
కుటుంబ వ్యవస్థను నిర్మించింది దేవుడే!
సువార్త
కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడే!! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే!
యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమిది. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు బుద్ధిమంతుడు. చిన్నవాడు వ్యసనాల పుట్ట, అవిధేయుడు. చిన్నవాడు తండ్రిపై తిరుగుబాటు చేసి తన వంతు ఆస్తి రాబట్టుకొని దూర దేశం వెళ్లి విచ్చలవిడిగా జీవించి అంతా దుబారా చేశాడు. చివరికి పూట గడవని స్థితిలో పందులు మేపుతూ అవి తినే పొట్టుతో కడుపు నింపుకొంటున్నాడు. తన తండ్రి వద్ద ఉన్న పనివాళ్లు తనకన్నా గౌరవంగా బతుకుతున్నారన్న కనువిప్పు ఒకరోజు కలిగి, కొడుకుగా కాదు ఒక పనివానిగా తనను చేర్చుకొమ్మని ప్రాధేయపడేందుకు అతను తండ్రి వద్దకొచ్చాడు.
కాని కుమారుని పునరాగమనంతో పరవశించిపోయిన తండ్రి అతనికి ప్రశస్తవస్త్రాలు, ఉంగరం తొడిగించి బంధుమిత్రులకు గొప్ప విందు చేశాడు. తన కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడంటూ తండ్రి మహదానందపడ్డాడు (లూకా 15:11-25). సర్వోన్నతుడైన దేవుడు మానవాళిని కన్నతండ్రిలా ప్రేమిస్తున్నాడని వివరించేందుకు యేసుక్రీస్తు చేసిన అద్భుత ప్రయత్నమిది. ఉపమానంలో తండ్రి తన వద్ద ఉన్నపుడూ, తనమీద తిరుగుబాటు చేసినపుడూ కూడా చిన్న కొడుకును ప్రేమిస్తూనే ఉన్నాడు. అతని రాక కోసం ప్రేమతో ఎదురు చూశాడు. తిరిగొచ్చిన మరుక్షణం అతన్ని ఆలింగనం చేసుకొని పూర్వస్థితికన్నా వైభవ స్థితిని అతనికిచ్చాడు. కాని తండ్రితో ఉండగా ఒక యువరాజుగా వెలుగొందిన వాడు తండ్రిని వదిలి వెళ్లి పందుల పొట్టు తిని బతికే భ్రష్టత్వాన్ని తెచ్చుకోవడం మాత్రం కేవలం అతని స్వయంకృతమే!! అందులో తండ్రి ప్రమేయం ఏమీ లేదు.
ఆ విధంగా దేవుడు స్వచ్ఛమైన ప్రేమకు, త్యాగానికి, ప్రేమకు, నిస్వార్థానికి ప్రతిరూపమైన తల్లిదండ్రుల స్థానంలో తనను నిలబెట్టుకొని తన ప్రేమ మానవాళికి అర్థమయ్యే విధంగా పరమతండ్రిగా వివరించాడు. కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడే!! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! మనిషిని ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెలిగా, తమ్ముడిగా సృష్టించి ఆ బంధాల్లో ఇమిడ్చి పెట్టిన దేవుడు, ఆ బంధాల్లో అతను అనురాగభరితంగా జీవించాలని ఆశించిన దేవుడు అవే బంధాలను ఆధారం చేసుకొని తన ప్రేమను వ్యక్తీకరించడం అసమానం. కాని ఈనాడు వాస్తవానికి ఏం జరుగుతోంది? పెచ్చరిల్లిన వాణిజ్య సంస్థలు, పాశ్చాత్య పోకడలు కుటుంబ బంధాలను కూడా కలుషితం చేసి కకావికలం చేసి దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థనే బలహీనపర్చి కూలదోస్తున్నాయి.
విధేయతతో సంకెళ్లను, విచ్చలవిడితనంతో స్వేచ్ఛను ఈతరం చూడటమే అత్యంత ప్రధానమైన సమస్య. అంతా కళ్లు తెరవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ బంధాలకు అతీతంగా మనిషి బతకలేడు. ఆప్తుల చావు వల్లో, ఆప్తులతో సమస్యలతో ఒంటరితనంతో అలమటిస్తున్న వారిని దేవుడే సాకుతాడంటూ ఎప్పుడైనా భరోసా ఇచ్చారా? ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు అతనికి నేనున్నానులే అనుకోకుండా అతని సహజీవనానికి మరో మనిషిని అంటే హవ్వను సృష్టించాడని గుర్తుంచుకోండి.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్