
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ఈ ఏడాది భారత్ నుంచి 1.9 బిలియన్ డాలర్ల విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసే యోచనలో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గతేడాది 1 బిలియన్ డాలర్ల మేర కొనుగోళ్లు చేసిందని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు.
భారత్ మార్కెట్లో తమ కార్లను విక్రయించుకోవడానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు కావాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో గోయల్ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి చెప్పారు. విద్యుత్ వాహనాల పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న తరహాలోనే భారత్‌లోనూ ఎదగగలదని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్, ఇతర వాహనాల డిమాండ్ మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని.. రాబోయే రోజుల్లో మరింత తగ్గగలదని గోయల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment