ఇంగ్లాండ్ లో అదొక మారుమూల ప్రాంతం. అక్కడి చర్చికి కొత్తగా ఒక యువకుడు పాస్టర్‌గా వచ్చాడు. అది క్రిస్మస్ సమయం. క్రిస్మస్‌ను ఎంతో గ్రాండ్ గా జరపాలన్న ఉబలాటంతో అతను సన్నాహాలు ఆరంభించాడు. కాని క్రిస్మస్ ఇంకా పది రోజులుందనగా పెద్ద తుఫాను సంభవించి బీభత్సాన్ని సృష్టించింది. కరెంటు స్తంభాలు, చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, పాత గోడలు వర్షం నీళ్లకు నాని కూలిపోయాయి. ముఖ్యంగా చర్చి భవనం వెనుక గోడ కూడా పాక్షికంగా కూలిపోవడం అతన్ని బాగా నిరుత్సాహపర్చింది. అయినా ఉన్నంతలో ఏర్పాట్లకు పూనుకున్నాడు. కూలిన చర్చి గోడ ‘పులిపిట్’ అని పిలిచే చర్చి వేదికకు సరిగ్గా వెనక ఉన్న గోడ.
చర్చిలో కూర్చున్న వాళ్లందరికీ కనిపించే అతి వికారమైన దృశ్యమది. అప్పటికప్పుడు గోడనయితే కట్టించాడు కాని అది ఒక అతుకులాగే కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. అతనికొక ఐడియా వచ్చింది. చర్చి స్టోర్ రూమ్‌లో ఎప్పటిదో పాతదే అయినా అందమైన ఒక సన్నటి కార్పెట్ ఉంది. దాన్ని దులిపించి, డ్రైవాష్ చేయించి అతుకు పైన దాన్ని వేలాడదీశాడు. అద్భుతం!! అతుకు మాయమవడమే కాదు, పూల్పిట్‌కు అది కొత్త ఆనందాన్నిచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో మిగతా సన్నాహాలకు పూనుకున్నాడతను. చర్చి పాస్టర్ తన ఇంటికి వెళ్ళేదారిలో ఒక ఇంట్లో దాదాపు 65 ఏళ్ళ వృద్ధురాలుంటోంది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది. వస్తూ పోతూ ఆమె కనిపిస్తే ‘బావున్నారా?’ అని పలకరిస్తాడు పాస్టర్. కొన్నిసార్లు ముభావంగానే, బావున్నానంటుంది, మరికొన్నిసార్లయితే అసలు పలకదు.
ఆనందంగా ఉండే వారి ఇంటికి వెళ్లడం కన్నా దుఃఖంతో ఉండే వారింటికి వెళ్లడం మంచిదని దేవుడు చెప్పిన మాటను బట్టి క్రిస్మస్ ముందు రోజు పాస్టర్ ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. వృద్ధురాలు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాని లోనికి పిలిచి కూర్చోబెట్టింది. పాస్టర్ తనను పరిచయం చేసుకున్నాడు. ‘మీరు చర్చికి రావడం నేను చూడ లేదు, ఇంట్లో మీరొక్కరే ఉంటారా?’ అనడిగాడు పాస్టర్. తన గురించి చెప్పడానికి మొదట ఆమె ఇష్టపడలేదు. కాని పాస్టర్ మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల తన గురించి చెప్పింది. ‘నేను, నా భర్త లండన్ లో ఉండేవాళ్ళం. మాకు పిల్లలు లేరు. ఆయన సైన్యంలో పనిచేసేవాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైనిక బృందంతో ఆయన వెళ్ళాడు.
హిట్లర్ సైన్యం చేతిలో బ్రిటిష్ సైనికులు చాలామంది చనిపోయారని, వారిలో నాభర్త కూడా ఉన్నాడని నాకు తెలిసింది. అది విని దుఃఖంతో కుప్ప కూలిపోయాను. నా భర్త ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ జ్ఞాపకాలతో నిండిన లండన్ ఇంట్లో ఆయన ఇక రాడన్న విషాదంతో నివసించలేక, ఆ ఇల్లు అమ్మేసి వచ్చి దూరంగా ఇక్కడ గత 35 ఏళ్లుగా బతుకుతున్నాను. నాలోకం నాది. నాకింత అన్యాయం చేసిన దేవుని స్మరించాలని నాకెన్నడూ అనిపించలేదు. అందుకే నేను చర్చికి రాను. ఇంకేముంది? నేను కూడా జీవితంలో చరమదశకు వచ్చాను’ అన్నదావిడ ఎంతో నిర్లిప్తంగా. ‘నాదొక చిన్న విన్నపం. రేపు క్రిస్మస్ లంచ్‌కు మీరు నా ఇంటికి తప్పక రావాలి’ అనడిగాడు పాస్టర్.
‘మీరేమీ అనుకోవద్దు. నేను రాలేను’ అన్నారావిడ. ‘మీరు నాకు తల్లిలాంటి వారు, దయచేసి కాదనకండి.’ అన్నాడు పాస్టర్ నవ్వుతూ. ఎంతోకాలంగా ఒంటరిగా బతుకుతున్న ఆ వృద్ధురాలి గుండెను ‘మీరు నా తల్లిలాంటివారు’ అన్న మాట నేరుగా గుండెలను తాకిందేమో, ఆమె అంగీకరించింది. ‘కాని ఒక షరతు. మీరే నాయింటికి రేపు లంచ్‌కి రండి నేనే వంట చేస్తాను’ అన్నదావిడ. ‘మహాభాగ్యం. తప్పకుండా’ అన్నాడు పాస్టర్. మరికాసేపు మాట్లాడి వెళ్ళిపోతూ, ‘ఈ రోజు రాత్రి 8 గంటలకు చర్చిలో క్రిస్మస్ ఈవ్ ఆరాధన ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే బదులు రావచ్చు కదా?’ అనడిగాడు పాస్టర్. ‘చూస్తాను’ అందావిడ.
డిసెంబర్ 24 రాత్రి చర్చిలో క్రిస్మస్ ఈవ్ ఆరాధన జరుగుతోంది. చర్చంతా కోలాహలంగా ఉంది. పాస్టర్ మాటి మాటి మాటికీ చర్చి మెయిన్ ద్వారం వైపు చూస్తున్నాడు, ఆ వృద్ధురాలొస్తోందేమోనని. ఆరాధన ఇంకొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఆమె రానే వచ్చింది. పాస్టర్ గుండె ఆనందంతో నిండిపోయింది, అయితే, ఆమె మాత్రం పూల్పిట్ వైపే తదేకంగా చూడటం గమనించాడు. ఆరాధన అయిపోయాక ఆమెను కలవడానికి దగ్గరికి వెళ్లిన పాస్టర్‌తో ‘నేనొకసారి పూల్పిట్ మీదికి వెళ్ళొచ్చా?’ అనడిగింది. ‘తప్పకుండా’ అని ఆమెను నెమ్మదిగా నడిపించుకు పోయాడా పాస్టర్. ఆమె పూల్పిట్ మీది గోడకున్న కార్పెట్‌ను తడమటం ఆరంభించింది. ఆమె కంట నీళ్లు ధారగా కారిపోతున్నాయి.
ఈ కార్పెట్ మీకు ఎక్కడ దొరికింది? అనడిగిందావిడ. ‘తెలీదమ్మా. స్టోర్ రూమ్‌లో ఉండింది. నేనే తీసి ఇక్కడ తగిలించాను’ అని బదులిచ్చాడు పాస్టర్. ‘నాకు, నా భర్తకు కార్పెట్‌లు నేయడం హాబీగా ఉండేది. మేమిద్దరం కలిసి నేసిన కార్పెట్ ఇది!! కావాలంటే చూడండి, కింద కుడి చివర మా ఇద్దరి పేర్లు కూడా నేయబడి ఉన్నాయి’ అన్నదా విడ ఏడుస్తూ. నిజమే ‘రాబర్ట్–లూసీ’ అన్న పేర్లు కార్పెట్‌లో భాగంగా నేయబడి ఉన్నాయి. ‘లండన్ ఇల్లు అమ్మేసినపుడు విరక్తితో అన్ని సామాన్లతో పాటు ఈ కార్పెట్ కూడా అమ్మేశాను. ఇన్నాళ్లకు మా కార్పెట్ మళ్ళీ నాకు కనిపించింది. ఇది నా భర్త తీపి జ్ఞాపకం. దీన్ని చూసేందుకైనా ఇక ప్రతి ఆదివారం చర్చికి వస్తాను. ‘థాంక్ యు వెరీ మచ్. రేపు నా ఇంట్లో గ్రాండ్ క్రిస్మస్ లంచ్. తప్పక రావాలి’ అని చెప్పి వెళ్లిపోయింది. మరునాడు చర్చిలో క్రిస్మస్ ఆరాధన ముగిశాక, అంతా చర్చ్ ఆవరణలో క్రిస్మస్ శుభాలు తెలుపుకొంటున్నారు.
పాస్టర్ కూడా ఆమె ఇంటికి వెళ్ళబోతూ ఎందుకో చర్చ్‌లోకి వెళ్తే పూల్పిట్ వద్ద ఒకాయన ఏడుస్తూ కనిపించాడు. ‘ఏమైంది’ అనడిగాడు ఆయన్ని. ‘నేను గత పదేళ్లుగా పక్క వూర్లో ఉంటున్నాను. అప్పుడప్పుడూ ఈ చర్చికి వస్తూ ఉంటాను’ అన్నాడాయన. ‘పుల్‌పిట్ మీది కార్పెట్ నేను, నా భార్య కలిసి నేసినదే. కింద మా పేర్లు కూడా వున్నాయి. నేను రెండో ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ సైన్యం అంతా చనిపోతూ ఉంటే కొందరితో కలిసి ప్రాణాలతో బయటపడి అనేక దేశాలు తిరిగి లండన్‌లోని మా ఇంటికి వెళ్తే అక్కడ నా భార్య లేదు. ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పారు. అప్పటి నుండీ ఆమెను వెదకని ప్రదేశం లేదు, జ్ఞాపకం చేసుకోని సమయం లేదు.. అంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడాయన... పాస్టర్ గుండె ఉద్వేగంతో కొట్టుకొంటోంది.
తుఫాను వర్షం, కూలిన గోడ, వికారమైన అతుకు, స్టోర్స్‌లో వున్న కార్పెట్... ఒక వృద్ధ జంటను కలిపిన ‘గ్రాండ్ క్రిస్మస్’, దీనంతటి వెనుక ఉన్న దేవుని సంకల్పం, ప్రేమ... ‘హ్యాపీ క్రిస్మస్ టు యు’ అని పాస్టర్ అంటే, నిజమే, మా తీపి జ్ఞాపకమైన కార్పెట్ నాకు మళ్ళీ కనిపించిన హ్యాపీ క్రిస్మస్ అన్నాడా వృద్ధుడు. అతను వెళ్లబోతూ వుండగా, ‘మీకు బ్రహ్మాండమైన లంచ్‌ని ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు. నాతో మీరు రావాలి’ అన్నాడు పాస్టర్. వృద్ధురాలి ఇంట్లో మొదటిసారిగా వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకున్న క్షణంలో ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిసి ఉప్పొంగిన వారి భావనలు వర్ణించడానికి మాటలు చాలవు. వారి కలయికకు తాను కారకుడనైనందుకు పాస్టర్ పొందిన ఆనందం వర్ణనాతీతం.... పోగొట్టుకున్న మానవాళిని తన కుమారుడైన యేసుప్రభువు ద్వారా దేవుడు తిరిగి పొందిన సుదినం ... దేవుణ్ణి మనిషినీ కలిపిన అద్భుత సమయం క్రిస్మస్... (ఇదొక వాస్తవ ఘటన)
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment