విశ్రాంత జీవితానికి కొత్త అర్థాన్ని చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓరుగల్లు వాసి వడ్డేపల్లి గోపాల్. చేతి రాతతో తెలుగులో బైబిల్ రాసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇత్తడి రేకులపై చేతితో బైబిల్‌ను తెలుగులో రాస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రచయితగా, గాయకుడిగా, శిల్పిగా, చిత్రకారుడిగా కూడా రాణిస్తున్నారు. వరంగల్‌లోని రంగంపేటకు చెందిన వడ్డేపల్లి కనకయ్య–పార్వతమ్మ దంపతుల కుమారుడు గోపాల్ 1948లో జన్మించారు. రంగంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకు న్నారు. 1982లో వరంగల్ కేఎంసీలో అటెండర్‌గా చేరారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లా మహాముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా 2006లో ఉద్యోగ విరమణ పొందారు. క్రైస్తవుడైన గోపాల్ బైబిల్‌ను పలుసార్లు పఠనం చేయడం ప్రారంభించారు. దీంతో చేతితో బైబిల్‌ను రాయాలనే సంకల్పించారు.
18 నెలలు..1,029 పేజీలు..
1,029 పేజీల బైబిల్‌ను పలుమార్లు చదివిన తర్వాత చేతితో రాయాలని నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్‌ను చిరిగిపోకుండా తీసుకుని.. చదివే వీలుగా బట్టర్ పేపర్‌ను మధ్యలో ఏర్పాటుచేశారు. సుమారు 20 కిలోల బరువుతో 1,029 పేజీల పుస్తకాన్ని ప్రత్యేకంగా బైండింగ్ చేయించారు. 2011 జనవరిలో బాల్‌పాయింట్ పెన్నుతో రాయడం ప్రారంభించి.. 2012 జూన్ 13న బైబిల్‌ను పూర్తి చేశారు. యేసు క్రీస్తు మాటలు ఎరుపు రంగు, కీర్తనలు ఆకుపచ్చ రంగు, ప్రకటన గ్రంథం నీలి రంగు, రాజుల మొదటి గ్రంథం నలుపు రంగు, దిన వృత్తాంతం వయిలెట్, హీజ్‌కీయా గ్రంథం ముదురు నీలి రంగులో అందించారు. గోపాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో 626 పాటలు, 26 మంది రచయితలను పరిచయం చేశారు.
ఇత్తడి రేకులపై బైబిల్..
ఎగ్జిక్యూటివ్ పేపర్‌తో రూపొందించిన బైబిల్ కాలగమ నంలో పాడైపోతుందని భావించిన గోపాల్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నీళ్లు, నిప్పులో పడినా పాడైపోకుండా ఉండేందుకు ఇత్తడి రేకులపై బైబిల్ రాయాలని నిర్ణయించారు. 2017 జూన్ నుంచి ఇత్తడి రేకులపై బాల్‌పాయింట్ పెన్నుతో బైబిల్‌ను రాస్తున్నారు.
గోపాల్ రాసిన గ్రంథాలు..
గోపాల్ సంఖ్యల ప్రాధాన్యత అనే పుస్తకాన్ని 2010లో రచించారు. యేసేబు కన్నకలలు ఇతి వృత్తంతో 2014 లో కలవరం అనే పుస్తకానికి నాంది పలికారు. 2015లో నయమాను కుష్టు రోగి, 2016లో ప్రార్థన మరియు కృప అంశాలు అనే పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం ఆత్మ అనే పుస్తకాన్ని రాస్తున్నారు.
– కాజీపేట అర్బన్
భవిష్యత్ తరాల కోసం..
భవిష్యత్ తరాల కోసం ఇత్తడి రేకులపై బైబిల్‌ను రాస్తున్నా. చేతితో బైబిల్‌ను రాయడం దైవ సంకల్పం. చేతితో రాసిన బైబిల్‌ను వీక్షించేందుకు వరంగల్‌లోని రంగంపేటను సందర్శించవచ్చు, వివరాలకు 9491065030లో సంప్రదించవచ్చు.
– గోపాల్, చేతిరాత బైబిల్ సృష్టికర్త
Comments
Please login to add a commentAdd a comment