపించాడు. ఎంతో పవిత్రమైన, స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాడు. ఆయన మాట్లాడిన మాటలు, చేసిన పనులు గత రెండువేల సంవత్సరాలుగా మనుష్యులను ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచమంతటా లక్షలాది మందిని ప్రభావితం చేశాయి.
అలాంటి వ్యక్తి మరణాన్ని మంచిదిగా ఎందుకు ఎంచుతున్నాం?
ఇతరులకు కీడు కలిగించే మూర్ఖులు ఎవరైనా మరణిస్తే దాన్ని ‘మంచి’ అనుట సహజం. కానీ, యేసుక్రీస్తు మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా మంచి శుక్రవారంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా మనుష్యులలో ఎవరైనా మరణిస్తే, దానిని ‘మంచి’ అనము కదా! అసలు యేసుమరణించిన విధానం ఎంతో ఘోరమైనది. రోమా ఉరికంబంపై చంపబడుట అంటే ఎంతో మనోవ్యధ కలిగించెడి విషయం. అయినా కూడా ఆయన మరణించిన దినాన్ని మంచిదిగా ఎందుకు భావిస్తున్నారు? యేసు ఎవరు?
చారిత్రాత్మకంగా గమనిస్తే, యెరూషలేమునకు సమీపాన ఉన్న బెత్లెహేములో క్రీ.పూ. 6వ సం॥ఒక వడ్రంగి కుటుంబంలో యేసు జన్మించాడు. యేసు జీవితం బైబిల్ గ్రంథంలోని నాలుగు సువార్తల్లో రాయబడింది. అందరిలాగే ఆయన కూడ చనిపోయి, అలాగే పాతిపెట్టబడి ఉండి ఉంటే ఆయనను అందరూ మర్చిపోయేవారు. కానీ, ఆయన మరణించిన మూడు దినముల పిమ్మట తిరిగి లేచాడని, ఆయనను చూచిన ఆయన శిష్యులు తెలియబరిచారు. ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన మరణంలోంచి లేచిన పిమ్మట నలభై రోజులలో పది వేర్వేరు సందర్భాల్లో తన శిష్యులకు కనబడ్డాడని చెప్పబడుతున్నది. ఈ వాస్తవం కొరకు ఆయన శిష్యులు తమ ప్రాణాలను ఇచ్చుటకైనను వెనుదీయలేదు. నేటికీ అనేక లక్షలాది మంది ఆయనను తమ రక్షకునిగా స్వీకరించి రూపాంతరం చెందుతున్నారు.
తండ్రిని బయలు పరచుటకు వచ్చానని యేసుక్రీస్తు చెప్పడం ఆయన వాదంలో ఒకటి. దేవుడు తనను తాను మానవునికి బయలు పరచుకుంటే తప్ప, మానవుడు దేవుని ఎరుగలేడు. ఎందుకనగా, మానవుడు అవధులు కలిగినవాడేగాదు, దేవుని నుంచి దూరమైన పాపి కూడా. అయితే, దేవుడు తన కృప చేత తన పరిపూర్ణతను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరచాడు. అందుకే యేసుక్రీస్తు, ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమును’’ అని చెప్పాడు (యోహాను 14:6).
ప్రాయశ్చిత్తం
యేసుక్రీస్తు ఒక సంపూర్ణమైన మానవుడుగా ఈ లోకంలో జీవించాడు. అలాంటి జీవితమే మానవుల పాప పరిహారమునకు తగిన బలి. మానవుడు పాపం చేసి దేవుని తీర్పునకు తగినవాడుగా ఉన్నాడు. మానవుని పాపానికి పరిహారం ఏమిటి? మానవుని కొరకు ఒకడు చనిపోవాలి. కానీ, ఏ ఒకడూ ఈ ప్రపంచంలో మానవుని పాపముకై చనిపోతగినవాడు కాడు. ఎందుకంటే, దేవుని దృష్టిలో అందరూ పాపులే. పాపులు పాపుల కొరకు మరణించలేరు. మానవుని పాపానికి పరిహారం దేవుడే చెయ్యగలడు. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువ మీద చనిపోయి, మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం చేయునట్లు చేశాడు. యెషయా ప్రవక్త ఈ విషయం సుమారు ఏడువందల సంవత్సరాల క్రీస్తుపూర్వం ఈ విధంగా ప్రవచించాడు. ‘‘మనమందరం గొఱ్ఱెలవలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను’’ (యెషయా 53:6). యేసుక్రీస్తు మరణం ద్వారా మానవులు పాపక్షమాపణ, దేవునితో సహవాసము పొందగలరు. ఇందుచేత, యేసుక్రీస్తు మరణాన్ని మంచిదిగా పరిగణిస్తున్నారు.
క్రీస్తు నరరూప ధారణలో, ప్రాయశ్చిత్త మరణంలో, పునరుత్థానంలో మానవాళికి మేలు, క్షేమం, రూపాంతరం సమాధానం లభించును.
- ఇనాక్ ఎర్రా