ప్రతి అలంకరణ వెనుకా ఓ ప్రత్యే‘కథ’..
శాంటా క్లాజ్.. సర్వత్రా క్రేజ్..
ఇటు సంప్రదాయం.. అటు వైవిధ్యం
నగరంలో యేటా పెరుగుతున్న క్రిస్మస్ సందడి
విద్యుత్ కాంతులకూ ఓ ప్రత్యేకత
క్రిస్మస్ అంటే దయా, కరుణల జన్మదినం. ఇచ్చి పుచ్చుకోవడంలోని ఆనందం. అంతేనా.. క్రిస్మస్ అంటే కళాత్మకత కూడా అని నిరూపిస్తున్నారు సిటిజనులు. క్రీస్తు జన్మదినానికి కొన్ని రోజుల ముందుగానే నగరంలో మొదలయ్యే వేడుకలు ఆద్యంతం కళాత్మకతకు అద్దం పడతాయి. పండుగ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఇటు వైవిధ్యానికీ అటు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ చెట్టు, ఇతర అలంకరణలకు సంబంధించిన సందడి నెల రోజుల ముందునుంచే మొదలవుతుంది.. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు..
క్రిస్మస్ ముందు రాత్రి సమయంలో వచి్చ, అనుకోని విధంగా మంచి పిల్లలకు మాత్రమే బహుమతులు పంచే శాంటాక్లాజ్ పాత్రకు నేపథ్యం చర్చిఫాదర్ సెయింట్ నికోలస్ అని చరిత్ర చెబుతోంది. క్రిస్మస్ వేడుకల కోసం శాంటాక్లాజ్‌లను తయారు చేయడంలో నగరంలో వివిధ రకాల కొత్త పద్ధతులు, గెటప్స్ పుట్టుకొస్తూన్నాయి. ఎరుపు రంగు దుస్తుల్లో పొడవైన తెల్లని గెడ్డం, క్యాప్... ఈ మూడూ ప్రధానంగా తీసుకుని, మిగిలిన గెటప్స్‌కూ సృజనాత్మకతను జోడిస్తూ వెరైటీ ‘శాంటా’లను సృష్టిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నారు.
పండుగ బీట్.. డిజైనర్ ‘ట్రీ’ట్..
దాదాపు 15వ శతాబ్దపు ప్రాంతంలో క్రిస్మస్ రోజున కుటుంబ సభ్యులు తామే చెట్లు తయారు చేసి దాని చుట్టూ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే బహుమతులను ఉంచేవారట. చిన్నా పెద్దా దాని చుట్టూ ఆడిపాడేవారట. వీటిని యులె ట్రీ అని కూడా పిలిచేవారట. అలా ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సాధారణంగా ఈ చెట్టును పీవీసీతో లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. నగరంలో క్రిస్మస్ ట్రీ రూపకల్పనకు ఆకాశమే హద్దు అన్నట్టు డిజైనర్ ట్రీలు వచ్చేస్తున్నాయ్ ‘రెండు వారాల కిందటే కాలనీలో క్రిస్మస్ ట్రీని తయారు చేశాం. రోజుకో అలంకరణ జత చేస్తున్నాం. పండుగ రోజున దీన్ని అనూహ్యమైన రీతిలో అలంకరించి అందరినీ థ్రిల్ చేయనున్నాం’ అని కూకట్‌పల్లి నివాసి జెఫ్రీ చెప్పారు. ఎత్తు విషయంలోనూ ఇంతింతై అన్నట్టుగా.. క్రిస్మస్ ట్రీలు 3 నుంచి 30 అడుగుల వరకూ చేరుకున్నాయి. ‘సగటున మేం రోజుకు 20 క్రిస్మస్ చెట్లు అమ్ముతున్నాం. రూ.1000 నుంచి రూ.3000 వరకూ ధర ఉండేవి బాగా అమ్ముడవుతున్నాయి’ అని సికింద్రాబాద్‌లోని ఓ షాపు యజమాని చెప్పారు.
స్టార్.. సూపర్..
అవతారపురుషుని రాకకు చిహ్నంగా ముందుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉద్భవించింది. అందుకే ఈ వేడుకల్లో స్టార్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రమార్గం అంటే దేవుని మార్గం. దేవుని వైపు దారి చూపించేదిగా దీన్ని భావిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నగరంలో రకరకాల లైట్ల వెలుతురులో మెరిసిపోయే స్టార్స్ క్రిస్మస్ సందడిని రెట్టింపు చేస్తున్నాయి.
ప్రేమ సందేశమే ప్రధానం..
ఈ పండుగ వేడుకల్లో ప్రధానమైన శాంతాక్లజ్, ట్రీ, క్రిబ్.. వంటివన్నీ పండుగ విశిష్టతకు, సేవాభావపు ఔన్నత్యానికి అద్దం పట్టేవే. వీటిని నగరంలో ఎవరికి నచ్చినట్టు వారు అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా ఆయా విశేషాలు అందించే ప్రేమ సందేశాలను కూడా తెలుసుకోవడం, తెలియజెప్పడం అవసరం అంటున్నారు సికింద్రాబాద్‌లోని అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ ఉడుముల బాలÔౌరి.
విశేషాల క్రిబ్.. వెరైటీలకు కేరాఫ్
ఏసు జని్మంచిన స్థలానికి సంబంధించిన విశేషాలను తెలియపరిచే క్రిబ్.. 1223లో తొలిసారి సెయింట్‌ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రూపకల్పన చేశాడంటారు. దీనినే నేటివిటీ సీన్ లేదా మ్యాంగర్ సీన్ వంటి పేర్లతోనూ పిలుస్తారు. పశువులపాకలో ఏసు పుట్టాడనేదానికి సూచికగా దీనిని అందంగా ఏర్పాటు చేస్తుంటారు. పలు జంతువులతో పాటు పేదలు, రాజులు ఇలా అందరూ ఉండే చోట కొలువుదీరేలా దీన్ని నెలకొల్పే విధానం ఆకట్టుకుంటుంది. గడ్డిని తెచ్చి పాకను వేసి చిన్నారి క్రీస్తును కొలువుతీర్చి.. ఇలా చక్కగా డిజైన్ చేసే క్రిబ్ నగర క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్రిస్మస్ రోజుల్లో దాదాపు ఒకటి రెండు రోజుల పాటు సమూహాలుగా ఈ క్రిబ్ తయారీలో పాల్గొనడం కూడా చాలా మందికి నచ్చే విషయం.
Comments
Please login to add a commentAdd a comment