ప్రతి తండ్రి కొడుకుకి నేర్పాల్సిన పది జీవిత సత్యాలు ఇవే - డోంట్ మిస్ | Ten Life Truths Every Father Should Teach His Son | Sakshi
Sakshi News home page

ప్రతి తండ్రి కొడుకుకి నేర్పాల్సిన పది జీవిత సత్యాలు ఇవే - డోంట్ మిస్

May 20 2023 9:25 PM | Updated on May 20 2023 9:39 PM

Ten Life Truths Every Father Should Teach His Son - Sakshi

సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి బాగుండాలి, ప్రతి వ్యక్తి బాగున్నప్పుడే పరిశుద్ధమైన సమాజం ఏర్పడుతుంది. ఇది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. మన నుంచే పుట్టుకురావాలి. ఒక గురువు తన శిష్యులకు ఎలాగైతే బోధించి సక్రమమైన మార్గంలో ప్రయాణించేలా చేస్తాడో.. ఒక తండ్రి కూడా తన కొడుకుని భావి తరాలకు ఆదర్శనీయుణ్ణి చేయాలి. ఆలా చేయాలనంటే తప్పకుండా 10 జీవిత పాఠాలను బోధించాలి.

★ నువ్వు ఏదైతే కోరుకుంటావో, అది నువ్వు పొందటానైకి అర్హుడివి కావాలి. అప్పుడే అది నీ చెంత ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక మంచి స్నేహితుణ్ని పొందాలంటే ముందు నువ్వు మంచి స్నేహితునిగా మారాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఏదైతే ఇతరుల నుంచి కోరుకుంటావో అది ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అది ధనమైన, గౌరవమైన ఇంకేమైనా..

★ ప్రతి రోజు నువ్వు పట్టువదలని విక్రమార్కుడివై శ్రమించు, కొన్ని రోజులు ఏమి జరగకపోవచ్చు, ఏ మార్పు రాకుండా పోవచ్చు. చివరికి అనుకున్నది సాధిస్తావు. ఆ విజయాన్ని కొందరు అదృష్టం అని పిలుస్తారు. కానీ ఆ అదృష్టం నీ విజయ రహస్యమే అని మర్చిపోవద్దు.

★ ప్రాధమిక అంశాలపైన ద్రుష్టి పెట్టాలి. రోజుకి 10 పుస్తకాలను చదవడం కంటే, ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి, అందులోని సారాంశాన్ని గ్రహించడానికి 10 సార్లు చదువు. అనుభవశూన్యుడు ప్రయత్నించిన దాని కంటే ఎక్కువ సార్లు విఫలమైనవాడే ప్రతిభావంతుడవుతాడు. అలాంటి విఫలం నుంచే సక్సెస్ పుట్టుకొస్తుంది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వంద సార్లు ప్రయత్నించు వెనుకడుగు వేయకు మరో 'థామస్ అల్వా ఎడిసన్' అయ్యేలా ప్రయత్నించు.

★ నువ్వు బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో. కానీ జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారం ప్రారంభించు. ఉద్యోగం నిన్ను మాత్రమే బతికిస్తుంది. వ్యాపారం (బిజినెస్) పది మందికి ఉద్యోగాలివ్వడానికి పనికొస్తుంది, వారిని బ్రతికిస్తుంది.

★ ఆరోగ్యం మహాభాగ్యం అన్నది లోకోక్తి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనుకున్నది సాధించగలవు. కాబట్టి ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టిపెట్టాలి. 

★ సమాజంలో ఉన్నతంగా బ్రతికేది బలమైనవారో, తెలివైనవారో కాదు. మారుతున్న సమాజాన్ని అనుసరిస్తూ తనను తాను మార్చుకోగలిగిన వాడు, ధర్మ మార్గంలో నడిచేవాడు. 

★ స్నేహితులను ఎన్నుకునే విషయంలో తెలివిగా ఉండాలి. ఐదు మంది మిలియనీర్‌లతో గడుపు, కానీ నువ్వు 6వ స్థానంలో ఉండు. కొంత మంది వ్యక్తుల సమూహమే ప్రపంచాన్ని మారుస్తుంది. ఎప్పుడూ మీ స్నేహితుల సమూహాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.

★ ఏ పరిస్థితుల్లో అయినా దృఢంగా ఉండటం నేర్చుకోవాలి. దశరధుడు రాముని పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో.. అడవులకు వెళ్ళమన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అలాంటి దృఢ చిత్తం నీకుండాలి. నీకు ఏమి కావాలో నువ్వే తెలుసుకో.. నీకంటూ ఒక ప్రణాళిక లేకుంటే వేరే వాళ్ళ ప్రణాళిక ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఉన్నది ఒకటే జీవితం నిన్ను నువ్వు తెలుసుకో.

★ జీవితంలో పిరికివాళ్ళు ఏదీ ప్రారభించలేరు, బలహీనుడు దారిలోనే నిలిచిపోతాడు. 'ధైర్య వంతుడు ఒకసారి మాత్రమే మరణిస్తాడు, పిరికివాడు ప్రతి రోజూ మరణిస్తూనే ఉంటాడు' అన్న అల్లూరి సీతారామరాజు మాటలు నిత్యం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎదిగిన ఎంతో మంది మహానుభావుల చరిత్రలను అధ్యయనం చేయాలి. రేపటి చరిత్రకు నువ్వు మార్గదర్శివి కావలి.

★ బలమున్న వాడి కోసం కాకుండా బలహీనుడి కోసం నిలబడాలి, మీ సరిహద్దులను రూపుమాపడానికి ప్రయత్నించే వారు ఎంతవారైనా వారికి వ్యతిరేఖంగా పోరాడాలి. ప్రత్యర్థులకు నువ్వంటే భయమున్నప్పుడు వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు.

నిజానికి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు పుత్రుడంటారు.. కానీ జీవితంలో ఏ తండ్రి అయితే ఈ సత్యాలను బోధించి ఉన్నతుణ్ణి చేస్తారో ఆ తండ్రికే కాదు సమాజమే స్వర్గధామం అవుతుంది. అందుకే 'అపుత్రస్య గతిర్నాస్తి' అన్నది ఒకప్పటి మాట, కానీ నేను అంటున్నాను 'సుపుత్రస్య గతిర్నాస్తి'.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement