దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నిగో అనే నలుగురు యూదు యువకుల విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ, వాళ్ళు ‘సింహాల నోళ్లు మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు... బలహీనులైనా బలపర్చబడ్డారు’ అని బైబిల్ పేర్కొంది (హెబ్రీ 11:33.34). విశ్వాసం బలహీనుల్ని కూడా మహా బలులను చేస్తుంది. దానియేలు యుక్తవయసులో యెరూషలేము నుండి బబులోను చెరకు బానిసగా వచ్చాడు. కానీ బబులోను చక్రవర్తి దర్యావేషు అతని విశేష ప్రతిభను గుర్తించి, అక్కడి 120 మంది ఉన్నతాధికారులపైన నియమించబడిన ముగ్గురు అత్యున్నతాధికారుల్లో ముఖ్యుడుగా అంటే ప్రధానమంత్రిగా దానియేలును నియమించాడు (దాని6:1,2). ఒక యూదు బానిసకు అన్యదేశంలో దేవుడిచ్చిన అరుదైన ఆధిక్యత, గుర్తింపు ఇది.
అయితే దానియేలును ఓర్వలేకపోయిన ఆ 122 మంది అధికారులు కుట్రతో ముప్పై రోజుల పాటు దేశంలో రాజును తప్ప మరెవరినీ ఆశ్రయించకూడదన్న శాసనాన్ని తెచ్చారు. దానియేలు మాత్రం తన గది కిటికీలు తెరిచి మరీ ఆ ముప్పై రోజులూ తన దేవునికి ప్రార్థించగా, అధికారుల వత్తిడి మేరకు చక్రవర్తి ఆకలితో నకనకలాడుతున్న సింహాలున్న గుహలో అతన్ని వెయ్యగా, దేవుడు అద్భుతంగా సింహాల నోళ్లు మూసివేసి అతన్ని సజీవంగా కాపాడాడు. పిదప కుట్రదారులైన అధికారులనందరినీ చక్రవర్తి అదే గుహలో వేయగా సింహాలు వారిని తినేశాయి. దానియేలు బబులోను చక్రవర్తికి విధేయుడే.
కాని అతని అత్యున్నతమైన, అంతిమమైన విధేయత మాత్రం చక్రవర్తికి పైగా ఉన్న దేవునికే!! విశ్వాసాన్ని ప్రసంగాల్లో, మాటల్లో, సిద్ధాంతాల్లో ఒలకబోస్తే ప్రయోజనం లేదు. క్రైస్తవం మాటల్లో కాదు, చేతల్లో, ఆచరణలో రుజువయ్యే విశ్వాస పథం. పాత నిబంధనలోని 39 పుస్తకాల్లోనూ దైవజనులు ఎన్నెన్నో గొప్ప విశ్వాసకార్యాలు చేశారు. కాని మొత్తం పాతనిబంధనలో ‘విశ్వాసం’ అనే మాట కేవలం రెండే రెండు సార్లు వాడారు. కాని వారి మహాకార్యాలను వివరించే హెబ్రీ 11 వ అధ్యాయంలోనే, ‘విశ్వాసం’ అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు 40 వచనాల్లో 24 సార్లకు పైగా వాడాడు.
విశ్వాసమనే మాటే వాడకుండా, అంతటి మహా విశ్వాసాన్ని ఆచరణలో చూపిన పాత నిబంధన కాలపు విశ్వాస వీరుల ముందు, పొద్దున్నుండి సాయంత్రం దాకా విశ్వాసం పైనే ప్రసంగాలు చేస్తూ, విశ్వాసులమని పిలిపించుకొంటూ, విశ్వాసాన్ని ఆచరణలో మాత్రం అణువంతైనా చూపలేని నేతి బీరకాయల్లాంటి మనమెక్కడ నిలుస్తాం?? సింహాల గుహలో పడ్డాక దానియేలును రక్షించే బదులు, అసలు సింహాల గుహలో పడకుండా దేవుడతణ్ణి రక్షించలేడా? అని ప్రశ్నించొచ్చు. తప్పకుండా రక్షించగలడు, కాని సీసాలోని మాత్ర శరీరంలోకి వెళ్లి రుగ్మతను పారదోలితేనే కదా దానికి విలువ? ఆచరణలో రుజువు కాని విశ్వాసానికి ఆవగింజంత కూడా విలువ లేదు.
విశ్వాసాన్ని ఆచరణలో చూపలేని పిరికివాళ్ళకు, వాళ్ళెంతటివారైనా, పరలోకంలోకి ప్రవేశం లేదు.క్రీస్తు ఆచరించి బోధించిన విశ్వాసం, ప్రబోధాలు, నీతిమాటలు, సూక్తులకు అతీతమైనది. అంతటి మహత్తరమైన విశ్వాసానికి డబ్బు రూపాన్ని, లోక సంబంధమైన ఆస్తులు, విలాసాల రూపాన్నివ్వడం భ్రష్టత్వం!! సమాజంలో ఎంత ఉన్నతస్థాయి ఉంటే, ఎంత డబ్బుంటే వాళ్ళు అంత గొప్ప పరిచారకులు, విశ్వాసులనడం దౌర్భాగ్యపు వక్రీకరణ, అది కేవలం అవకాశవాదం, ఆత్మీయావగాహనా లోపం. చైనా దేశాన్నంతా సువార్తమయం చేసిన హడ్సన్ టేలర్ ఒకానొక సమయంలో పస్తులుంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ‘నా జేబులో 25 పైసలే ఉన్నాయి, కాని నా గుండెలో మాత్రం దేవుడిచ్చిన బోలెడు వాగ్దానాలున్నాయి’ అంటూ భార్యకు రాసిన ఉత్తరం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉంది.
ఆ విశ్వాసంతోనే చైనాలో టేలర్ చేసిన మహా కార్యాలు దేవుని జీవగ్రంథంలో శాశ్వతంగా లిఖించబడి ఉన్నాయి. నా వద్ద 25 పైసలే ఉన్నాయంటూ ప్రకటించిన హడ్సన్ టేలర్ కోట్లలో తేలియాడుతున్న ఈనాటి మెగా సేవకులు, సెలెబ్రిటీ ప్రబోధకులతో పోల్చితే నిరుపేదవాడే!! అయితే కేవలం విశ్వాసంతో దేవుని వాగ్దానాలు నమ్మి చైనా నిండా సువార్తను నింపిన హడ్సన్ ముందు ఈ పరిచారకులు, ప్రబోధకులవి కుప్పిగంతులే, చిరిగిన మురికి వస్త్రాలే!!!
– రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్
సంపాదకులు: ఆకాశధాన్యం
email:prabhukirant@gmail.com
Comments
Please login to add a commentAdd a comment