
సాక్షి ప్రతినిధికడప: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి క్రిస్మస్ రోజున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసు వర్ధంతి రోజు క్రిస్మస్ జరుపుకుంటారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి వీరారెడ్డి మృతి రోజు ఏసు వర్ధంతి రోజు ఒకటేనని సెలవు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏసుక్రీస్తు జయంతి రోజున (డిసెంబర్ 25) క్రిస్‌మస్ పండుగ చేసుకుంటారు. అందులో భాగంగానే మంగళవారం బద్వేల్ పట్టణంలో మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న అమాత్యుడు ఏసుక్రీస్తు చనిపోయిన రోజే మాజీ మంత్రి వీరారెడ్డి చనిపోయారని వెల్లడించారు.
వాస్తవంగా ఏసుక్రీస్తు శిలువ ఎక్కిన రోజున ‘గుడ్‌ప్రైడే’ నిర్వహించడం క్రైస్తవుల సంప్రదాయం. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా మంత్రికి లేదా.. లేకపోతే తాను ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతోందనే థోరణా... అని పలువురు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ‘ఎస్సీలు సక్రమంగా చదువుకోరు. పరిశుభ్రంగా ఉండరు. ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా మారరంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి అయి ఉండీ ఏమిటీ తీరు ప్రశ్నిస్తున్నారు.