గ్రేటర్‌లో ఆ పంచాయతీల విలీనం లేనట్టే! | No merge Panchayats in Greater | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో ఆ పంచాయతీల విలీనం లేనట్టే!

Published Wed, Oct 2 2013 1:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

గ్రేటర్‌లో ఆ పంచాయతీల విలీనం లేనట్టే! - Sakshi

గ్రేటర్‌లో ఆ పంచాయతీల విలీనం లేనట్టే!

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో శివారు పంచాయతీలను విలీనం చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంలో హైకోర్టు అక్షింతలు వేయడంతోపాటు ప్రజలు, ప్రజాప్రతినిధులూ విలీ నాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీల విలీనంపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, పురపాలక, చేనేత, జౌళిశాఖల మంత్రులు జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిం చారు. పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు నాగిరెడ్డి, అదర్‌సిన్హా, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వరప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 పంచాయతీల విలీనాన్ని ప్రజలు సైతం వ్యతిరేకించడం.. గ్రేటర్‌లో పంచాయతీల్ని విలీనం చేసుకునేది లేదంటూ జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం తీర్మానించడం.. శివార్లలోని ఎమ్మెల్యేలూ విలీనం వద్దని, ఆ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చాలని ఒత్తిడి చేస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తం 37 పంచాయతీల్ని గ్రేటర్‌లో విలీనం చేయడానికి సర్కారు ఉత్తర్వులివ్వగా, వాటి ని సవాల్‌ చేస్తూ శివారు గ్రామాల ప్రజలు కోర్టుకెళ్లారు. విలీన ప్రక్రియలో సరైన నిబంధనలు పాటించలేదంటూ కోర్టు ఆ ఉత్తర్వుల్ని కొట్టేసింది. నిబంధనల మేరకు మళ్లీ నోటీసులిచ్చి విలీనం చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించినా.. మారిన పరిస్థితుల్లో వాటిని ఒకేసారి గ్రేటర్‌లో విలీనం చేయకుండా మునిసిపాలిటీలుగా మార్చాలని మంత్రులు ప్రసాద్‌, జానా అభిప్రాయపడినట్టు సమాచారం.

మహీధర్‌రెడ్డి కూడా వారితో ఏకీభవించినట్టు తెలిసింది. అయితే ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి జరగాలంటే వాటిని విలీనం చేస్తేనే మంచి దన్న అభిప్రాయం వ్యక్తమైనా.. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మునిసిపాలిటీలుగా మార్చడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై సీఎం కిరణ్‌తో చర్చిం చాక ఒక నిర్ణయానికి రావాలన్న అభిప్రా యం వ్యక్తమైనట్లు సమాచారం. పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఈ మేరకు ప్రతి పాదన వస్తే.. దానికి సంబంధించి కసరత్తు చేసి ముందుకు తీసుకెళ్తామని పురపాలక అధికారులు చెప్పినట్లు తెలిసింది. అలాగే విలీన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేశాక తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. మరోవైపు విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పది గ్రామాల విలీనానికి సంబంధించి ఇలాంటి వివాదమే ఉన్నందున ఏమి చేయాలని అధికారులు ప్రశ్నించగా.. దానికి సంబంధించి మళ్లీ నోటీసులు జారీ చేసి విలీనం చేసుకోవడానికి అధికారులకు వెసులుబాటు కల్పించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఆ పంచాయతీల్ని విలీనం చేస్తే తప్ప.. భీమిలి మునిసిపాలిటీని గ్రేటర్‌లో కలవడానికి ఆస్కారం ఉండదని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.

 ఈ ఫైళ్లు వెనక్కి ఇచ్చేయండి: విలీన ఉత్తర్వుల్ని హైకోర్టు సస్పెండ్‌ చేసినందున పంచాయతీల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement