సాత్వీకులు ధన్యులు
యేసు చెప్పిన మూడవ ధన్యత ‘‘సాత్వీకులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు’’ (మత్తయి 5:5).
భూలోకాన్ని స్వతంత్రించుకొనకపోయినా, ఎంతో కొంత స్వతంత్రించుకోవాలని లేక సంపాదించుకోవాలని అనేకులు ప్రయత్నిస్తారు. కాని, సాత్వీకంతో సంపాదించుకోవడం అనేది ఆధునిక మానవుని ప్రవర్తనకు ఎంతో వ్యతిరేకంగా కనిపిస్తుంది. చరిత్రలో ఎంతోమంది సైనికబలం, డబ్బు బలం మరియు రాజకీయ కుయుక్తుల చేత ఎంతో కొంత సంపాదించుకోవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం కూడ ఎంతోమంది అదే ప్రయత్నాలలో తమ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందరో క్రైస్తవులు కూడ ఈ పద్ధతులనే అవలంబిస్తున్నారు. ఇది ఎంతో విషాదకరం.
సాత్వీకం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం గ్రీకు భాషలో ఇది ఒక చిత్రంతో కూడిన పదం. అంటే, ఎంత జ్ఞానులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత అధికారం, సౌందర్యం, ప్రఖ్యాతులు కలిగినవారైనా, దేవుని ముందు తమ అయోగ్యతను గుర్తించి, ఆయన యెదుట సాధువైన వ్యక్తులుగా ఉండటం.ఇట్టివారు మొదటగా, దేవుని అధికారానికి తమకు తాము సంపూర్ణంగా లోబడతారు. దీనులై, దేవుని సన్నిధిలో జీవిస్తారు. తమ ఆశయాలు, కోరికలు, భవిష్యత్తు, వారి సమస్తం ఆయన చేతుల్లో పెట్టి, ఆయన వారి జీవితాల్లో ఏమి చేసినా దానికి విధేయత చూపిస్తారు.
వీరి ప్రార్థన ‘‘అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను’’ అని దేవుని అధికారాన్ని వారి జీవితాల్లో అంగీకరిస్తారు (మత్తయి 11:26). వీరు దేవుని వాక్యమును చదివి, దానికి సంపూర్ణంగా లోబడుతారు. ఆయన చెప్పిన మాటకు భయముతోనూ, వణుకుతోనూ లోబడతారు. ‘‘ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై, నా మాట విని వణకుచుండునో వానినే నేను చూచుచున్నాను’’ అని యెహోవా సెలవిస్తున్నాడు (యెషయా 66:2).
ఈ సాత్వీకులు తమను తాము దేవునికి లోబరచుకున్నవారు కాబట్టి, మనుష్యుల మెప్పుకొరకు గాని, వారి గుర్తింపు కొరకు గాని ఎదురు చూడరు. వీరు దేవుని నుండి పొందే మెప్పు కొరకే ఎదురు చూస్తారు. దాని చేత తృప్తి కలిగి ఉంటారు. కాబట్టి, ఎవరికీ భయపడరు. ఎవరినీ నొప్పించరు, నొప్పింపబడరు. వీరు తమను తాము హెచ్చుగా ఎంచుకొనరు కాబట్టి, అవమానం చెందరు. వీరు ఎవరినీ కూడ తమ కంటె చిన్నవారిగా పరిగణించరు.
కాబట్టి, వీరి కంటే చిన్నవారి దగ్గర నుండి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు తమ బలహీనతలను ఎరిగినవారు కనుక తమ తప్పులను సులువుగా అంగీకరిస్తారు. తమ దీనత్వాన్ని ఎరిగినవారై దేవుని సన్నిధిలో విరిగి, నలిగిన హృదయం కలిగి జీవిస్తారు. అయితే ఈ విధంగా జీవించడం మానవులకు సాధ్యం కాదు కనక యేసు ప్రభువు ఇలా అంటున్నాడు...
‘‘నా యొద్దకు రండి... నేను సాత్వీకుడను, దీనమనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.’’ ఇది యేసుక్రీస్తు మార్గం. లోక పద్ధతులకు, దాని జ్ఞానానికి ఎంతో భిన్నమైన మార్గం.
సాత్వీకులు దేవుని స్వాధీనంలో ఉన్నవారు కాబట్టి, దేవుడు తన అధికారాన్ని వారి చేతుల్లో పెడతాడు. వారి పెద్దతనం, గొప్పతనం చూపించుకోవడం వలన కాదు గాని, సాత్వీకం వలన లోకాన్ని సంపాదించుకుంటారు.ఇది దేవుని రాజ్యవారసుల మూడవ లక్షణం.
- ఇనాక్ ఎర్రా