భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్‌టర్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto)
భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.
మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్‌లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్‌యువి 'ఎక్స్‌టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్‌జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift)
ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్‌లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది.
(ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..)
ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్‌పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు.. 116 హార్స్‌పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment