మాయమ్మ చేసిన క్రిస్మస్‌ కేకు | Special story to christmas cakes | Sakshi
Sakshi News home page

మాయమ్మ చేసిన క్రిస్మస్‌ కేకు

Published Tue, Dec 25 2018 12:08 AM | Last Updated on Tue, Dec 25 2018 12:08 AM

Special story to christmas cakes - Sakshi

పలాసకు ఆరు మైళ్ళ దూరంలో డెబ్బై గడపలున్న  మా ఊళ్లో ప్రభువును నమ్ముకున్న కుటుంబం మాదొక్కటే. దసరాకీ, గౌరీపూజకీ వడపప్పు, అరిసెలు, మెత్తటి గారెలు ఇరుగూ పొరుగు పంపిస్తే తినడమేగానీ క్రిస్మస్‌కు, ఈస్టర్‌కూ ఒక కేకుముక్కో, గులాప్పువ్వో వండి పక్కింటికీ ఎదురింటికీ పంపడానికి మాయమ్మకు సేతులొచ్చేవి కాదు.  ఆ సమచ్చరం క్రిస్మసుకు ముందు పలాసా చర్చీ నుండి పాదరుగారు, సిస్టర్‌గార్లు ఒక రాత్రి పూట జీపులోవొచ్చి ఊరంతా నిద్రలెగిసినట్లు క్రిస్మస్‌ పాటలు పాడి మా ఇంటికొస్తే తెల్లటి బట్టల్లోన ఉన్న పాదరు గారిని సూడ్డానికి  పక్కింటి రామారావు, ఆళ్ళావిడా ఒచ్చారు. వాళ్లు పాదరు గారితో ‘ఈ మొగుడూ పెళ్లాం  మీ పండగ రోజు పిల్లడ్ని పట్టుకొని చర్చీకొచ్చీడమూ, పొద్దల్లా అక్కడే ఉండిపోయి పొద్దోయికి  మీరిచ్చిన పాలుగుండ, పంచదార పట్టుకొని పార్రాడమే గాని ఒక కేకో , పండో, కాయో ఎవులకీ ఇచ్చింది లేదు’ అని చెప్పగానే  మాయమ్మ , నాయిన మొఖాలు సున్నం రాసినట్లయిపోయినాయి. పాదరుగారు మాయమ్మతోటి ‘సరోజినమ్మా .. పండుగంటే సంతోషం పంచుకోవటం కదా. ఇరుగూ పొరుగుకు పండగపూట ఒక తీపో, కారమో చేసి పంపాలి. ఈ సంవత్సరం కేక్‌ చేసి అందరికీ పంచు’ అన్నారు. 

‘దానికి తరవాని పులుసు సెయ్యడమే రాదు ఇంకా కేకు ఎక్కడ సేస్తాది’ అన్న మా నాయిన మాటలకు నవ్వీసి ‘కేక్‌ చెయ్యక్కర్లేదు. బజార్లో దొరుకుతుంది. కొనేసి ఊరంతా పంచండి ‘ అని సెప్పీసి పాదరుగారు ఎల్లిపోయారు. దాంతో ఈసారి క్రిస్మసుకు అరిసెలు వండీసి, మిగిలిపోయిన అరిసిల పిండిలో ఇంకొంచం నీళ్లు కలిపి పొంగడాలు సేసి, దానితోటి ఒక కేకు ముక్క కూడా ఊరంతా పంచీసి ఉన్న సెడ్డపేరును సెరిపీసుకోవాలని మాయమ్మ నాయిన అనుకున్నారు.  క్రిస్మస్సుకు ఊరందరికీ పంచడానికి ఎంత కేకు కావాలని మాయమ్మ మా నాయిన ఆలోచన సేస్తే  సుమారు నాలుక్కేజీలు కావాలని లెక్క తేలింది.నాలుక్కేజీల కేకు రేటెంత అని అడిగితే పలాసల  కోవాకొట్టు గురుమూర్తి  వందరూపాయలు సెప్పినాడు. మా నాయిన బుర్ర మీద గుడ్డేసుకుని ఇంటికొచ్చి విసయం సెప్పి, వందరూపాయల అప్పు ఇచ్చెటోడు ఇప్పుడుకిప్పుడు ఎక్కడ దొరుకుతాడని మాయమ్మనడిగాడు. మాయమ్మ అప్పుడికే తను దాసుకున్న సొమ్ముతోటి  మా నాయినకొక పంచి, నాకు ఎర్ర నిక్కరు, పసుపు జుబ్బా , దానికి ఒక సీర కొనీసింది.మిగిలిన డబ్బులుకి పప్పలు సెయ్యడానికి నూని కొనీసి, ఆరబెట్టిన బియ్యము మిల్లాడించేసి రడీగా ఉన్నాది. కేక్‌ కొనడానికి ముప్పై రూపాయలు పట్టుకెల్లిన మా నాయిన పప్పులుడకలేదు. తెల్లారితే క్రిస్మస్సు. ఇరవై నాలుగు తేదీ రాత్రి చర్చికి ఎల్లడానికి ముందే పప్పల వంట పూర్తి చేసీసింది మా యమ్మ. ఆ రాత్రి యేసయ్య పాటలతో, కొవ్వొత్తుల కాంతులతో చర్చంతా ప్రభువు పుట్టిన గడియల్ని పండుగ సేసుకున్నాం. ఊరికి బయలుదేరుతుంటే పాదరుగారు ‘కేక్‌ పంచుతున్నారా లేదా’ అని మా నాయినను అడిగితే మొగమాటంగా తలూపీసి ఊరికి పారొచ్చినాము. మాయమ్మ దారంతా సణుక్కోనొచ్చింది.ఇంటికొచ్చినప్పడుకి వేకువజామైపోయింది. నేను రాగానే పడుకుండి పోయినాను. 

పొద్దున్న నేను లెగిసినప్పుడికి  మాయమ్మ , మా నాయిన ఇద్దరూ ఇంటిలోన లేరు. కానీ ఎదురుగా నల్లటి  రంగులోన కొంచం మిగిలున్న కేకు కనిపించింది. అది పెద్ద అట్ట మీద ఉంది. చాలా కేకు ఎవరో తినీసినట్లు అర్థమవుతున్నది. అంత పెద్ద కేకు ఎక్కడిది, ఎవరు తెచ్చారు అని నేను ఆలోసిస్తుంటే  మాయమ్మ మొకమంతా పళ్ళు చేసుకొని లోపలికొచ్చింది. ‘ఊర్ల ఒక్కిల్లు ఒగ్గకుండా పంచీసినాను. పక్కింటి రామారావు నాలుగు ముక్కలు ఒక్కడే తినీసాడు బెగ్గురోడు’ అని ‘ఇది మొత్తం నీకే నాయినా.. తినీ’ అని అన్నాది.‘డబ్బుల్లేవని నాయిన అన్నాడు కదా.. మరిప్పుడెలగ కొన్నాడమ్మా’ పెద్ద ముక్కను తెంపి నోట్లో కుక్కుకోబోతూ అడిగాను. ‘మీరు పక్షులను చూడుడు. అవి విత్తవు, కోయవు’ అని పాదరు బైబిల్‌లోన మాటలు సెప్తారు కదా .. ఇదీ అలగే . మన పరిస్థితి జీపు డ్రైవరు జీవరత్నము తెలిసిన నలుగురికీ సెప్పితే,  చర్చిలోనే కలిగినోళ్లందరూ నాలుగు డబ్బులేసుకొని కొవాకొట్టులోన డబ్బులు కట్టి జీవరత్నము తోటే తెల్లవారినప్పుడుకి పంపించినారు. మీ నాయన అరిసిలు, కేకు ముక్క పట్టుకొని జీవరత్నంఇంటికే బయల్దేరినాడు. ఈ ఊర్ల యేసును నమ్ముకున్న ఒక్క కుటుంబము మనది. ఉన్న రెండు పండుగలూ జరుపుకోలేని జరుగుబాటు మనది. ఈ సమ్మచ్చరం మనము సక్కగా క్రిస్మస్సుసేసుకున్నట్లు సేసిన ఆల్లందరూ సల్లగుండాలని ప్రార్ధన సెయ్యు నాయినా’ అని సెప్పింది  మా యమ్మ.  నేను గోడకున్న ప్రభువు ఫొటో ఉన్న కాలెండర్‌ దుక్కు సూసి, సిలువ గుర్తు ఏసుకుని .. కళ్ళు మూసుకుని ఆమెన్‌ అనుకున్నాను. 
- కె.వి. కరుణకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement