విశ్వాసానికి సాక్ష్యం
దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నిరూపించే గొప్ప ఆపేక్షాపూరిత సాక్ష్యమే... క్రిస్మస్.
ఇనాక్ ఎర్రా
మనలో చాలామంది దేవుడున్నాడని విశ్వసిస్తారు. ఆయన ఉన్నాడని నమ్ముతాం. కాని ఎక్కడ, ఏ విధంగా అని మనం ఎరుగము. ఆయనను చూడగలిగినట్లయితే, తాక గలిగి ఉన్నట్లయితే ఎంత బాగుండును! ఆయనతో మాట్లాడి మనకున్న ప్రశ్నలను అడిగినట్లయితే ఎంత బాగుండును! అసలు ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎలాంటివాడు? భూలోకంలోని కీడును ఎందుకు నిర్మూలం చేయడం లేదు? ఎందుకు మాట్లాడడు? ఎందుకు కనిపించడు? సార్వత్రికంగా మనందరి వాంఛ ఇదే- మనం విశ్వసించిన దేవుని చూడాలని, తాకాలని.
విశ్వాసం అంటే కనిపించనిది నమ్మటం. కాని అలా నమ్మటానికి ఏదైనా ఆధారం ఉండాలి. లేనట్లయితే అది మూఢనమ్మకం లేక ఊహగా ఉంటుంది. అటువంటి విశ్వాసం గుడ్డి విశ్వాసం అంటారు. చాలామంది విశ్వాసానికి ఆధారాలు అవసరం లేదు అనుకుంటారు. కాని మనం జీవించడానికి ఆధారాలు లేనట్లయితే జీవించడం కష్టం.
క్మ్రిస్మస్, దేవుడున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విశ్వాసానికి నిశ్చయతను ఇస్తుంది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం దేవుడు మనపట్ల ప్రేమను బట్టి వ్యక్తిగతంగా ఆ మొదటి క్మ్రిసస్ దినాన మనలను దర్శించాడు. ఇందుచేత క్రిస్మస్ దినాన సంబరాలు చేసుకుంటున్నాము. దేవుడు మానవుడుగా ఒక కన్యకకు, బెత్లెహేము అను గ్రామంలో ఆ దినాన జన్మించాడు. దేవుడు శరీరధారిగా ఏసుక్రీస్తుగా రావటం మన విశ్వాసానికి దృఢనిశ్చయతను ఇస్తుంది. ఆయనను చూచిన వారు ఆయనలో జీవించిన వారు ఆయనను గూర్చి వ్రాశారు.
దేవుడున్నాడు. ఆయన భూలోకానికి మానవుడుగా వచ్చాడు. మనపట్ల ఆయన ప్రేమ వాస్తవం. ఆయనయే యేసుక్రీస్తు. ఈ క్మ్రిసస్ దినం మీరు దేవుని ప్రేమతో నింపబడి, ఆయనను అనుభవించిన దినంగా ఉందునుగాక!