చర్చలు గరంగరం..
ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇవ్వబోమంటున్న రైతులు
పరిహారం ప్యాకేజీపై స్పష్టత లేని అధికారులు
అసంపూర్తిగా ముగిసిన సమావేశం
విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం భూసేకరణపై చర్చించేందుకు శుక్రవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రైతులు, నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశం గరంగరంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రైతు నాయకులు, జిల్లా అధికార యంత్రాంగానికి మధ్య పరిహారం విషయంలో స్పష్టత కొరవడింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పరిహారం డిమాండ్ చేయడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం భూసేకరణకు సంబంధించి మొదటి దశలో 450 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణపై ఇప్పటికే అధికారులు రైతులతో పలుమార్లు చర్చలు జరిపారు. రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ఎయిర్ పోర్టును మరింత విస్తరించాలని, ఇందుకోసం రెండో దశలో మరో 260 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. రెండు దశల్లో మొత్తం 710 ఎకరాలు ప్రయివేటు భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పరిహారంపై చర్చించేందుకు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
ప్రభుత్వ మార్కెట్ ధర చెల్లిస్తాం : కలెక్టర్
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ భూసేకరణ జరిగే గ్రామాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే సీఆర్డీఏ పరిధిలో స్థలాలు ఇస్తామని, లేదా భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని తెలిపారు. కేసరపల్లిలో ఎకరానికి రూ.79.12 లక్షలు, బుద్ధవరంలో రూ.50 లక్షలు, అజ్జంపూడిలో రూ.40 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఆయా గ్రామాల్లో సాధారణ విలువ ప్రకారం ధర ప్రకటించినట్లు చెప్పారు. ధర విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ విషయమై నిర్వాసితులు, రైతు నాయకులు జోక్యం చేసుకుని ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో నాలుగు గ్రామాల్లోనే తమకు స్థలం ఇవ్వాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలో అంటూ ఎక్కడపడితే అక్కడ ఇస్తే తమకు ఉపయోగం ఉండదని పేర్కొన్నారు.
చిన్న, సన్నకారు రైతులు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వాపోయారు. పరిహారం డబ్బు కూడా సకాలంలో రాదని పేర్కొన్నారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ అన్ని గ్రామాలకూ ఒకే విధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఏ గ్రామంలో ఎక్కువ ధర ఉంటే అదే విధంగా మిగిలిన మూడు గ్రామాలకూ వర్తింప చేయాలని కోరారు. ఐసోలేటెడ్ బేస్‌ను మార్పు చేస్తే బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల్లో దళితవాడలను తరలించాల్సిన అవసరం ఉండదని, ఆ ప్రాంత ప్రముఖులు సూచించారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని ఎయిర్‌పోర్టు డెరైక్టర్ ఎం.రాజ్‌కిషోర్‌ను జిల్లా కలెక్టర్ బాబు.ఎ కోరారు.
ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే హక్కుదారు పత్రం ఇస్తాం : చంద్రుడు
ఈ సమావేశంలో పాల్గొన్న రాజధాని ప్రాంత అబివృద్ధి సంస్థ అదనపు కమిషనర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరిస్తే యజమానులకు హక్కుదారుపత్రం ఇస్తామని చెప్పారు. తొమ్మిది నెలల్లో ఈ పత్రాలు అందిస్తామని తెలిపారు. భూమి స్థాయిని బట్టి ఎకరాకు వెయ్యి చదరపు గజాల నివాస స్థలం, 300 చదరపు గజాల వాణిజ్య విభాగం స్థలం రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో గన్నవరం ప్రాంత రైతు నాయకులు కడియాల రఘవరావు, వై.నరసింహారావు, చింతపల్లి సీతారామయ్య, వైస్ ఎంపీపీ గొంది పరంథామయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్, అనగాని రవి తదితరులు పాల్గొన్నారు.