న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది.
ఈ మేరకు ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కు ఓ లేఖ రాశారు. డీలర్లకు పరిహార స్వరూపాన్ని నిర్ణయించే విషయంలో ఎఫ్‌ఏడీఏ ప్రతిపాదించే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా ఫోర్డ్ ఇండియాను ఆదేశించాలని గులాటీ ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. పరిహార ప్యాకేజీలాంటిదేమీ ప్రకటించకుండానే నాన్–డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్‌డీఏ) మీద సంతకాలు చేయాలంటూ డీలర్లను ఫోర్డ్ ఇండియా బలవంత పెడుతోందని గులాటీ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో డీలర్లు, కస్టమర్లతో పాటు ఆయా డీలర్‌షిప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలను కూడా పరిరక్షించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని గులాటీ కోరారు. గడిచిన పదేళ్లలో భారత మార్కెట్లో దాదాపు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఫోర్డ్.. ఇక్కడి తమ తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, ఇకపై దిగుమతి చేసుకున్నవే విక్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment