ప్రేమకు పునరుత్థానం
విశ్వమంతా దాదాపు 36 గంటలపాటు నెలకొన్న నిశ్శబ్దానికి, విశ్వాన్ని ముంచెత్తిన విషాదానికి ఆదివారం తెల్లవారుజామున తెరపడింది. సూర్యోదయ కిరణాలు అవనిని తాకడానికి ముందే సూర్యుని సృష్టికర్త, బైబిలులో నీతిసూర్యుడుగా పిలువబడిన రక్షకుడైన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యాడు. చీకటి పొరలను చీల్చి చెండాడుతూ దేదీప్యమానంగా ఉదయించాడు. అదే ఈస్టర్ మహాపర్వదినం, మహోదయం!
సిలువలో మరణించడానికి కొన్ని రోజుల ముందు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన బోధ చేశాడు. విత్తనం భూమిలో పడి చనిపోతేనే మొలకెత్తి మహావృక్షమవుతుందని ఆయన బోధిస్తే, చాలామందికి అది అర్థం కాలేదు. మరణం అన్నింటికీ మహా అంతమన్నది చాలామందికున్న అవగాహన. అలాంటి అత్యంత విషాదభరితమైన, దుఃఖపూరితమైన, నిరాశావహమైన మరణానికి తన జీవితంలోనే ఒక కొత్త నిర్వచనమిచ్చాడు యేసు. ఆయన ఒక విత్తనంలాగే శుక్రవారంనాడు మరణించాడు. మూడోరోజు పునరుత్థానం ద్వారా మొలకెత్తి అచిరకాలంలోనే ఆయన పేరిట స్థాపించ బడిన చర్చిలు, ఆరంభించబడిన క్రైస్తవ ప్రేమ, క్షమాపణోద్యమం మహావృక్షంగా పెరిగి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది.
ఈ రెండు వేల ఏళ్లలో క్రైస్తవోద్యమం ఎదుర్కోని పెను సవాళ్లు లేవు. శత్రువుల అణచివేతలో ఈ ఉద్యమం నిలువెల్లా గాయపడింది. కాని బలహీనపడలేదు. ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేయాలన్నదే యేసు పునరుత్థానం పునాదిగా ఆరంభమైన క్రైస్తవోద్యమ ప్రధాన ధ్యేయం. ప్రేమను, క్షమాపణను తీసేస్తే క్రైస్తవోద్యమంలో ఇక మిగిలింది ఏమీ లేదు. పరిపాలకులకు, రాజులకు వ్యతిరేకంగా క్రైస్తవం హింసాత్మకంగా ఎదురు తిరిగి వారిని ధిక్కరించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఒకటో రెండో ప్రాచీన యూరోప్‌లో అలాటి సంఘటనలు జరిగినా వాటి ప్రభావం ఉద్యమం మీద లేదు. అహింస, క్షమాపణలతో కలసి ఉన్న క్రైస్తవ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పడంలో అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని ఒడుదొడుకులేర్పడ్డా, ఉద్యమం అద్భుతంగా విస్తరించింది.
అలా చనిపోయాక మూడవ నాడు పునరుత్థానుడైన యేసుప్రభువు మొట్టమొదట సమాధి వద్దే మగ్గలేనె మరియకు కనబడి తాను సజీవుడనయ్యానన్న విషయాన్ని తన శిష్యులకు, ఇతర అనుచరులకూ తెలియజేయమని ఆదేశించాడు. యాకోబు తల్లి అయిన మరియకు, సలోమీ, యెహన్నా అనే స్త్రీలకు ఆయన కనిపించాడు. ఆ తర్వాత భోజనానికి కూర్చున్న తన 11మంది శిష్యులకూ కనిపించాడు. కావాలంటే నా గాయాల్లో వేలు పెట్టి చూసి ఆ తర్వాతే తనను విశ్వసించమని నిత్యశంకితుడైన తోమా అనే తన శిష్యునితో ప్రభువన్నాడు.
ఒకచోట ఆయన శిష్యులతో సహా దాదాపు ఐదొందలమంది అనుచరులు కూడి ఉండగా యేసు వారి మధ్య సాక్షాత్కరించాడు (1 కొరింథి 15:6). పునరుత్థానుడైన తర్వాత అలా యెరూషలేము, గలలియ ప్రాంతాల్లో పలువురికి 40 రోజులకు పైగా తనను తాను కనబరచుకొని తాను సజీవుడనయ్యానని రుజువు చేసుకున్నాడు. పిదప వాళ్లంతా చూస్తుండగా 40వ రోజున ఒలీవల కొండ మీదినుండి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ముష్కరులు హీనాతిహీనంగా అతి దారుణంగా చంపిన తమ రక్షకుడు మళ్లీ సజీవుడయ్యాడన్న తిరుగులేని విశ్వాసంతోనే క్రైస్తవోద్యమ వ్యాప్తికి ఆయన అనుచరులంతా ప్రపంచం నలుమూలలకూ ఆ సువార్తను తీసుకెళ్లారు.
ఆయన శిష్యులందరిలోకీ అనుమానాల పుట్ట అయిన తోమా ఇండియాకు సువార్త తీసుకొచ్చాడు. ఇండియాలోనే గత సాక్షి అయ్యాడు. ఆయన మలబారు తీరం (ఇప్పటి కేరళ)లో స్థాపించిన చర్చి ఈనాటికీ ఉంది. తోమా సమాధి చెన్నైలో మౌంట్ ఆఫ్ థామస్‌గా పిలువబడే కొండ మీద ఉంది. శ్రమల్లో యేసును వదిలి పారిపోయిన శిష్యులు, అనుచరులంతా ఆ తర్వాత చనిపోవడానికి కూడా సిద్ధపడి సువార్తను భూ దిగంతాలకు తీసుకెళ్లడానికి ప్రోద్బలాన్ని, నైతిక, ఆత్మీయ సై్థర్యాన్ని ఇచ్చిన ఒకే ఒక అంశం ఆయన పునరుత్థానం!!
ఆయన శుక్రవారం నాడు ఏకాకిగా, నిస్సహాయుడిగా సిలువలో మరణించడం వాళ్లంతా చూశారు. ఆ కళ్లతోటే ఆదివారం ఉదయం నుండి 40 రోజులపాటు ఆయన్ను సజీవంగా చూశారు. ఆయనతో మాట్లాడారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయనిచ్చిన ఆజ్ఞలన్నీ అర్థం చేసుకున్నారు. నేను మళ్లీ వస్తానని వాగ్దానం చేసి, పరలోకానికి 40వ రోజున ఆరోహణుడు కావడాన్నీ చూశారు. అయితే శత్రువుల కుట్రలు సాగుతూనే ఉన్నా, క్రైస్తవోద్యమ వ్యాప్తి అంతటా ఊపందుకుంది.
యేసు నిజానికి చనిపోలేదు, ఆయన స్థానంలో మరొకరు చనిపోయారని, ఆయన దేహాన్ని శిష్యులు మాయం చేసి ఆయన పునరుత్థానుడయ్యాడనే పుకార్లు లేపారని, యేసు సమాధిలోనుండి తప్పించుకొని ఇండియాలోని కాశ్మీర్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడి చనిపోయాడని, ఆయన పేరుతో కాశ్మీర్‌లో సమాధి కూడా ఉన్నదని శత్రువులు గాలి వార్తలు పుట్టించారు.
యేసు సమాధికి రోమా ప్రభుత్వ చక్రవర్తి సీలు వేసి, రోమా భటులు 24 గంటలూ కావలి ఉంటే, ఆంత గాయపడ్డ యేసుకు వారినెదిరించి సమాధినుంచి పారిపోయే శక్తి ఉంటుందా? యేసును సిలువ వేయడంతోనే పిరికివారుగా తమ ప్రాణాల కోసం పారిపోయిన శిష్యులకు రోమా సైనికులనెదిరించి, సమాధి తెరిచి ఆయన దేహాన్ని దొంగిలించే ధైర్యం ఉంటుందా? ఒకే ఒక్క సత్యానికున్న బలం, కోటి అసత్యాలకు కూడా ఉండదు. యేసు పునరుత్థానుడై, మళ్లీ సజీవుడై, పరలోకానికి ఆరోహణమైన దేవుడని, ఆయన సజీవుడని బైబిలు చెబుతోంది. విశ్వాసులు నమ్ముతున్నారు. అదంతా సత్యమని చరిత్ర సాక్ష్యం చెబుతోంది.
అందరికీ ఈస్టర్ శుభాభినందనలు.