Automobiles industry
-
భారత్ నుంచి 1.9 బిలియన్ డాలర్ల కొనుగోళ్లకు అమెరికన్ కంపెనీ..
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ఈ ఏడాది భారత్ నుంచి 1.9 బిలియన్ డాలర్ల విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసే యోచనలో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గతేడాది 1 బిలియన్ డాలర్ల మేర కొనుగోళ్లు చేసిందని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. భారత్ మార్కెట్లో తమ కార్లను విక్రయించుకోవడానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు కావాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో గోయల్ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి చెప్పారు. విద్యుత్ వాహనాల పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న తరహాలోనే భారత్‌లోనూ ఎదగగలదని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్, ఇతర వాహనాల డిమాండ్ మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని.. రాబోయే రోజుల్లో మరింత తగ్గగలదని గోయల్ చెప్పారు. -
మహీంద్రా: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్! ధర ఎంతంటే?!
Mahindra Atom EV: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొనుగోలు దారులు శుభవార్త చెప్పింది. సామాన్యులకు సైతం బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రకటించింది. మహీంద్రా ఆటమ్ పేరుతో కే1, కే 2,కే3. కే4 అనే నాలుగు వేరియంట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మహీంద్రా సంస్థ మార్కెట్‌కు పరిచయం చేసింది. మొదటి రెండు కే1, కే3 వేరియంట్లు 7.4 కేడ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో, మిగిలిన కే2, కే4లు 11.1కే డ్ల్యూహెచ్ ప్యాక్‌తో రానున్నాయని తెలిపింది. ఇక ఈ వెహికల్స్ పీక్ పవర్ అవుట్ పుట్ 11పీఎస్‌గా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆటమ్ కే1,కే3 వేరియంట్స్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో వస్తుండగా..కే2, కే4 వేరియంట్స్‌లో ఎయిర్ కండిషనర్ సదుపాయం లేదు. 4జీ కనెక్టివిటీతో మొబైల్ డాకింగ్ స్టేషన్ ఫీచర్లు ఉన్నాయి.ఇక ఈ వెహికల్ 2,728 ఎంఎం, 1452 ఎంఎం వైడ్, 1576ఎంఎం పొడవు,1885వీల్ బేస్, 832 కిలోల నుంచి 903 కిలోల బరువుతో కేబిన్‌లో నలుగురు ప్రయాణికులు, బ్యాక్ సీట్లో 3 ప్రయాణికులు కూర్చునే సదుపాయం ఉంది. ధర ఎంతంటే! మహీంద్రా ఆటమ్ డిజైన్, ఫీచర్ల పరంగా పైసా వసూల్ కారుగా చెప్పవచ్చు. దీని ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉండొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ. వరకు నడుస్తుంది. -
'ఫోర్డ్' పంచాయితీలో సాయం చేయండి: ఎఫ్ఏడీఏ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కు ఓ లేఖ రాశారు. డీలర్లకు పరిహార స్వరూపాన్ని నిర్ణయించే విషయంలో ఎఫ్ఏడీఏ ప్రతిపాదించే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా ఫోర్డ్ ఇండియాను ఆదేశించాలని గులాటీ ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. పరిహార ప్యాకేజీలాంటిదేమీ ప్రకటించకుండానే నాన్–డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ) మీద సంతకాలు చేయాలంటూ డీలర్లను ఫోర్డ్ ఇండియా బలవంత పెడుతోందని గులాటీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలర్లు, కస్టమర్లతో పాటు ఆయా డీలర్‌షిప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలను కూడా పరిరక్షించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని గులాటీ కోరారు. గడిచిన పదేళ్లలో భారత మార్కెట్లో దాదాపు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఫోర్డ్.. ఇక్కడి తమ తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, ఇకపై దిగుమతి చేసుకున్నవే విక్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
మార్చిలో తగ్గిన వాహన విక్రయాల స్పీడు
ముంబై: వాహన విక్రయాలు మార్చిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్యాసింజర్, ట్రాక్టర్ల అమ్మకాల్లో తప్ప మిగిలిన విభాగాల్లో క్షీణత నమోదైంది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ ఆసోసియేషన్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు వ్యక్తిగత రవాణాకు ప్రాధ్యానతనివ్వడంతో ప్యాసింజర్ వాహన విక్రయాలు మార్చి నెలలో దూసుకెళ్లాయి. ఈ మార్చిలో 28 శాతం వృద్ధిని సాధించి మొత్తం 2,79,745 యూనిట్లుగా నమోదైనట్లు ఎఫ్ఏడీఏ ప్రకటించింది. గతేడాది ఇదే నెలలో 2,17,879 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ద్విచక్ర వాహన విక్రయాలు 2021 మార్చిలో 35 శాతం క్షీణించి 11,95,445 నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 42.2 శాతం క్షీణించాయి. గత సంవత్సరం 1,16,559 అమ్ముడవ్వగా 2021 మార్చిలో 67,372 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మూడు చక్రాల వాహన విక్రయాలు సైతం భారీగా(52 శాతం) పడిపోయాయి. 77,173 నుంచి 38,034 కు తగ్గాయి. ఇక ట్రాక్టర్ల అమ్మకాలు 29 శాతం పెరిగి 69,082 యూనిట్లు నమోదయ్యాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా వాహన విక్రయాలు 29 శాతం క్షీణించాయి. ‘‘కరోనా 3.2 కోట్ల మధ్య తరగతి కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ఆదాయాలు భారీగా పడిపోవడంతో ప్రజలు వాహన కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపలేదు. డీజిల్, పెట్రోల్ ధరలు నిరంతర పెరుగుదల వారిని మరింత నిరుత్సాహపరిచింది’’ అని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్ గులాటీ తెలిపారు. అయితే లో బేస్ కారణంగా ప్యాసింజర్, ట్రాక్టర్ వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. -
2021 ప్రపంచ ఆటోమొబైల్ డే: టాప్-5 బెస్ట్ కార్స్
"కార్ల్ బెంజ్" తన మొదటి ఆటోమొబైల్ మూడు చక్రాల మోటర్వ్యాగన్ కోసం సుమారు 135 సంవత్సరాల క్రితం 1886 జనవరి 29న పేటెంట్ దాఖలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకత్వం వహించడంలో "కార్ల్ బెంజ్" కీలక పాత్ర పోషించినందున ఈ రోజును 'ప్రపంచ ఆటోమొబైల్ డే'గా జరుపుకుంటారు. ఆటోమొబైల్ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఆటోమొబైల్ ప్రియులు నమ్ముతారు. ప్రపంచ ఆటోమొబైల్ డే సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న టాప్-5 ఉత్తమ కార్లను మీకోసం అందిస్తున్నాము. (చదవండి: పాత కారు.. టాప్ గేరు!) ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఎస్యూవీ జర్మన్ కార్ల తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది భారతదేశంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. పనితీరు విషయానికి వస్తే- ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఇంగోల్స్టాడ్ ఆధారిత కార్ల తయారీదారు నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ. ఇది 592 బిహెచ్పి వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఐకానిక్ నూర్బర్గింగ్ సర్క్యూట్ ను 7 నిమిషాల 42 సెకన్ల ల్యాప్ టైమ్‌తో తిరిగిన రికార్డు దీని పేరిట ఉంది. ఇది 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 250 కి.మీ/గం. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని మూడేళ్ల క్రితమే భారత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి దీనిని తీసుకోవాలంటే 8-9 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. అంత క్రెజ్ ఉంది దీనికి. ఇది ఇటాలియన్ కి చెందిన కంపెనీ. దీనిలో అత్యధిక శక్తినిచ్చే 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్ ఉంది. ఇది 641 బిహెచ్పి, 850ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.6 సెకన్ల సమయం తీసుకుంటే 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 12.8 సెకెన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 305 కి.మీ/గం.(చదవండి: సరికొత్తగా అమెజాన్ లోగో) మసెరటి లెవాంటే లగ్జరీ కార్ల తయారీ కంపెనీ చరిత్రలో మసెరటి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు కంపెనీ. మసెరటి తన మొదటి కారు A6ను 1947సంవత్సరంలో తయారుచేసింది. ఇండియా లగ్జరీ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కనిపిస్తుంది. మన దేశంలో 2018 జనవరిలో విక్రయించిన మొట్టమొదటి మసెరటి ఎస్యూవీ ఇది. ఈ ఎస్యూవీ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 271 బిహెచ్పి పీక్ పవర్, 600ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లెవాంటే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇది 230 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే నుంచి వచ్చిన అన్ని కార్ల కంటే 911 టర్బో ఎస్ అందరిని ఎక్కువగా ఆకర్షించింది. భారతదేశంలో ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ. 3.08 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 3.8-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పోర్స్చే 911 641 బిహెచ్పి, 800 ఎన్ఎమ్ పవర్ ఫిగర్ వల్ల 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే 0 నుంచి 200 కిలోమీటర్లు చేరుకోవడానికి 8.9 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం 330 కిలోమీటర్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ గత సంవత్సరం భారతదేశంలో కొత్త ఘోస్ట్ యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారుల కంపెనీ. దీని డెలివరీలు 2021 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కారు 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు మోటారు 563 బిహెచ్పి, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో సెల్ఫ్ లెవలింగ్ హై-వాల్యూమ్ ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీతో పాటు ఆల్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్ స్టీరింగ్‌ను అందించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కి.మీ. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం తీసుకుంటుంది. -
మార్కెట్లోకి కొత్త ‘వ్యాగన్ఆర్’
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన వ్యాగన్–ఆర్ శ్రేణిలో నూతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారును ‘బిగ్ న్యూ వ్యాగన్ఆర్’గా అభివర్ణించిన సంస్థ.. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మరో ఆప్షన్లో భాగంగా 1–లీటర్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.2 లీటర్ ఇంజిన్ కారు ధరల శ్రేణి రూ.4.89 లక్షలు–రూ.5.69 లక్షలు. 1–లీటర్ ఇంజిన్ ధరల శ్రేణి రూ.4.19 లక్షలు–రూ.4.69 లక్షలు కాగా, ఈ విభాగంలోని ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ ధర రూ.5.16 లక్షలు. హై టెన్షన్ స్టీలును వాడడం వల్ల నూతన వేరియంట్లో శబ్దం, కుదుపులు తక్కువగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ‘ఈ కారు కేవలం ఫ్యామిలీనే కాకుండా, యువ కొనుగోలుదారులను కూడా మంచి చాయిస్ కానుంది.’ అని సంస్థ సీఈఓ కెనిచి అయుకవా మాట్లాడుతూ.. వ్యాఖ్యానించారు. జీఎస్టీ గణనీయంగా తగ్గాలి: ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై 28% జీఎస్టీ రేటు, ఇందుకు అదనంగా 15% సెస్ అమల్లోఉండగా.. ఇవి తగ్గాల్సిన అవసరం ఉందని కెనిచి అయుకవా అన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. -
కారు... రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్స్ పరిశ్రమకు గడ్డుకాలం ఇప్పుడప్పుడే తొలిగేలా కనిపించడం లేదు. ప్రధానంగా దిగ్గజ కార్ల కంపెనీల అమ్మకాల క్షీణత మరింత తీవ్రమవుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి నెల ఏప్రిల్‌లో టాప్ వాహన సంస్థల కార్ల అమ్మకాలన్నీ రివర్స్‌గేర్‌లోనే కొనసాగాయి. మారుతీతో సహా టయోటా, జనరల్ మోటార్స్, మహీంద్రా ఇలా అగ్రగామి కంపెనీల అమ్మకాల్లో భారీగా చిల్లు పడింది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశీయంగా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వాహన కంపెనీలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తోందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే హోండా, ఫోర్డ్ సేల్స్ వృద్ధి చెందాయి. హ్యుందాయ్ దేశీ ఆమ్మకాలు కాస్త పుంజుకోగా... మొత్తం విక్రయాలు తిరోగమనంలోనే ఉన్నాయి. మరోపక్క, ద్విచక్ర వాహనాల సేల్స్ మాత్రం ఏప్రిల్‌లో మెరుగ్గా నమోదయ్యాయి. మారుతీ డీలా... దేశంలో నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఏప్రిల్ నెల మొత్తం అమ్మకాల సంఖ్య 86,196కు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 90,523 యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 11.4% క్షీణించాయి. ఇక దేశీ అమ్మకాలు కూడా 12.6% దిగజారి 90,523 యూనిట్ల నుంచి 79,119కి పడిపోయాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ ఆర్ అమ్మకాలు 25.4% క్షీణించి 26,043 యూనిట్లకు తగ్గాయి. ఇక ప్రీమియం చిన్న కార్లలో స్విఫ్ట్, ఎస్టిలో, రిట్స్ సేల్స్ మాత్రం ఏప్రిల్‌లో 10% వృద్ధి చెంది 23,659కి చేరాయి. హ్యుందాయ్ ఇలా...: కొత్త మోడల్స్ ఆసరాతో హ్యుందాయ్ కంపెనీ దేశీ అమ్మకాలు ఏప్రిల్‌లో 8.78% పెరిగాయి. క్రితం ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా 32,403 వాహనాలను విక్రయించగా... ఈ ఏడాది ఇదే నెలలో 35,248 యూనిట్లకు వృద్ధి చెందాయి. ఎక్సెంట్, గ్రాండ్, శాంటా ఫే వంటి కొత్త మోడళ్లకు తమ వినియోగదార్ల నుంచి మంచి స్పందన లభించిందని, దీంతో దేశీ అమ్మకాలు పుంజుకునేందుకు దోహదపడినట్లు కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ వివరించారు. అయితే, హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు(ఎగుమతులతో సహా) మాత్రం ఏప్రిల్‌లో 11.81% క్షీణించి 50,222కు తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే నెలలో మొత్తం సేల్స్ 56,953గా నమోదైంది. ఎగుమతులు 39% దిగజారి 24,550 యూనిట్ల నుంచి 14,974 యూనిట్లకు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. హోండా కార్స్ దేశీ సేల్స్ 30% వృద్ధితో 11,040 యూనిట్లుగా, ఫోర్డ్ దేశీ అమ్మకాలు 66.15% పెరిగి 7,044 యూ నిట్లుగా నమోదయ్యాయి. మొత్తం సేల్స్ 82.9% వృద్ధి చెందాయి. బైక్స్ జోరు... ద్విచక్ర వాహనాలకు సంబంధించి హీరో మోటోకార్ప్ విక్రయాలు ఏప్రిల్‌లో 14% పెరుగుదలతో 5,71,054 యూనిట్లకు ఎగబాకాయి. ఇక హెచ్ఎంఎస్ఐ సేల్స్ 21% వృద్ధి చెంది 3,13,942కు చేరాయి. యమహా ఇండియా కూడా 42% పుంజుకున్నాయి. 51,158 వాహనాలను ఏప్రిల్‌లో కంపెనీ విక్రయించింది. మరికొన్నాళ్లు నిరాశే: జీఎం ఇండియా మరో దేశీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం అమ్మకాలు సైతం రివర్స్‌గేర్‌లోనే పయనించి 12% క్షీణించాయి. దేశీ విక్రయాలైతే 15% పడిపోయాయి. క్రితం ఏడాది ఏప్రిల్‌లో 39,902 వాహనాలు అమ్ముడవగా... ఈ ఏడాది ఇదే నెలలో 34,107కు తగ్గాయి. ఫోర్ వీల్స్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 19% క్షీణతతో 11,677 యూనిట్లకు పడిపోయాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌లో 20.33% దిగజారి 8,328 యూనిట్లకు పడిపోయాయి. దేశీ విక్రయాలైతే మరింత ఘోరంగా 16 శాతం క్షీణించాయి. 7,562 యూనిట్లకే పరిమితమయ్యాయి. మరోపక్క, జనరల్ మోటార్స్ ఇండియా మొత్తం వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో 35.30 శాతం పడిపోయి 5,302 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనం, ఇతరత్రా ప్రోత్సాహకాలను కస్టమర్లకు అందించినప్పటికీ సెంటిమెంట్ ఇంకా ప్రతికూలంగానే కొనసాగుతోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాకే మార్కెట్‌పై ఎదైనా సానుకూల ప్రభావానికి ఆస్కారం ఉందని, అంతకంటే ముందు కోలుకునే అవకాశాల్లేవన్నారు.