చీకటిని చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడు తన లేత వెచ్చని కిరణాలతో ఆ గ్రామాన్ని నిద్ర లేపాడు. పక్షుల కిలకిలరావాలతో, పట్టణానికి బయలుదేరుతున్న ఎడ్లబండ్ల చప్పుళ్ళతో, గేదెలను తోలుకుంటూ వెళ్తున్న పల్లె పిల్లగాళ్ళ అరుపులతో, నీళ్ళ కోసం బయలుదేరిన అమ్మలక్కల బిందెల చప్పుళ్ళతో దినచర్య ప్రారంభించే ఆ అందమైన గ్రామం ఆరోజు మరింత సందడిగా మారింది.
రాత్రంతా తాగుబోతు నాన్న కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయి జ్వరంతో మత్తుగా నిద్ర పట్టేసిన సూరి ఈ హడావిడికి ఒక్కసారిగా లేచాడు. ‘అమ్మో! చాలా ఆలస్యమైందే! పండుగ రోజులు కదా, చాలా తొందరగా రావాలి అని నిన్న అమ్మగారు చెప్పారు.
ఈరోజు నా పని అయిపోయిందిలే’ అని అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ ‘ఒరేయ్ చద్దన్నమన్నా తిని వెళ్ళరా!’ అని అరుస్తున్న అమ్మ కేకలు కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున బయలుదేరాడు. అప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది ఆ ఇంటి యజమానురాలు. భయం భయంగా లోపలికి వస్తుండగా, ‘ఆగు!’ అనే మాట విని నిలబడిపోయాడు. అమ్మగారి వంకే చూస్తున్నాడు. ‘అమ్మగారూ! రాత్రంతా జ్వరం..’ అని పరిస్థితిని చెబుదామనే లోపులో దబదబమని బాదింది. ‘పండుగ రోజులు కదా, త్వరగా రావాలి అని చెప్తే లేటుగా వస్తావా?’ అని నోటికొచ్చినట్టు తిట్టింది. అసలే రాత్రి వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బల మీద ఈ దెబ్బలు తగలడంతో మరింత బాధపడుతూ పని దగ్గరకు పరుగెత్తాడు. దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చాడు. ఓదార్చేవారెవ్వరూ లేరక్కడ.
సూరి వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడు. సాయంత్రం తాగివచ్చి వాళ్ళమ్మను, చెల్లెళ్ళను, సూరిని చితకబాదుతాడు. ప్రతిరాత్రి పస్తే! వాళ్ళమ్మ జబ్బు చేసి నీరసంగా ఉంటుంది. అందుకని సూరిని ఆ ఊళ్ళో డబ్బున్న కాంతారావు ఇంట్లో పనికి పెట్టింది. సూరి ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇంట్లో పని చేస్తాడు. వాళ్ళు పెట్టే మిగిలిపోయిన అన్నం, కూరలు తింటూ జీవిస్తున్నాడు. చాకిరి చెయ్యడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆ యజమానురాలు కొట్టే దెబ్బలు, తిట్లు భరిస్తున్నాడు. ఇవన్నీ తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇల్లు చక్కబెడుతున్నాడు. ‘ఒరేయ్ సూరీ ఎంతసేపురా! ఇటురా!’ అనే కేకతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని వెళ్లాడు. కంటకురాలైన యజమానురాలి హెచ్చరికతో బండెడు గిన్నెలు తోమడం మొదలు పెట్టాడు.
అవి క్రిస్మస్ పండుగ రోజులు. కాంతారావుగారి ఇల్లంతా సందడే సందడి. ఇల్లంతా పువ్వులతో, కరెంటు దీపాలతో అలంకరించారు. అమ్మగారు, వాళ్ళ పిల్లలు ఖరీదైన బట్టలు, నగలు ధరించారు. పిండివంటల ఘుమఘుమలతో, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులతో, పిల్లల కేరింతలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. సూరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఈ సందడంతా గమనిస్తూనే ఉన్నాడు. భోజనాల సమయమైంది. అందరూ భోంచేశారు. సూరి ఒక్కడే మిగిలి పోయాడు.పెరట్లో కూర్చుని అమ్మగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మగారి కేక వినిపించింది. ‘రారా సూరీ అన్నం తిందువు గాని’.. వెంటనే ఆత్రంగా వెళ్ళాడు.
రాత్రి భోజనం లేదు. ఉదయం లేదు గదా ఇప్పుడు పెట్టే పిండి వంటలు ఆరగిద్దామంటూ తనకు పెట్టిన భోజనం వైపు చూశాడు. ఎంత ఆశతో వెళ్లాడో అంత నిరుత్సాహానికి గురయ్యాడు. మాడు అన్నం, వూడ్చి వూడ్చి వేసిన కూర చూసి తినలేక దుఃఖం పొంగుకు వచ్చింది. ఆకలంతా చచ్చిపోయింది. మంచినీళ్ళు తాగి వెళ్ళి, వారంతా తిన్న గిన్నెలన్నీ తోమి, మిగతా పనులన్నీ చక్కబెట్టి ఇంటికి బయలుదేరాడు. ఒళ్ళంతా హూనమైపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఇంటిలోకి అడుగు పెట్టాడు. అప్పటికే వాళ్ళ నాన్న బీభత్సం సృష్టించాడేమో! చెల్లెళ్ళంతా ఏడుస్తూ చలికి దుప్పట్లు లేక కాళ్ళు ముడుచుకొని వణుకుతూ పడుకున్నారు. తల్లి మంచం మీద మూలుగుతోంది.
గుడిసె అంతా చిందరవందర. సర్దిపెట్టే ఓపిక లేక తల్లి వద్ద తాను చిన్న గుడ్డ ముక్క పరచుకుని పడుకున్నాడు. పండగపూట కదా! కొడుకు ఏదైనా తెస్తాడని ఆశించిన తల్లి కుమారుని పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. సూరి పడుకున్నాడు గాని నిద్ర పట్టడం లేదు. ఏడుపొస్తోంది. అమ్మకు కనబడకుండా ఏడ్వాలనుకున్నాడు కాని, అదిమి పట్టేకొద్ది ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సూరి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ‘ఏంట్రా? నీ బాధేమిటో చెప్పమ్మా’ అమ్మ అడుగుతోంది. ఆ రోజు జరిగినదంతా అమ్మకు చెప్పాడు. తల్లి నచ్చచెప్ప ప్రయత్నించింది. తన్ను తాను తమాయించుకొని, ‘అమ్మా! క్రిస్మస్ అంటే ఏంటమ్మా?’ అని అడిగాడు.
వాళ్ళమ్మ చెప్పింది. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’.. ‘లేదు నాయనా! దేవుడు అందరికీ దేవుడే! ఈ లోకంలోని ప్రజలందరి కోసం ఆయన పుట్టాడు. మనలాంటి పేదోళ్ళ బతుకులు బాగుపరచడానికి, చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా చేసి తన రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు!’.. ‘అలా అయితే మనకేంటి ఈ పేద బతుకు?’ దుఃఖంతో అన్నాడు సూరి. ‘లేదు నాయనా! అసలైన పేదరికం భౌతికమైనది కాదు. మనలోని ఆత్మకు సంబంధించినది. పాపంలో బందీయైన ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా దరిద్రుడే! ప్రేమ హీనత, క్షమించలేకపోవడం, అహంభావం, ఇతరులను అవమానించడం లాంటివి ఆధ్యాత్మిక పేదరికానికి నిదర్శనాలు.
అలాంటి స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చడానికి యేసయ్య కూడా అందరికీ దగ్గరవ్వడానికి పేదవానిగానే వచ్చాడు. బెత్లేహేము గ్రామంలో పశువుల తొట్టెలో పుట్టాడు. ‘అయ్యో! పశువుల తొట్టా? దేవుడు పశువుల తొట్టెలో పుట్టడమేంటమ్మా?’.. ‘ఆయన పశులతొట్టెలో పుట్టాడు కాబట్టే, సామాన్యులైన గొర్రెల కాపరులు ఆయనను మొదట దర్శించుకున్నారు. దేవుడు వారికి ఇంత దగ్గరగా వచ్చినందుకు వారి ఆనందానికి అవధులు లేవు. యేసుక్రీస్తు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాక అనేకమంది రోగులను బాగుచేశాడు, బీదవాళ్ళను, కుష్ఠు రోగులను అక్కున చేర్చుకున్నాడు. కన్నీరు తుడిచి, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతేకాదు! మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు.
తలలో ముళ్ళు, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. కడుపులో బల్లెపు పోట్లు, శరీరమంతా మాంసపు ముద్దగా మారి రక్తాన్ని చిందించాడు. దుర్మార్గులు పొందాల్సినవన్నీ ఆ ప్రేమమయుడు తనపై వేసుకున్నాడు. ఈ ప్రాణత్యాగం చేయడానికి పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. మరో గొప్ప సంగతి. చనిపోయి మూడవరోజు తిరిగి లేచాడు’ అని తల్లి అనేక విషయాలు సూరికి తెలిపింది. ‘అయితే ఇకనుండి నేను ఏడ్వను. మా అమ్మగారిని తిట్టను, నాన్నమీద కోపపడను. వీళ్ళందరినీ ప్రేమిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా ఫర్వాలేదు. యేసయ్య నాతో ఉన్నారుగా’ అంటూ ఆ చిన్ని హృదయంలోకి ప్రభువును చేర్చుకున్నాడు. తిట్లకు, తన్నులకు, పస్తులకు సూరి భయపడట్లేదు, ఏడ్వట్లేదు. కొన్ని రోజులు గడిచాయి. తాను పనిచేసే ఇంటి అమ్మగారికి జబ్బు చేసింది. ఆమె పిల్లలంతా ఆమెకు సేవ చేయలేక వెళ్ళిపోయారు.
రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ సమయంలో సూరి ఆమెకు ఎంతో శ్రద్ధతో çసపర్యలు చేయడం మొదలుపెట్టాడు. చావు బతుకుల్లో ఉన్న ఆమెను బతికించాడు. ఆమె కోసం నిద్రాహారాలు లేకుండా ప్రార్థించాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె కోలుకుంది. ఆమె మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సూరిని దగ్గరకు పిలిపించింది. గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చింది. ‘ఒరేయ్ సూరీ! నేనంటే నీకు ఎందుకురా ఇంత ప్రేమ? నిన్ను ఇంతగా బాధలు పెట్టిన నన్ను ఎంత ఆదరించావురా! నా పిల్లలు కూడా నా పరిస్థితిని చూసి నన్ను విడిచి వెళ్ళిపోయారే! నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాచి మనిషిని చేశావురా’ అని మెచ్చుకుంటుంటే సూరి ‘మా అమ్మగారేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడెంత గొప్పవాడు’ అనుకుంటూ దేవున్ని స్తుతించాడు.
‘క్రీస్తు ప్రభువు నాలోకి వచ్చి ఉండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించి ఉండేవాణ్ణి కాదు. ఆ యేసయ్య ప్రేమతో పోల్చుకుంటే నేను చూపిన ప్రేమ సముద్రంలో నీటి చుక్క.. మంచినీళ్ళు తెమ్మంటారా?’ అని పైకి లేచాడు. సూరి మాటలకు నిశ్చేష్టురాలైంది. ఔను! బుద్ధిహీనులకు తెలివి కలిగించేది దేవుని వాక్యం. ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోయాయి. దేవుని ప్రేమను ఎంతగా దుర్వినియోగపరచాను. కొంచెం కూడా దేవుని ధ్యాస లేకుండా ఆడంబరాల మీదే మనసు పెట్టి, అసలు ఆశీర్వాదాన్ని కోల్పోయానే! ఈ చిన్న పిల్లవాని ద్వారా దేవుడు నిజంగా నా కన్నులు తెరిచాడు అని దేవునికి తనను తాను అర్పించుకున్నది.
ఇంటికి వెళ్ళిన సూరి అమ్మగారిలో వచ్చిన మార్పును తన కుటుంబంతో పంచుకున్నాడు. తెల్లారింది. అమ్మగారింటికి బయలుదేరాడు. ఆమె సాదరంగా సూరిని ఆహ్వానించి కేకు కోయించి, కొత్త బట్టలు ధరింపజేసి, ప్రార్థన చేసింది. ‘అమ్మగారూ! క్రిస్మస్ పండుగ అయిపోయింది కదండీ. మళ్ళీ ఇవన్నీ ఏంటండీ’ అడిగాడు. ‘లేదురా సూరీ! అసలు పండుగ నా జీవితంలో ఇదే! నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నేను ద్వేషించిన వారు నాకు సహాయం చేసి నిజమైన ప్రేమంటే ఏమిటో చూపించారు’.. ఈ మాటలకు సూరి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
తన బంధువులు, స్నేహితులు అందరిముందు ‘సూరిని నా కొడుకుగా చేసుకొంటున్నాను. నా తదనంతరం ఈ యావదాస్తికి అతడే వారసుడు. క్రిస్మస్ బహుమానంగా దేవుడు సూరిని నాకు అనుగ్రహించాడు’ అని చెమ్మగిల్లిన కళ్ళతో సూరిని వాటేసుకుంది. ఒక మనిషికి కనువిప్పు కలగడమే నిజమైన పండుగ. క్రైస్ట్, మాస్ అనే రెండు పదాల కలయిక క్రిస్మస్. దీని అర్థం క్రీస్తును ఆరాధించడం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మన్ జరుపుకుంటారు. క్రీస్తు జననం చరిత్రాత్మకమైనది. సుప్రసిద్ధ చరిత్రకారులు క్రీస్తు చరిత్రను అద్భుతంగా వివరించారు.
వారిలో రోమా చరిత్రకారుడు గాయిస్ ప్లినియస్ ఒకడు. ఇతడు రోమా చక్రవర్తి ట్రాజన్ దగ్గర మేజిస్ట్రేట్‌గా క్రీ.శ 98 నుండి 117 వరకు పనిచేశాడు. చక్రవర్తియైన ట్రాజన్‌కు ఇతనికి జరిగిన ఓ సంభాషణ ఆ కాలంలోని క్రైస్తవుల నిబద్ధతలను వెల్లడిచేసింది. ‘క్రైస్తవులు చీకటి పడకముందే ఒక నియమిత సమయానికి కలుసుకొనేవారు. క్రీస్తును దేవునిగా సంబోధిస్తూ పాటలు పాడేవారు. తాము ఎప్పుడూ ఏ దోషము, దొంగతనమును చేయమని, తాము కట్టుబడియున్న పవిత్ర ప్రమాణమును గౌరవిస్తామని తీర్మానించుకున్నారు. తమ మాటను ఎన్నడు అబద్ధముగా మార్చమని, తప్పుడు ప్రమాణము చేయమని చెప్పుకొనేవారు’.
పైమాటలను గమనిస్తే యేసుక్రీస్తును అంగీకరించి మారుమనస్సు పొందిన పిదప వారు నమ్మిన వాక్యమునకు దేవుని బిడ్డలు ఏవిధంగా కట్టుబడియున్నారో విశదమవుతుంది.అపొస్తలుడైన పౌలు తన సువార్త యాత్రలో ఒకసారి గ్రీసు దేశమునకు వెళ్ళాడు. గ్రీసు రాజధాని ఏథెన్సు మహానగరం. విశ్వ విజేతగా పేరుపొందిన అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వజ్ఞానులు సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఈ దేశానికి చెందినవారే! అక్కడి ప్రజలు తత్త్వజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ‘గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదకుచున్నారు’ అని పౌలు ప్రస్తావించుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏథెన్సులో అరీయొపెగు అనే ప్రాంతం ఉన్నది. దానిని అరీసు కొండయని పిలుస్తారు.
ఏథెన్సు మహాసభ వారు అక్కడ కూర్చుండేవారు. ఆ పట్టణంలోని ఘనులు, ధనికులు, అధికారులలోని ముఖ్యులు దీనిలో సభ్యులుగా ఉండేవారు. మొదట్లో దేశంలో జరిగే నేరములను ఈ ప్రాంతంలోనే విచారించి, నేరస్థులకు శిక్షలు విధించేవారు. తరువాతి కాలంలో దేశపాలన విషయాలను, రాజనీతి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను కూడా తర్కిస్తుండేవారు. ఎవరైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటే, ఆ సభకు వెళ్ళి చెప్పాలి. వారు చెప్పిన వాటిలో సత్యం లేకపోతే, తేలు విషాన్ని వారికిచ్చి అక్కడే వారిని చంపేస్తారు. అక్కడ పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. అపొస్తలుడైన పౌలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని చెప్పడానికి అరీయొపెగు మధ్యన నిలిచి, నిర్భయంగా ప్రకటించాడు. అనేకమందిని ఆలోచింపచేసిన ప్రసంగమది: ‘‘ఏథెన్సు వారలారా! మీరు సమస్త విషయములలో విశేష భక్తి గలవారై ఉన్నట్లు కనబడుచున్నది.
నేను మీ పట్టణములో సంచరించుచుండగా నాకొక బలిపీఠము కనబడింది. దానిమీద ‘మాకు తెలియబడని దేవుడు’ అని వ్రాసియుంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి గలిగి యున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను’’.. తెలియబడని దేవునికి నిర్మించిన బలిపీఠాన్ని గ్రీకు భాషలో ‘అగ్నోస్టిక్ థియోస్’ అంటారు. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏథెన్సులో ఒక తెగులు వ్యాపించింది. భయంకరమైన తెగులు ద్వారా ప్రజలు చనిపోతున్నారు. ఎన్నో పూజలు, ప్రయత్నాలు చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆ సమయంలో అక్కడ ప్రజాదరణ పొందిన ఎపిమెనిడెస్, అరాటస్ అను ఇద్దరు తత్త్వజ్ఞానులు ఉండేవారు. ప్రజలు వారి యొద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళగక్కారు.
వచ్చిన తెగులు తొలగిపోవడానికి పరిష్కార మార్గాన్ని చూపాలని అడిగారు.అప్పుడు వారు ఈ విచిత్రమైన సలహాను ఇచ్చారు: ‘మీ శక్తి కొలది కొంతమంది దేవుళ్ళను ఆరాధించుచున్నారు. మీకు తెలియని దేవుళ్ళు కూడా ఉండవచ్చు. బహుశా వారు మీ మీద ఆగ్రహించి ఈ తెగులును పంపియుండవచ్చు. ఈ తెగులు అరికట్టాలంటే మీరు ఒక బలిపీఠమును కట్టి దానికి తెలియబడని దేవుడు అని పేరు పెట్టండి. ఆ దేవుడు శాంతించి తెగులును నిలిపివేయవచ్చు’.. ఆ మాటలను లక్ష్యపెట్టిన ప్రజలు తెలియబడని దేవునికి బలిపీఠం కట్టారు. అక్కడ వారు చేసే ప్రార్థనలు తెలియబడని దేవుని దగ్గరకు వెళ్తున్నాయని భ్రమపడేవారు. సరిగ్గా ఆ ప్రజల ప్రశ్నలకు పౌలు చక్కని సమాధానాలను ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు విశిష్ట లక్షణాలను కలిగియుంటాడు. వాటిలో మొదటిది: ‘ఆయన సృష్టికర్త’. తన మహిమ కోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు.
మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే! రెండవది: దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా ఉండువాడు కాదు. గ్రీకులలో కొందరు జ్ఞానులు దేవుడున్నాడు గాని, ఆయన మనుషులను పట్టించుకోడు అని బోధించేవారు. ఆ ఆలోచనను పౌలు ఖండించాడు. దేవుడు మానవుని పట్ల శ్రద్ధ కలిగియుంటాడు. మనిషికి దగ్గరగా ఉండాలనే మనుష్య రూపంలో ఈ లోకానికి ఏతెంచాడు. మూడవది: దేవుడు మనిషి నుండి మార్పును ఆంకాక్షిస్తున్నాడు. ఆ మార్పు హృదయానికి సంబంధించినది. ఇత్యాది విషయాలను తెలియచేయడం ద్వారా పౌలు అనేకులను సత్యం వైపు నడిపించాడు.
క్రీస్తు రాక పుడమిని పులకింపచేసింది. తరతరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు పుట్టుక. క్రీస్తుకు పూర్వం ఎందరో ప్రవక్తలు ఆయన రాకను కాంక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు పలికారు. వారి ప్రవచనాలు తనలో నెరువేర్చుకుంటూ క్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించారు. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము రోమా పాలనలో ఉంది. దాస్యం, అన్యాయం, అవినీతి ముమ్మరంగా ఉన్నాయి. వాటి నుండి విముక్తి కోసం మెస్సీయా రావాలని ఆశించారు. అయితే క్రీస్తు రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇవ్వడానికి రాలేదు. అందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్య్రం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ కాలంలోని సుంకపు గుత్తదారుడైన మత్తయి యేసుక్రీస్తు చరిత్రను వ్రాసే భాగ్యాన్ని పొందుకున్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో ఇలా ఉంటుంది.
పాతనిబంధన గ్రంథంలో అబ్రాహాముకు దావీదుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అబ్రాహామును యూదులకు తండ్రిగా పిలిచారు. అతడు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. కల్దీయ దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి కనాను దేశానికి వచ్చి దైవ సంకల్పంలో పాలిభాగస్తుడయ్యాడు. అతని కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురినీ మూలపురుషులు అని పిలుస్తారు. వీరి సంతానమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది నలభై సంవత్సరాల అరణ్యయాత్ర తదుపరి యెషువా నాయకత్వంలో కనాను దేశాన్ని చేరుకున్నారు. నాలుగు శతాబ్దాలు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఆ ప్రజలు రాజు పాలన కోసం పట్టుబట్టారు. మొదటి రాజుగా సౌలు, తర్వాత దావీదు వారిని పరిపాలించారు. యేసుక్రీస్తు దావీదు వంశంలోను జన్మించి పాతనిబంధన లేఖనాలను నెరవేర్చారు. యేసుక్రీస్తు పుట్టుక అకస్మాత్తుగా జరిగింది కాదు. అది ప్రవచనానుసారం.
క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, కన్య గర్భాన ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తాడని ఎన్నో యేండ్ల క్రితం ఝెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. పశువుల తొట్టెలో జన్మిస్తాడని యోబు గ్రంథంలోను, బెత్లేహేములో ఉదయిస్తాడని మీకా గ్రంథంలోను, నీతి చిగురుగా వస్తాడని జెకర్యా గ్రంథంలోను స్పష్టంగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం కనిపిస్తుందని, జ్ఞానులు ఆయన్ను దర్శించుకుంటారని, ఆయనకు ముందుగా యోహాను అనే భక్తుడు వస్తాడనే ప్రవచనాలు చాలా సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొదటిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఆయన్ను దర్శించుకున్నారు. ‘మీరు భయపడకుడి.
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూత ద్వారా గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఆనాడు క్రీస్తు పుట్టిన చోట ఇప్పుడు ఓ గొప్ప దేవాలయాన్ని చూస్తాం. బెత్లేహేము సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ దేవాలయంలో క్రీస్తు పుట్టినచోట ఉన్న నక్షత్రాన్ని చూసి వస్తారు. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. బేత్లెహేము అనగా రొట్టెల గృహం. ఇది ప్రపంచ నగరాలతో పోలిస్తే చాలా చిన్నది. కాని, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు.
జస్టిన్ మార్టర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా, 3వ శతాబ్దికి చెందిన చరిత్రకారులు ఆరిజన్, యుసేబియస్‌లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్‌స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. బైబిల్‌ను లాటిన్ బాషలోనికి అనువదించిన చరిత్రకారుడు సెయింట్ జెరోమ్ కూడా క్రీ.శ 384 సంవత్సరంలో ఇక్కడే సమాధి చేయబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. క్రీ.శ 614లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలును ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు. వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే, ఆ చర్చ్‌లో యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే!
6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చిని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చిలో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అనే అక్షరాలు చెక్కబడియున్నవి. యేసుక్రీస్తు జన్మించిన తదుపరి ఆయన్ను వెదకుచూ తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలుకు వచ్చారు. యూదుల రాజు అంతఃపురంలో జన్మిస్తాడని భావించి హేరోదు రాజునొద్దకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆరాధించడానికి వచ్చామని తెలియచేశారు. వారి మాటలు హేరోదు రాజును కలవరపరచాయి.
శాస్త్రులను పిలిచి క్రీస్తు జన్మించే స్థలం ఏమిటని ప్రశ్నించాడు. వారు లేఖనాలను పరిశీలించి ఆయన బ్లెత్లేహేములో జన్మిస్తాడని తెలియచేశారు. మీరు వెళ్ళి ఆయన్ను ఆరాధించి తిరిగి నా యొద్దకు రండి అని హేరోదు జ్ఞానులను పంపివేశాడు. వారు వెళ్ళి బాలుడైన యేసును కనుగొని, ఆయన ముందు సాగిలపడి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు దేవుని చేత బోధించబడినవారై మరియొక మార్గమున తమ దేశములకు వెళ్ళారు. బంగారము క్రీస్తు దైవత్వమునకు, రాజరికమునకు, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడని, బోళము ఆయన మానవుల నిమిత్తం పొందబోయే శ్రమలకు సాదృశ్యమని బైబిల్ పండితులు వివరించారు. క్రిస్మస్ ప్రేమ పండుగ. నిజమైన ప్రేమ విశిష్టతను తెలిపే పండుగ.
ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అనే ధన్య సత్యాన్ని అర్థం చేసుకొనే ప్రతి ఒక్కరూ క్రిస్మస్‌ను ఆత్మానుసారంగా పాటిస్తారు. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’– (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ మనకు ఎక్కువగా వినిపించేది ‘ప్రేమ’. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరముగా మారిపోయింది. శాశ్వత ప్రేమ, నిజమైన ప్రేమ మానవ ఊహలకు మించినది. ఆ ప్రేమ ‘ప్రేమాస్వరూపియైన’ దేవుని నుంచి మాత్రమే రావాలి.
క్రీస్తు ప్రభువు కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు ఆ ప్రేమను సిలువలో మరణించుట ద్వారా ఋజువుపరచాడని పౌలు రోమాలో సంఘానికి వ్రాసిన ఉత్తరంలో తెలియచేశాడు. మనమింకను పాపులమై ఉండగానే, శత్రువులమై యుండగానే, బలహీనులమై యుండగానే క్రీస్తు యుక్తకాలమున మనకొరకు మరణించెను. దేవుడు తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరచి సమసమాజ నిర్మాణానికి చక్కని మార్గాన్ని ఉపదేశించారు. ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అనే జీవనసూత్రాన్ని క్రీస్తు ఉపదేశించారు. ప్రతియేటా డిసెంబర్ 26వ తేదీని ‘బాక్సింగ్ డే’ అని పిలుస్తారు. క్రిస్మస్ తర్వాతి రోజున అవసరతలో ఉన్నవారికి బహుమతులు పంచుతారు. ఎవరి స్థాయిని బట్టి వారు వారికి తెలిసిన వారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి కానుకలు పంపి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.
‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను’ అని క్రీస్తు పలికిన మాటను క్రైస్తవులు అత్యధికంగా విశ్వసిస్తారు. పాపపు అంధకారంలో చిక్కి, నిత్యశిక్షను మూటకట్టుకున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయన రక్షకుడు అని బైబిల్ తెలియచేస్తున్న విషయం. మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానమై యుంటాడు.
‘ఓ దేవా! నన్ను అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, పాపము నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించు’ అని మానవుడు ప్రార్థిస్తే.. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు సత్యమై, వెలుగై, జీవమై, పరిశుద్ధుడుగా తన ఉనికిని వెల్లడిచేశాడు. వెలిగింపబడిన హృదయం నుండి జాలువారిన ఓ మధురమైన పాట ఇది. ‘కొనియాడ తరమే నిను.. కోమల హృదయ.. కొనియాడ తరమే నిను. తనరారు దినకరు బెను తారలను మించు... ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ నీవు’.. సర్వలోకంబుల బర్వు దేవుడువయ్యు.. నుర్వి స్త్రీగర్భాన నుద్భవించితి నీవు.. కొనియాడ తరమే నిను’
సాక్షి పాఠకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’
‘ఆయన సృష్టికర్త’. తన మహిమకోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే!
సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment