కారు... రివర్స్‌గేర్‌! | Celerio a Bright Spot for Maruti Amid Weak April Sales | Sakshi
Sakshi News home page

కారు... రివర్స్‌గేర్‌!

Published Fri, May 2 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

కారు... రివర్స్‌గేర్‌!

కారు... రివర్స్‌గేర్‌!

 న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్స్ పరిశ్రమకు గడ్డుకాలం ఇప్పుడప్పుడే తొలిగేలా కనిపించడం లేదు. ప్రధానంగా దిగ్గజ కార్ల కంపెనీల అమ్మకాల క్షీణత మరింత తీవ్రమవుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి నెల   ఏప్రిల్‌లో టాప్ వాహన సంస్థల కార్ల అమ్మకాలన్నీ రివర్స్‌గేర్‌లోనే కొనసాగాయి. మారుతీతో సహా టయోటా, జనరల్ మోటార్స్, మహీంద్రా ఇలా అగ్రగామి కంపెనీల అమ్మకాల్లో భారీగా చిల్లు పడింది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశీయంగా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వాహన కంపెనీలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తోందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే హోండా, ఫోర్డ్ సేల్స్ వృద్ధి చెందాయి. హ్యుందాయ్ దేశీ ఆమ్మకాలు కాస్త పుంజుకోగా... మొత్తం విక్రయాలు తిరోగమనంలోనే ఉన్నాయి. మరోపక్క, ద్విచక్ర వాహనాల సేల్స్ మాత్రం ఏప్రిల్‌లో మెరుగ్గా నమోదయ్యాయి.

 మారుతీ డీలా...
 దేశంలో నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఏప్రిల్ నెల మొత్తం అమ్మకాల సంఖ్య 86,196కు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 90,523 యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 11.4% క్షీణించాయి. ఇక దేశీ అమ్మకాలు కూడా 12.6% దిగజారి 90,523 యూనిట్ల నుంచి 79,119కి పడిపోయాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ ఆర్ అమ్మకాలు 25.4% క్షీణించి 26,043 యూనిట్లకు తగ్గాయి. ఇక ప్రీమియం చిన్న కార్లలో స్విఫ్ట్, ఎస్టిలో, రిట్స్ సేల్స్ మాత్రం ఏప్రిల్‌లో 10% వృద్ధి చెంది 23,659కి చేరాయి.

 హ్యుందాయ్ ఇలా...: కొత్త మోడల్స్ ఆసరాతో హ్యుందాయ్ కంపెనీ దేశీ అమ్మకాలు ఏప్రిల్‌లో 8.78% పెరిగాయి. క్రితం ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా 32,403 వాహనాలను విక్రయించగా... ఈ ఏడాది ఇదే నెలలో 35,248 యూనిట్లకు వృద్ధి చెందాయి. ఎక్సెంట్, గ్రాండ్, శాంటా ఫే వంటి కొత్త మోడళ్లకు తమ వినియోగదార్ల నుంచి మంచి స్పందన లభించిందని, దీంతో దేశీ అమ్మకాలు పుంజుకునేందుకు దోహదపడినట్లు కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ వివరించారు.

 అయితే, హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు(ఎగుమతులతో సహా) మాత్రం ఏప్రిల్‌లో 11.81% క్షీణించి 50,222కు తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే నెలలో మొత్తం సేల్స్ 56,953గా నమోదైంది. ఎగుమతులు 39% దిగజారి 24,550 యూనిట్ల నుంచి 14,974 యూనిట్లకు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. హోండా  కార్స్ దేశీ సేల్స్ 30% వృద్ధితో 11,040 యూనిట్లుగా, ఫోర్డ్ దేశీ అమ్మకాలు 66.15% పెరిగి 7,044 యూ నిట్లుగా నమోదయ్యాయి. మొత్తం సేల్స్ 82.9% వృద్ధి చెందాయి.

 బైక్స్ జోరు...
 ద్విచక్ర వాహనాలకు సంబంధించి హీరో మోటోకార్ప్ విక్రయాలు ఏప్రిల్‌లో 14% పెరుగుదలతో 5,71,054 యూనిట్లకు ఎగబాకాయి. ఇక హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్ 21% వృద్ధి చెంది 3,13,942కు చేరాయి. యమహా ఇండియా కూడా 42% పుంజుకున్నాయి. 51,158 వాహనాలను ఏప్రిల్‌లో కంపెనీ విక్రయించింది.
 
 మరికొన్నాళ్లు నిరాశే: జీఎం ఇండియా
 మరో దేశీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం అమ్మకాలు సైతం రివర్స్‌గేర్‌లోనే పయనించి 12% క్షీణించాయి. దేశీ విక్రయాలైతే 15% పడిపోయాయి. క్రితం ఏడాది ఏప్రిల్‌లో 39,902 వాహనాలు అమ్ముడవగా... ఈ ఏడాది ఇదే నెలలో 34,107కు తగ్గాయి. ఫోర్ వీల్స్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 19% క్షీణతతో 11,677 యూనిట్లకు పడిపోయాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌లో 20.33% దిగజారి 8,328 యూనిట్లకు పడిపోయాయి.

దేశీ విక్రయాలైతే మరింత ఘోరంగా 16 శాతం క్షీణించాయి. 7,562 యూనిట్లకే పరిమితమయ్యాయి. మరోపక్క, జనరల్ మోటార్స్ ఇండియా మొత్తం వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో 35.30 శాతం పడిపోయి 5,302 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనం, ఇతరత్రా ప్రోత్సాహకాలను కస్టమర్లకు అందించినప్పటికీ సెంటిమెంట్ ఇంకా ప్రతికూలంగానే కొనసాగుతోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాకే మార్కెట్‌పై ఎదైనా సానుకూల ప్రభావానికి ఆస్కారం ఉందని, అంతకంటే ముందు కోలుకునే అవకాశాల్లేవన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement