
ప్రతీకాత్మక చిత్రం
పట్నా : రాష్ట్రంలో లైంగిక, యాసిడ్ దాడి బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రూ 3 లక్షల నుంచి రూ 7 లక్షలకు పెంచే ప్రతిపాదనకు బిహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా బిహార్ బాధితుల పరిహార చట్టం (సవరణ) 2018ని కేబినెట్ ఆమోదించిందని సెక్రటేరియట్ విభాగ ప్రత్యేక కార్యదర్శి ఉపేంద్ర నాథ్ పాండే మంగళవారం వెల్లడించారు.
గత నెలలో జాతీయ న్యాయ సేవల అథారిటీ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా లైంగిక, యాసిడ్ దాడుల్లో మహిళా బాధితులకు వరుసగా రూ 5 లక్షలు, రూ 7 లక్షలు పరిహారం అందించాలని ఓ విధానానికి రూపకల్పన చేశాయి. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్యాకేజ్‌లను సవరించాలని కేంద్రం కోరింది. కాగా, సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బిహార్ బాధితుల చట్టంలో అవసరమైన మార్పులు తీసుకువచ్చామని పాండే వివరించారు.
బాధితురాలు 14 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటే పరిహారం ఏడు లక్షల వరకూ అందించే వెసులుబాటు ఉందని చెప్పారు. యాసిడ్ బాధితులకు వారికి అయిన గాయాల తీవ్రతను బట్టి వారికి నెలకు రూ 10,000 పరిహారం ఇచ్చే అవకాశం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment