యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండీ మానవాళి చరిత్ర ఆయన చుట్టూనే పరిభ్రమిస్తున్నది. కాలం తనకు ముందు, వెనుక క్రీస్తు నామాన్ని ధరించి సాగుతూ ఉన్నది. భూమిమీద మరణాన్ని జయించి, శత్రువు తలను చితగ్గొట్టి, పునరుత్థానుడై, నలభై దినాలు ఈ నేలమీదే సంచరించి, దేవుని రాజ్య విషయాలను బోధించి, అనేక ప్రమాణాలను చూపిన ఏకైక దైవ మానవుడు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు! యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం. ఈ ‘రక్షకుడు’ రారాజుగా మానవజాతికి శత్రువైన మృత్యువును జయించి, నరకపాత్రులమైన మనం పోగొట్టుకున్న స్వర్గం అనబడే నిత్యానందలోకంలోకి ప్రవేశాన్ని కల్పించాడు! అందుకే .. ఆ పేర్లు!
ఆయన ఆరోహణ కోసం వెళ్ళేముందు యెరూషలేములోని ఒలీవా పర్వతసానువులలో తన శిష్యులను కలసి, వారు చేయవలసిన పనులను వారికి వివరించారు. ‘పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక ముందుగా యెరూషలేములోనూ, తర్వాత యూదయ, సమరయ దేశములలో, అనంతరం భూదిగంతాల వరకునూ మీరు నాకు సాక్షులైయుందుర’ని వాళ్లతో చెప్పారు. అందుకే, భూ దిగంతాల వరకూ ఈ సత్య శుభవార్త ప్రకటింపబడుతున్నది! వాళ్లు చూస్తుండగానే ఆయన ఆరోహణమై, వాళ్ల కళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొని పోయింది. వారంతా ఆకాశము తట్టు తేరి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ‘మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏరీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.’ అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ వివరాలున్నాయి.
క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై.. తాను జీవాధిపతి అని, నశించిన దానిని వెదకి రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానని రుజువు పరచి ఇప్పటికి ఈ నేల మీద 2000 సంవత్సరాలకు పైగా అయింది! ఆయనకు ముందు చరిత్ర అంతా ‘క్రీస్తుకు పూర్వం’ అని, తర్వాతి కాలమంతా ‘క్రీస్తు శకం’ అని చరిత్ర నమోదు చేస్తున్నది. చరిత్రలో ప్రముఖులైన ఎందరో క్రీస్తును గురించి తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఫ్రెంచ్ అధినేత నెపోలియన్ బోనాపార్టే, ప్రపంచ దేశాల స్థాపకుల గురించి చెప్తూ ‘ఈ భూమి మీద సామ్రాజ్యాలను స్థాపించిన అలెగ్జాండర్, సీజర్ , నేను, చార్ల్ మాన్ .. యేసుక్రీస్తుతో ఏ విధముగానూ సరి పోలము .. మా మధ్య ఏ పోలికా లేదు, ఆయన ‘ప్రేమ’ పునాదిగా స్థాపించిన మహా సామ్రాజ్యం అంతమే లేనిది. ఎప్పటికీ నిలిచి ఉండేది! యేసుక్రీస్తు మానవుడు కాదు, మహోన్నతుడు!’
‘ప్రేమ, సత్యం, త్యాగం అనే దివ్యమైన సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలను సాధించి, జీవించి , చూపించిన యేసుక్రీస్తును నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను?’ అన్నారు మన గాంధీజీ.
అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల్లో ‘నేను యూదుడనే, గానీ, ఆ నజరేయుని (క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రవాహంలో మునిగి పోయాను. క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని ఏ కలమూ వర్ణించలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారెవరైనా యేసు సాన్నిహిత్యాన్ని అనుభవించాల్సిందే!’
స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా చూద్దాం ‘యేసుక్రీస్తు దైవ కుమారుడు గనుకనే, దైవ జ్ఞానాన్ని తన మాటల్లోనూ, కార్యాల్లోనూ చూపించారు, ప్రకటించారు.’
ఇలా ఎందరెందరో క్రీస్తు ప్రభువును గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రభువు చెప్పారు...
‘తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, నేను మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు.’
సిలువ మీద బలియాగం అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడై 40 దినములు ఈ భూమి మీద సంచరించి, అనేకమందికి దర్శనమిచ్చి, వాళ్లు చేయవలసిన విధివిధానాలను చెప్పి ఒలీవాల కొండ మీద తన శిష్యులతో చెప్పవలసిన మాటలు చెప్పి, దాదాపు 500 మంది యెరూషలేము వాస్తవ్యులు చూస్తూ ఉండగానే మేఘాలలోకి ఆరోహణమయ్యారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలకు చెప్పారు..
‘యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు మేఘాలపై ఆరోహణమై వెళ్లారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తార’ని! ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని మేఘ వాహనం మీద తీసుకుని వెళ్తారు, తర్వాత ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. మృత్యుంజయుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోయే ఆ క్షణం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమైన ఆ పరలోకానికి పాత్రులమయ్యేందుకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుదాం. ఈ పునరుత్థాన పండుగ మనకిచ్చే సందేశం అదే. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు! దేవుడు మనందరినీ తన పునరుత్థానశక్తితో దీవించును గాక!
– ఝాన్సీ కె. వి. కుమారి
Comments
Please login to add a commentAdd a comment