ఏదైనా భవనాన్ని గానీ మందిరాన్ని గానీ నిర్మాణం చేసేముందు ఒక ప్రణాళిక (ప్లాన్) వుంటుంది. ఆ నిర్మాణానికి కొంతమంది వ్యక్తులు కావాలి. నిపుణత కలిగిన వ్యక్తులు, పనివారు కష్టపడటం వల్లనే నిర్మాణాలు జరుగుతాయి. అలాగే మానవజాతి రక్షణార్థం దేవుడికి ఒక ప్రణాళిక వుంది. ఆ ప్రణాళికను అమలుపరచటానికి కొందరు వ్యక్తుల అవసరం వుంటుంది, కావాలి. అట్టివారు అవమానాలను శ్రమను భరించేవారుగా విధేయత కలిగినవారై వుండాలి. ఆ ప్రణాళికలో కొంతమంది విధేయత కలిగిన వ్యక్తులను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. వారే ప్రభువైన యేసు తల్లియైన మరియ ఆమె భర్త అయిన యేసేపు, తూర్పు దేశపు జ్ఞానులు. వారు దేవుని మాటకు విధేయత చూపటమే ‘క్రిస్మస్’. వారిని గూర్చి, వారి విధేయతను గూర్చి ఈ కింద తెలుసుకుందాం.
ప్రభువైన యేసు తల్లి గలిలయలోని నజరేతను ఊరికి చెందినవారు. మరియ కన్యకగా వున్నప్పుడు అదే ఊరికి చెందిన యోసేపను పురుషునితో ప్రదానం చేయబడింది. కానీ యూదు మత ఆచారం ప్రకారం ప్రదానమైన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వివాహం జరుగుతుంది. ఇది కన్యత్వానికి పరీక్షాకాలం. ఆ సంవత్సర కాలంలో కన్యత్వంలో జరగరానిది జరిగింది. అంటే ఆ మధ్యకాలంలో ఆమె కన్యత్వం గర్భం ధరించింది. ఏలయనగా ఆమె ఇంటిలో వుండగా దేవదూత దేవునిచేత పంపబడి ఆమెను చూసి ‘‘దయాప్రాప్తురాలా! నీకు శుభము. నీకు ప్రభువు తోడై వున్నాడు.
దేవుని వలన కృప పొందావు. భయపడకుము. ఇదిగో నీవు గర్భం ధరించుదువు. ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన సర్వోన్నతుని కుమారుడు’’ అని చెప్పాడు. అప్పుడామె ఆ మాటలకు భయపడి–నేను పురుషుని ఎరుగని దాననే, అదెలాగు జరుగునని దూతతో అనగా దూత ‘పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును’ అనగా అందుకు మరియ ‘ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక’ అన్నది, ఆమె దేవుని మాటకు విధేయత చూపినది. అందుచేత క్రిస్మస్‌కు ప్రధానం విధేయత (లూకా 1: 26–38).మరియ భర్త అయిన యేసేపు నీతిమంతుడైనందున ఆ విషయం బహిర్గతం చేయక రహస్యంగా ఆమెను అతడు విడనాడదలచాడు.
కానీ ఆ విషయాన్ని గూర్చి అతడు ఆలోచిస్తుండగా మరలా ప్రభువు దూత కలలో అతనికి కూడా ప్రత్యక్షమై ‘యేసేపూ! నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు సందేహింపకుము, ఆమె గర్భం పరిశుద్ధాత్మ మహిమ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. అతను తన ప్రజలను వారి పాపాలనుండి విమోచించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని దేవదూత చెప్పిన మాట ప్రకారం యేసేపు కూడా దేవుని మాటకు విధేయత చూపాడు. యేసేపుకు ఈ విషయంలో అనేకసార్లు దేవదూత ప్రత్యక్షపడ్డాడు. ఆ విధేయతే క్రిస్మస్ కారణం. (మత్తయి 1:18–25).
తూర్పుదేశపు జ్ఞానులు యెరుషలేముకు వచ్చి వారు ఆ నక్షత్రం కాలం తెలుసుకుని, ఆ నక్షత్రం ఆ శిశువు ఉండే చోటికి వచ్చినప్పుడు ఆ శిశువుకు సాగిలపడి, పూజించి, పెట్టెలు విప్పి అందులోని బంగారాన్ని సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించి, దేవదూత ఆజ్ఞానుసారం హేరోదు రాజుకు ఈ విషయం తెలుపక వేరే మార్గమున వారు వారి దేశానికి వెళ్ళారు. ఆ విధంగా వారు కూడా దేవుని మాటకు విధేయత చూపారు. (లూకా 1:18,1–15).
– కోట బిపిన్ చంద్రపాల్
Comments
Please login to add a commentAdd a comment