క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతటా జరుగుతాయి. ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను దేశ దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో మాత్రం క్రిస్మస్ సందడి ముందుగానే మొదలవుతుంది. క్రిస్మస్ పండుగకు ముందుగా తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఒకరకంగా క్రిస్మస్ నవరాత్రులుగా చెప్పుకోవచ్చు.
‘లాస్ పొసాడాస్’ అనే ఈ వేడుకలు ఏటా డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి. ఏసుక్రీస్తు జననానికి ముందు ఆయన తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్‌లు నజరేత్ నుంచి బేత్లహామ్‌కు సాగించిన ప్రయాణం, పర్ణశాలలో క్రీస్తు జననం వంటి ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలను జరుపుకొంటారు.
మెక్సికో సహా పలు దక్షిణ అమెరికా దేశాల్లో ఈ సంప్రదాయం 1586 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. ఈ సందర్భంగా జనాలు రాత్రివేళల్లో కొవ్వొత్తులు చేతపట్టి ఊరేగింపులు జరుపుతారు. చర్చిల్లో సామూహిక ప్రార్థనలను నిర్వహిస్తారు. కొందరు పిల్లలు, పెద్దలు వేషాలు కట్టి మేరీ, జోసెఫ్‌ల ప్రయాణం, క్రీస్తు జననం ఘట్టాలను అభినయిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ కొన్ని వేడుకలు పురాతన ‘అజ్‌టెక్’ సంప్రదాయాల ప్రకారం కూడా జరుగుతాయి.
‘అజ్‌టెక్’ పురాణాల ప్రకారం దేవతల తల్లి అయిన టోంజాంట్జిన్‌కు శీతకాల ఆయానాంత దినమైన డిసెంబర్ 22న హుయిట్జిలోపోష్‌ట్లి (సూర్య భగవనాడు) పుట్టాడని దక్షిణ అమెరికాలో అజ్‌టెక్ సంప్రదాయాలను అనుసరించే వారు నమ్ముతారు. ‘లాస్ పొసాడాస్’ వేడుకల్లో భాగంగా వీరు సూర్య జయంతి వేడుకలను కూడా జరుపుకొంటారు. క్రీస్తు జననాన్ని పండుగలా జరుపుకోవడానికి ఆయన జన్మించిన పర్ణశాల వంటి పర్ణశాలలను కూడళ్లలో ఏర్పాటు చేసి, వాటి ఎదుట ప్రార్థన గీతాలను ఆలపిస్తారు. ఈ తొమ్మిది రోజులూ విందు వినోదాలతోను, ఆధ్యాత్మిక ప్రార్థనలతోను గడుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment