సువార్తతో శుభాశీస్సులు
Published Wed, Jan 29 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
పెదకాకాని, న్యూస్‌లైన్ :ఆత్మీయ అలంకారంతోనే ప్రతిఒక్కరూ పరలోకరాజ్యంలోకి ప్రవేశిస్తారని బైబిల్‌మిషన్ మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్ పేర్కొన్నారు. మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 76వ బైబిల్ మిషన్ మహాసభలు రెండవరోజు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శామ్యూల్ కిరణ్ వాక్యోపదేశం చేస్తూ దైవత్వం విడిచి ఏసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఉదయించారన్నారు. సకల జనులకు క్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం అందించేందుకే ఏసు శిలువ యాగం భరించారన్నారు. లోకరక్షకుడైన ఏసు మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. ఏసుప్రభువు సువార్తను బైబిల్‌మిషన్ అనే పల్లకీలో మోయడం ద్వారా లోకమంతటికీ శుభవార్త అందినట్లేనన్నారు. సుమారు వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రపంచ శాంతికోసం భక్తులు ప్రార్థనలు చేశారు.
ప్రత్యేక ప్రార్థనలు..
బైబిల్‌మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ ఎన్.సత్యానందం, సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.ఏసురత్నం, రెవరెండ్ సీహెచ్ దేవదాసు, రెవరెండ్ డాక్టర్ ఎన్.షారోనుకుమార్‌లు వాక్యోపదేశం చేశారు. స్త్రీల సభల కన్వీనర్ జె.ప్రమీలాసెల్వరాజ్ బృందం స్తుతిగీతాలను ఆలపించారు. మహోత్సవాలకు హాజరైన భక్తులకు ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు. వాలంటీర్లు బోజన పదార్థాల తయారు, వడ్డనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్టీసీ, రైల్వేశాఖల అధికారులు సభల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
నేటితో ముగియనున్న మహోత్సవాలు..
బైబిల్ మిషన్ మహోత్సవాలు బుధవారంతో ముగుస్తాయని కన్వీనర్ రెవరెండ్ జె.శ్యామ్యూల్ కిరణ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని ఆయన వివరించారు.
పాల్గొన్న ప్రముఖులు..
సాక్షి, గుంటూరు: బైబిలు మిషన్ మహాసభల్లో మంగళవారం కేంద్రమంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవజనులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అదేవిధంగా నర్సరావుపేట ఎంపీ మోదుగల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మేల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, రిజిస్ట్రార్ బాలస్వామిలు కూడా పాల్గొని ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు.
Advertisement
Advertisement