యేసు ప్రభువు ఈ లోకాన్ని విడిచిన తరువాత శిష్యులందరినీ ప్రభువు సమదృష్టితోనే చూశాడు. అయితే పేతురు. యోహానులను ఎక్కువగా ప్రేమించాడు. వారు కూడా ప్రభువుపై అచంచల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచారు. యేసుక్రీస్తు నామంతో అద్భుతాలను చేశారు. ప్రుభువుపై ఉన్న నమ్మకమే వారిని ఆ విధంగా ప్రేరేపించింది. అంతేకాని వారు తమ శక్తి చేత ఏమీ చేయలేదు. ప్రభువు నామంలో అద్భుతం ఉందని తెలిసి కూడా ఎక్కడా వారు వృథాగా యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించలేదు. అత్యవసర పరిస్థితులలో ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు, బాధ కలిగిన ప్పుడు వారు యేసు నామాన్ని విశ్వాసంతో, నమ్మకంతో పలికేవారు. అటువంటి ఉదంతం బైబిలులో ఉంది.
ఒకరోజు దేవాలయంలోనికి పేతురు, యోహాను వెళుతుండగా పుట్టుకతోనే అవిటివాడైన ఒక వ్యక్తిని కొంతమంది మోసుకు వచ్చి అక్కడ దేవాలయపు మెట్లపై కూర్చోబెట్టేవారు. ఆ కుంటివాడు వచ్చి పోయే వాళ్లను చూసి ‘‘ధర్మం చేయండి బాబూ’’ అని అడిగేవాడు. సరిగ్గా అదే సమయానికి పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తుండగా వారి చూపు ఆ కుంటివాడి మీద పడింది. తదేకంగా వారు ఆ కుంటివాణ్ణి చూశారు. కుంటి వాడు కూడా వాళ్లు ఏమైనా ఇస్తారేమోనని ఆశగా, ఆబగా వాళ్లవైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు, యోహానులు ఆ కుంటివాణ్ణి చూసి ‘‘వెండి, బంగారు మా దగ్గర లేవు. మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాము’’అన్నారు. ఆ మాటకు వాడి కళ్లు విశాలమయ్యాయి.
ఏదో పెద్ద బహుమతి (కానుక) ఇస్తారులే అనుకున్నాడు. పేతురు, యోహాను ఇద్దరూ ఒకేసారి ‘‘నజరేయుడైన యేసుక్రీస్తు నామంతో చెబుతున్నాము. నీవు పైకి లేచి నడుస్తావు’’అని వాడి చేతులు పట్టుకుని విశ్వాసంతో, నమ్మకంతో ప్రకటించారు. ఆశ్చర్యం! ఆ మాటకు వాడి కాళ్ల చీలమండలలో బలమునొంది దిగ్గున లేచాడు. పరుగున దేవాలయంలోనికి వెళ్లి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించసాగాడు. నమ్మకం, విశ్వాసం దైవంపై ఉంటే ఏదైనా సాధించవచ్చనేదానికి ఈ ఉదాహరణ చాలు. (అపొ.కాం. 3:1–8) – కనుమ ఎల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment