పన్ను కాడ..‘లెక్క’ తేడా!
వాహనాల జీవితకాల పన్ను చెల్లింపులో అక్రమాలు
14కు బదులు 12 శాతమే చెల్లింపు
ఆటో మొబైల్ డీలర్ల మోసాలు
ఆర్టీఏ పరిశీలనలో వెల్లడి
సిటీబ్యూరో: వాహనాల జీవిత కాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లింపులో కొందరు ఆటో మొబైల్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలపై రవాణా శాఖకు 14 శాతం జీవిత కాల పన్ను చెల్లించవలసి ఉంటుంది. కొందరు డీలర్లు వాటి ధరలను రూ.10 లక్షల కంటే తక్కువగా చూపుతూ 12 శాతం లైఫ్‌ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్టరైన రెండు కార్లపైన సుమారు రూ.68 వేల వరకు పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. దీంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో జీవిత కాల పన్ను చెల్లింపులో అక్రమాలపై తనిఖీలు చేపట్టాలని రవాణా కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కూకట్‌పల్లి, ఖైరతాబాద్, తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో మరో 15 వాహనాలపైన కూడా డీలర్లు ఇదే తరహాలో లక్షలాది రూపాయల మేర పన్ను ఎగవేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు రూ.కోట్లలో ఉండి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా మరింత లోతుగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇన్‌వాయిస్‌లలో మార్పు
కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలపై రవాణా శాఖ రెండు రకాల జీవిత కాల పన్ను విధిస్తోంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన కార్లకువాటి ధరలో 14 శాతం... అంతకంటే తక్కువ ఖరీదైన వాటిపై 12 శాతం చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ వెసులుబాటును అవకాశంగా తీసుకొని కొందరు డీలర్లు వాహనాల ఇన్‌వాయిస్‌లో రూ.9.90 లక్షలుగా నమోదు చేశారు. ఈ మేరకు వాహనం కొనుగోలు చేసిన వ్యక్తికి అసలు ధరతో కూడిన ఇన్‌వాయిస్ అందజేసి... ఆర్టీఏకు మాత్రం సవరించిన ఇన్‌వాయిస్ మేరకు జీవిత కాల పన్ను చెల్లించారు. కొనుగోలుదారులకు, ఆర్టీఏ అధికారులకు అనుమానం రాకుండా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులతో తమ జేబులు నింపుకున్నారు. ఇలా నమోదైన రెండు వాహనాలపై అనుమానం రావడంతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు వాహనాల అసలు ధరల పట్టికను తెప్పించుకొని పరిశీలించారు. రూ.11 లక్షల ఖరీదైన వాహనాల ఇన్‌వాయిస్‌లను రూ.9.95 లక్షల చొప్పున సృష్టించినట్లు గుర్తించారు. ఒక్కో వాహనంపై రూ.1.54 లక్షల లైఫ్‌ట్యాక్స్ చెల్లించవలసి ఉండగా... తప్పుడు ఇన్‌వాయిస్‌లతో రూ.1.20 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో మోసానికి పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రవాణా కమిషనర్‌కు విన్నవించారు. ఈ ఉదంతంతో అప్రమత్తమైన కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించారు.
పునరావృతం కాకుండా చర్యలు
ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా రవాణా శాఖ కార్యాచరణకు దిగింది. వాహనాల తయారీదారులు నిర్ణయించిన ధరలు.. వాటి ప్రకారం చెల్లించవలసిన జీవిత కాల పన్ను వివరాలు రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ధరల వివరాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నప్పుడే పన్ను చెల్లింపుల్లోనూ పారదర్శకత ఉంటుందని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు అక్రమాలకు పాల్పడిన డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు పూర్తయిన తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.