
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని కూకట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో గోపాల్‌నగర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వద్ద(హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపం లో) ఉన్న పలు సర్వే నంబర్లలో జరుగుతున్న అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులను నిలిపేయాలని హైకోర్టు బుధవారం నిర్మాణదారులను ఆదేశించింది. ఇప్పటికే నిర్మించిన ఫ్లాట్లను అమ్మరాదని న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. గోపాల్‌నగర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వద్ద పలు సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ నిర్మాణాల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు జోక్యం చేసుకున్నారు. దీనిపై సదరు నిర్మాణదారులు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
తమ భూమిలో నిర్మాణాలు చేస్తుంటే అధికారులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది సంపత్ ప్రభాకర్‌రెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చారు. నిర్మాణాలు పూర్తయిన వాటికే క్రమబద్ధీకరణ వర్తిస్తుందని చెప్పారు. పిటిషనర్లు నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఈ విషయంలో కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment