హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్‌లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది.
ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది.
ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్‌లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment