కరుణామూర్తులు కండి : పోప్
వాటికన్ సిటీ/న్యూఢిల్లీ: శాంతి దూత ఏసుక్రీస్తు జన్మదినం ‘క్రిస్మస్’ సందర్భంగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. పోప్ ఫ్రాన్సిస్ వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దైవ సందేశమిచ్చారు. సమాజంలో హింస ప్రజ్వరిల్లిన ప్రస్తుత తరుణంలో దయతో మెలగాలని, కరుణామయులు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు పిలుపునిచ్చారు.
సుమారు ఐదువేల మంది హాజరైన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో మొట్టమొదటిసారిగా త్రీడీ విధానంలో ప్రసారమైంది. మరోవైపు క్రీస్తు జన్మస్థలం బెత్లెహాంలో పర్వదినం సందర్భంగా భారీ ఏర్పాట్లు జరిగాయి.
క్రీస్తు జన్మించిన చోటుగా భావిస్తున్న నేటివిటీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కాగా, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల్లో సంప్రదాయ బద్ధంగా జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.