బలహీనులను అజేయులను చేసిన యేసు పునరుత్థానం
తల్లి మరణపుటంచుల వరకూ వెళ్లిన అనుభవంతో మరో జీవికి ప్రాణం పోస్తుంది. గింజ భూమిలో పడి చనిపోయి మరో మొలకకు
జీవాన్నిస్తుంది. నది సాగరంలో కలిసిపోయి అంతర్థానమైపోగా ఆ నీరే ఆవిరై మేఘాలుగా మారి సరికొత్త నీటి రూపంలో వానగా కురిసి నేలపై చెట్లు చేమలకు, పొలాలకు చేనులకు జీవనాధారమవుతుంది. చావు పుట్టుకలు, జీవన వలయంలో అంతర్భాగమై మనిషి జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. కాని యేసుక్రీస్తు ‘పునరుత్థానం’ సృష్టిలోనే ఒక అపూర్వమైన ఘటన!! జీవన్మరణాలకు అతీతుడైన దేవుడు సిలువలో చనిపోవలసి రావడం, మూడవ దినం తాను ముందే ప్రవచించినట్టుగా పునరుత్థానుడవడం క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా మారింది.
ఆయన ఎన్నుకున్న శిష్యులు పన్నెండుమంది. వారిలో యూదా ఇస్కరియోతు ఆదినుండి విప్లవభావాలు గలవాడు, మేధావి. కావాలనుకుంటే యేసుక్రీస్తుకే బోధ చేయగల సమర్థుడు. ప్రజల్లో రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాన్ని తెచ్చి తానే తదుపరి పాలకుడుగా సింహాసనాన్ని అధిష్టించాలన్న ‘రహస్య అజెండా’తో యేసును అనుసరించాడు. కాని అంతలోనే చతికిలపడ్డాడు. తాను యూదు ప్రముఖుల చేతిలో మరణించక తప్పదంటూ ఆ వెంటనే యేసుక్రీస్తు ప్రకటించడం అతన్ని నిరుత్సాహపరిచింది. యేసుక్రీస్తును ఇక వెంబడించడం వృథా అనుకొని ఆయన్ను అమ్మకానికి పెట్టాడు. ఆవిధంగా తన జీవితాన్నే అంతం చేసుకున్నాడు.
మరో శిష్యుడు పేతురు. స్వభావరీత్యా దుడుకువాడైనా యేసంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ. కాని క్షణికావేశంతో సంచలన నిర్ణయాలు తీసుకునే నైజం వల్ల సిలువకు ముందు రాత్రి తీవ్రమనోవేదనకు, నిస్పృహకు గురై ప్రాణభయంతో యేసు ఎవరో తనకు తెలియదంటూ మూడుసార్లు బొంకి యేసును ప్రేమించని, వ్యతిరేకించని ‘తటస్థవర్గం’లో చేరిపోయాడు. శిష్యుల్లో మరొకాయన తోమా ‘‘నేను కళ్లారా చూసి కాని ఏదీ నమ్మను’’ అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ‘ప్రాక్టికల్ వ్యక్తి’. ఆయన శిష్యుల్లో యోహాను మినహా అంతా ఆయన్ను వదిలేసినవారు, ఆయనకు ద్రోహం చేసినవారే!!
లోకంలో ఎన్నిరకాల మనస్తత్వాల ప్రజలున్నారో అన్ని రకాల వారికి ప్రతినిధులు ఆయన శిష్యులైన పన్నెండుమందిలో ఉన్నారు. ఆయన్ను ప్రేమించిన కొందరు స్త్రీలు, ఆయన తల్లిలాంటి కొందరు ఆప్తులు మినహా కష్టకాలంలో సిలువ అనుభవంతో ఆయనతోపాటు నిలిచే అనుభవం యోహానుకు తప్ప... శిష్యుల్లో ఎవరికీ లేదు. యుద్ధరంగంలో ఓడిపోతున్న రాజుకు అండగా నిలవడం అవివేకమనుకొని, బతికుంటే బలుసాకైనా తినవచ్చునన్న లౌక్యంతో యుద్ధాన్ని వదిలి పారిపోయిన పిరికి సైనికులే ఆ శిష్యులంతా!
కాని అత్యద్భుతం ‘ఈస్టర్’ తెల్లవారు జామునే జరిగింది. యేసుక్రీస్తు పునరుత్థానుడవడం ఆ అత్యద్భుతమైతే, పిరికితనానికి స్వస్తి చెప్పి ఆయన ఖాళీ చేసిన సమాధి వద్దకు శిష్యులంతా పరుగులు తీశారు. యేసును సమాధిలో పడుకోబెట్టిన ప్రదేశంలో కూర్చున్న ఒక దేవదూత ‘‘ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు’’ అని ప్రకటించిన పునరుత్థాన శుభవార్తతో వారి జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. యేసు వారిని ఎంపిక చేసుకున్నపుడు వారికి ‘అపొస్తలులు’ అని పేరు పెట్టాడు. ‘పంపబడిన వారు’ అని దాని అర్థం. ఆ సమయంలో వారికి తమకా నామధేయమెందుకో అర్థం కాలేదు. కాని ‘యేసుక్రీస్తు పునరుత్థాన రక్షకుడు’ అన్ని శుభసందేశాన్ని భూ దిగంతాలకు తీసుకెళ్లేందుకు తాము పంపబడుతున్న వారమన్న అవగాహనలోనికి వారిపుడు ‘పునరుత్థాన శక్తి’తో ఎదిగారు. ఆ కర్తవ్యపాలనలో ఒక్కడుగు కూడా వెనకేయకుండా అజేయంగా ముందుకు సాగిపోయారు. తమ ప్రాణాలు సైతం ధారపోయడానికి వెనుకాడక ప్రపంచం నలుమూలలకు ఆ శుభసందేశాన్ని తీసుకెళ్లారు.
పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు వారిని సందర్శించి, ఆత్మీయంగా సంధించి వారు చేయవలసినదేమిటో విశదంగా తెలిపాడు. యేసు ఇచ్చిన ఆ పునరుత్థాన శక్తితోనే ఒక్కొక్కరూ అనేక ప్రాంతాలకు వెళ్లి అనేక శ్రమలకోర్చి క్రీస్తు ప్రేమ సందేశాన్ని లోకానికి అందించారు. ఆయనకు శిష్యులుగా పేరొందిన 12 మంది మాత్రమే కాక మరో 70 మంది ఆయన అనుచరులుగా ఉండి అనేక ప్రాంతాలకు సువార్త తీసుకెళ్లారు. ఆ డెబ్భై మందిలో ఒకాయన మార్కు అనే శిష్యుడు. ఈ మార్కు, పక్కనే ఉన్న ఈజిప్టు దేశానికి సువార్త తీసుకెళ్లాడు. ఆయన అసమానమైన పరిచర్యే 3వ శతాబ్దానికల్లా ఈజిప్టు దేశాన్ని క్రైస్తవదేశంగా మార్చి వేసింది.
పిరికివారు, స్వార్థపరులు, ద్రోహులు, అనుమానించే నైజం కలిగిన నిత్య శంకితులు అంతగా కార్యోన్ముఖం కావడానికి వారిని పురికొల్పింది యేసు ప్రేమ కాగా, వారు కళ్లారా చూసిన యేసు పునరుత్థాన రుజువులే వారికి ప్రధాన ప్రేరణలు.
- రెవ టి.ఎ. ప్రభుకిరణ్
సువార్తికులు
కత్తి కన్నా, దౌర్జన్యం కన్నా, హింస కన్నా సమున్నతమైనది ప్రేమ, క్షమాపణ అన్నది యేసుక్రీస్తు తన జీవితం, మరణం, పునరుత్థానం ద్వారా రుజువు చేశాడు. ఆ రుజువులు ఇప్పటి ఆయన అనుచరుల్లో, విశ్వాసుల్లో స్పష్టంగా కనిపించాలి. రాజకీయాలకు, అధికార దాహానికి అతీతమైనది క్రైస్తవ విశ్వాసం. యేసుక్రీస్తును నిజంగా నమ్మేవారికి ఆ రహస్యం తెలుసు. దేవుణ్ణి లోక ప్రయోజనాల కోసం, ధనార్జన కోసం నమ్ముకోవడం మతం. అయితే నిస్వార్థంగా, నిర్మలంగా దేవుని ప్రేమను లోకానికి పంచి కొవ్వొత్తిలాగా కరిగి అంతర్థానమైపోవడం అత్యున్నతమైన క్రైస్తవ విశ్వాసం. అదే యేసు పునరుత్థాన సందేశం!!