
విశ్వాసమే రక్షిస్తుంది
- అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్‌కుమార్
గుడివాడ : ఏసుక్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని, ఆయనపట్ల విశ్వాసమే మానవులను సర్వదా రక్షిస్తుందని ప్రపంచ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ స్పష్టంచేశారు. బుధవారం స్థానిక పెదఎరుకపాడులో పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి నూతనంగా నిర్మించిన న్యూలైఫ్ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన సభలో సువార్త ఉపన్యాసం చేశారు.
వేల సంఖ్యలో హాజరైన క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి మాట్లాడుతూ మానవులు చేసిన పాపాలకు ఆయన మూల్యం చెల్లించాడని అందుకే క్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని అన్నారు. క్రీస్తు మహిమలు ద్వారా గుడివాడ పట్టణం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ప్రార్థనలు చేశారు. ప్రపంచ సువార్తికుడుగా దేవుడు తనకి ప్రసాదించిన శక్తితో తాను ఈ మాటలు చెప్పగలుగుతున్నానని అన్నారు. ప్రభువునందు విశ్వాసం,కృప వల్ల ప్రతి ఒక్కరూ రక్షించబడతారని చెప్పారు.
పాటలతో ఉర్రూతలూరించిన అనిల్‌కుమార్...
బ్రదర్ అనిల్‌కుమార్ నూతనంగా రూపకల్పన చేసిన పాటల సీడీలోని కొత్తపాటలు పాడి కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఉర్రూతలూగించారు. ‘నిబ్బరంకలిగి ధైర్యంగా ఉండు..’ అంటూ పాడిన పాట అందరిలో ఉత్సాహాన్ని నింపింది. బ్రదర్ అనిల్‌కుమార్ సందేశాన్ని ప్రముఖ సువార్తికుడు సజ్జా బర్నబాస్ తెలుగులోకి అనువదించారు. న్యూలైఫ్ ప్రార్ధనా మందిరం పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి, బిల్లిపల్లి ఇజ్రాయోల్‌రెడ్డి పాల్గొనగా అనీల్ వరల్డ్ ఇవాంజలిజం(ఎడబ్ల్యూఈ) రాష్ట్ర కోఆర్డినేటర్ శామ్యూల్ తొలుత అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, పాస్టర్లు అప్పికట్ల జాషువా, క్రీస్తురాయబారి, సజ్జా బర్నబాస్, టిజె దాస్, భాస్కరరావు, కరుణాసాగర్, జడా జానన్న, నేలపాటి శామ్యూల్ పాల్గొన్నారు.
ప్రేయర్ పాస్టర్ ఫెలోషిప్ ఘనసన్మానం...
బ్రదర్ అనిల్‌కుమార్‌ను గుడివాడ డివిజన్ ప్రేయర్ పాస్టర్స్‌ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫెలోషిప్ గుడివాడ డివిజన్ అధ్యక్షులు జి.శ్యాంబాబు, సునీల్‌రెడ్డి, బి.మోషే, డివివి.ప్రసాద్, సంఘ కాపరులు ఆమెన్, పరిశుద్ధ భూషణం, సునీల్, ఎలీషా పాల్గొన్నారు.